నవరాత్రి: దిల్లీలో మాంసం షాపులను ఎందుకు మూయించేస్తున్నారు? అసలు మాంసం తినని వారు ఎంత మంది?

    • రచయిత, రాజేశ్ పెదగాడి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశ రాజధానిలో మాంసం దుకాణాలను మూసివేయాలని ఇద్దరు దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వీటిపై మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది.

తొమ్మిది రోజుల నవరాత్రి వేడుకల సమయంలో మాంసం దుకాణాలను మూసి ఉంచాలని దక్షిణ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, తూర్పు దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు పిలుపునిచ్చారు.

ఈ విషయంలో ఆదేశాలు జారీ చేయాలంటూ దక్షిణ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌డీఎంసీ) మేయర్ ముకేశ్ సూర్యన్.. మున్సిపల్ కమిషనర్‌కు ఒక లేఖ కూడా రాశారు. ఏప్రిల్ 2 నుంచి 11 వరకు మాంసం షాపులు తెరవకుండా చూడాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

అధికారులు జరిమానాలు, ఆంక్షలు విధిస్తారనే ఆందోళనల నడుమ నగరంలోని చాలా ప్రాంతాల్లో మాంసం దుకాణాలు మూసి కనిపించాయి.

అయితే, ఈ విషయంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేదు.

మేయర్లు ఏం అన్నారు?

ఏప్రిల్ 4న ఈ వివాదం మొదలైంది. మాంసం విక్రయాలపై మీడియాతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన ఎస్‌డీఎంసీ మేయర్ ముకేశ్ సూర్యన్ మాట్లాడారు.

‘‘పూజలు చేయడానికి వెళ్లేవారికి మాంసం దుకాణాల్లో కనిపించే మాంసం, ఆ దుకాణాల నుంచి వచ్చే వాసన వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఇది వారి మత విశ్వాసాలను దెబ్బ తీయడమే’’అని ఆయన అన్నారు.

‘‘దిల్లీలో 99 శాతం మంది నవరాత్రి సమయంలో ఉల్లి, వెల్లుల్లి కూడా తినరు. అందుకే నవరాత్రి సమయంలో మాంసం దుకాణాలు మూసి ఉంచాలని మేం నిర్ణయించాం. దీనికి వ్యతిరేకంగా షాపులు తెరిస్తే జరిమానాలు విధిస్తాం’’అని ఆయన అన్నారు.

ఆ తర్వాత బీజేపీకి చెందిన తూర్పు దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ) మేయర్ శ్యామ్ సుందర్ అగర్వాల్ కూడా దీనిపై స్పందించారు.

‘‘నవరాత్రి సమయంలో ఎవరైనా మాంసం విక్రయిస్తున్నారంటే... అయితే ఆ పశువులను ఆక్రమంగా వధించి ఉండాలి, లేదా పాత మాంసాన్నైనా అమ్ముతుండాలి. అందుకే అలా విక్రయాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు మేం 16 బృందాలను నియమించాం’’ అని ఆయన అన్నారు.

మాంసం విక్రయాలపై త్వరలోనే ఆదేశాలను జారీ చేస్తామని పీటీఐ వార్తా సంస్థతోనూ సూర్యన్ చెప్పారు. దీంతో మాంసం విక్రయదారుల్లో గందరగోళం నెలకొంది.

దక్షిణ దిల్లీ పరిధిలో 1500 వరకు మాంసం దుకాణాలున్నాయి. వీటిలో చాలావరకు మూసే కనిపించాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనం ప్రచురించింది.

విమర్శల వెల్లువ

హిందువుల్లో కొందరు నవరాత్రి పండుగ జరుపుకుంటారు. వారిలో కొందరు ఉపవాసం కూడా ఉంటారు. ఇందులోనూ అతికొద్ది మంది ఉల్లి, వెల్లుల్లికి దూరంగా ఉంటారు.

అయితే, కేవలం వారిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మాంసం దుకాణాలను మూసి ఉంచాలని పిలుపునివ్వడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. ఇది ఏం తినాలో ఎంచుకునే హక్కును, తమ వ్యాపారం స్వేచ్ఛగా నిర్వహించే హక్కుపై దాడి చేయడమేనని అంటున్నారు.

ఈ అంశంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా స్పందించారు.

‘‘నేను దక్షిణ దిల్లీలో ఉంటాను. నాకు నచ్చినప్పుడు మాంసం తినే హక్కును రాజ్యాంగం నాకు కల్పిస్తోంది. మాంసం దుకాణాలు నడిపే వారికి కూడా తమ వ్యాపారం నిర్వహించుకునే హక్కును ఇస్తోంది’’ అని ఆమె అన్నారు.

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా దీనిపై స్పందించారు. ఎస్‌డీఎంసీ మేయర్ ముకేశ్ సూర్యన్ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.

‘‘రంజాన్ సమయంలో మేం సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్య ఎలాంటి ఆహారమూ తీసుకోం. దీని ప్రకారం, ముస్లిమేతరులు, ఇక్కడకు పర్యటనకు వచ్చే వారు కూడా ఎలాంటి ఆహారమూ తీసుకోకూడదని మేం ఆదేశాలు జారీ చేయడం కూడా సబబేనని అనుకోవచ్చా? ముఖ్యంగా ముస్లింలు మెజారిటీగా ఉండే ప్రాంతాల్లో ఈ ఆదేశాలు ఇవ్వొచ్చా? దక్షిణ దిల్లీలో మెజారిటీ ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటే.. జమ్మూకశ్మీర్‌లో ఇది కూడా సరైన నిర్ణయమే మరి’’ అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.

కేవలం మాంసం విక్రయాలపై మాత్రమే ఆంక్షలు ఎందుకు? ఉల్లి, వెల్లుల్లిపైనా ఆంక్షలు విధించొచ్చు కదా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

కేవలం ముస్లిం వ్యాపారులే లక్ష్యంగా ఈ ఆంక్షలు విధిస్తున్నారని మరికొందరు అంటున్నారు.

భక్తికి, మాంసాహారానికి సంబంధం లేదని, బలవంతంగా దుకాణాలు మూసేయించడం సరికాదని కూడా మరికొంత మంది చెబుతున్నారు.

‘‘హోటల్స్‌లో మాంసం విక్రయాలు జరుగుతాయి. ఆన్‌లైన్ వ్యాపారులు, ఫుడ్ డెలివరీ చానెల్స్ కూడా మాంసాహారాన్ని అందిస్తాయి. మద్యం షాపులనూ ఎలాగో మూయరు. కానీ, నవరాత్రి సమయంలో పేద ముస్లింలు నడిపే మాంసం దుకాణాలతో హిందువుల మనోభావాలు మాత్రం దెబ్బ తింటాయి’’ అని తన్వీర్ అన్సారీ వ్యాఖ్యానించారు.

అయితే, ఎస్‌డీఎంసీ మేయర్ సూర్యన్ లేఖను అధికారిక ఆదేశాలుగా చూడాల్సిన పనిలేదని, మాంసం షాపులను వ్యాపారులు తెరచుకోవచ్చని దక్షిణ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రెస్ బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది.

మేయర్లకు ఇలాంటి ఆదేశాలు చేసే అధికారాలు లేవని ప్రతిపక్ష నాయకులు కూడా చెప్పారు.

‘‘కేవలం మేయర్ సూచనలు మాత్రమే చేస్తారు, అదేశాలు జారీచేసే అధికారం కమిషనర్లకు ఉంటుంది’’అని కాంగ్రెస్ కౌన్సెలర్ అభిషేక్ దత్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ విషయంలో కమిషనర్ల నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.

దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్-1957 ప్రకారం.. మాంసం షాపులను నియంత్రించే అధికారం మున్సిపల్ కమిషనర్‌కు ఉంటుంది. షాపులను మూసివేయాలన్నా, కొత్తవి తెరవాలన్నా కమిషనరే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. దీని కోసం ఆయన బహిరంగ ప్రకటనలు జారీ చేస్తుంటారు.

ఇదివరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జైనుల తొమ్మిది రోజుల పర్యూషన్ వేడుకలకు సంబంధించి ఇలాంటి ఆదేశాలు జారీచేశారు. అయితే, అప్పుడు ఆదేశాలు మున్సిపల్ కమిషనర్ నుంచి వచ్చాయి. ఈ ఆంక్షలను సుప్రీం కోర్టు కూడా సమర్థించింది.

వెజిటేరియన్ల శాతం ఎంత?

భారత్‌లో శాఖాహారుల సంఖ్య చాలా ఎక్కువనే భావన ప్రజల్లో ఉంది. నిజానికి భారత జనాభాలో శాఖాహారుల వాటా 20 శాతమేనని ఇండియాస్పెండ్, ఫ్యాక్ట్‌చెకర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో రుజువైంది. ఉత్తర భారత దేశంతో పోలిస్తే, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల్లో నాన్‌వెజ్ తినేవారు కాస్త ఎక్కువగా ఉంటారని దీనిలో పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా మాంసాహారం తినేవారి వివరాలను విశ్లేషిస్తూ ఈ అధ్యయనం ప్రచురితమైంది. దీనిలో భారత్‌లో 80 శాతం మంది పురుషులు, 70 శాతం మంది మహిళలు మాంసాహారం తింటామని వెల్లడించారు. ఇక్కడ మాంసాహారం తినడం అంటే కేవలం మాంసాహారం తినడం మాత్రమే కాదు. వీరి ఆహారంలో పాలు, గుడ్లు, ఇతర కూరగాయలు కూడా ఉంటాయి.

వారంలో ఒకసారైనా మాంసం తినే వారి విషయంలో పశ్చిమ బెంగాల్ (98.7), ఆంధ్రప్రదేశ్ (98.4), తమిళనాడు (97.8) మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలిపింది. దీనిలో రాజస్థాన్ (26.8), హరియాణా (31.5), పంజాబ్ (34.5) గుజరాత్ (39.9)ల్లో నాన్‌వెజ్ తినేవారి సంఖ్య 50 శాతం లోపు ఉంది.

దిల్లీలోనూ నాన్‌వెజ్ తినేవారి శాతం 60కిపైనే ఉన్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేర్కొంది. మొత్తంగా దేశ రాజధానిలో 63.2 శాతం మంది పురుషులు, 57.8 శాతం మంది మహిళలు నాన్‌వెజ్ తింటారని వెల్లడించింది.

నవరాత్రి సమయంలో దిల్లీలోని 99 శాతం మంది మాంసం తినరని దేని ఆధారంగా ఎస్‌డీఎంసీ మేయర్ చెబున్నారో చెప్పాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)