yuzvendra chahal: ఈ స్పిన్నర్‌ను 15వ అంతస్తు నుంచి వేలాడదీసిన క్రికెటర్ ఎవరు

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌కు 9 ఏళ్ల క్రితం ఎదురైన చేదు అనుభవంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టులోని తోటి ఆటగాడు రవిచంద్ర అశ్విన్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాహల్ ఈ విషయం గురించి మాట్లాడాడు.

‘‘ఆ ఘటన 2013లో జరిగింది. ఒక సీనియర్ క్రికెటర్ మద్యం మత్తులో నన్ను 15వ అంతస్తు నుంచి వేలాడదీశాడు’’ అని చాహల్ చెప్పాడు.

‘‘ఈ విషయం గురించి నేను ఎవరితోనూ ఎప్పుడూ చెప్పలేదు. చాలా కొద్ది మందికి మాత్రమే దీని గురించి తెలుసు. ఇప్పుడు దాని గురించి నీతో చెబుతున్నాను.’’

ముంబయి ఇండియన్స్‌కు ఆడుతున్నప్పుడు..

‘‘అది 2013. నేను ముంబయి ఇండియన్స్ జట్టు కోసం ఆడుతున్నాను. బెంగళూరులో ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ తర్వాత పార్టీ చేసుకుంటున్నాం. అక్కడ ఒక ప్లేయర్ బాగా తాగి ఉన్నాడు. అతడి పేరు చెప్పాలని అనుకోవడం లేదు’’అని చాహల్ వివరించాడు.

‘‘యూవీ ఇలా రా అని పిలిచాడు. అతడు చాలా సేపు నన్ను గమనించాడు. 15వ అంతస్తులోని బాల్కనీ బయట నన్ను అతడు గాలిలో వేలాడదీశాడు. నా చేతులతో అతడిని గట్టిగా పట్టుకున్నాను. ఒకవేళ పట్టు సడలితే, నేను పడిపోయేవాణ్ని.’’

‘‘అక్కడ చాలా మంది ఉన్నారు. వారు వెంటనే స్పందించడంతో నేను తప్పించుకోగలిగాను. కాసేపు నాకు స్పృహ తప్పినంత పనైంది. నా జీవితంలో తృటిలో ప్రాణాలతో బయటపడిన ఘటన అది. చిన్న తేడా వచ్చినా, నేను కింద పడిపోయేవాణ్ని’’అని యుజ్వేంద్ర చెప్పాడు.

‘‘బయటకు వెళ్లినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అప్పడు నాకు బాగా అర్థమైంది’’అని యుజ్వేంద్ర వివరించాడు.

‘‘ఆయనెవరో చెప్పండి’’

ఈ ఇంటర్వ్యూ వీడియోను రాజస్థాన్ రాయల్స్ ట్విటర్‌లో షేర్ చేసింది.

దీంతో చాహల్‌ను ఇలా భయానకంగా గాల్లో వేలాడదీసిన ఆటగాడు ఎవరో చెప్పాలంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

‘‘ఈ ఘటనకు సంబంధించి ముంబయి ఇండియన్స్ చర్యలు తీసుకోకపోతే ఇకపై నేను ఆ జట్టు అభిమానినని చెప్పుకోను’’అని ఓ ట్విటర్ వినియోగదారుడు ట్వీట్ చేశారు.

‘‘చాహల్‌కు ఇలా జరగడం దురదృష్టకరం. మీరు చెత్త స్టోరీలను సంచలన వార్తలుగా ప్రచారం చేస్తుంటారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి. పరిస్థితులు ఎలా ఉన్నాయో గుర్తించండి’’అని మరో యూజర్ ట్వీట్ చేశారు. ఆమె బీసీసీఐను ట్యాగ్ చేశారు.

‘‘ఆ ఆటగాడు ఎవరో చెప్పు చాహల్. దానికి సాక్ష్యాలు కూడా బయటపెట్టు. నిజం తెలియాలి’’అని మరో యూజర్ ట్వీట్ చేశారు.

‘‘చాహల్ చెప్పేది వింటుంటే భయం వేస్తోంది. దీనిపై ముంబయి ఇండియన్స్ ఏం చర్యలు తీసుకుందో చెప్పాలి’’అని మరో ట్విటర్ యూజర్ వ్యాఖ్యానించారు.

‘‘తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు’’

మరోవైపు చాహల్‌ను అలా వేలాడదీసిన ఆ ప్లేయర్ ఎవరో తెలియాల్సిన అవసరముందని భారత మాజీ క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కూడా వ్యాఖ్యానించినట్లు హిందుస్తాన్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది.

‘‘మద్యం మత్తులో చాహల్‌ను అలా వేలాడదీసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ ఘటన నిజమైతే, దాన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. అసలు ఏం జరిగిందో, ఏం చర్యలు తీసుకున్నారో తెలియాల్సిన అసరముంది’’అని సెహ్వాగ్ వ్యాఖ్యానించినట్లు ఆ వార్తలో రాశారు.

ముంబయి ఇండియన్స్ టీమ్‌తోనే చాహల్ తన ఐపీఎల్ కెరియర్‌ను మొదలుపెట్టాడు. అయితే, మొదటి మూడు సీజన్లలో కేవలం ఒక మ్యాచ్‌లోనే అతడికి ఆడే అవకాశం వచ్చింది.

ఆ తర్వాత 2014లో రాయల్ చాలెంజర్స్ అతణ్ని తమ జట్టులోకి తీసుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)