యుక్రెయిన్: రష్యాకు వ్యతిరేకంగా ఏకమైన ఈ నగరంలో ఇప్పుడు ఏం జరుగుతోంది?

యుక్రెయిన్ తూర్పు ప్రాంత పట్టణం ఖార్కివ్ నుంచి అరగంట కారు ప్రయాణంతో చేరుకోగలిగే పారిశ్రామిక ప్రాంతంలో తెల్లని షిప్పింగ్ కంటెయినర్లు వరుసగా ఉన్నాయి.

దట్టమైన మంచుతో కప్పుడైన ఆ కంటెయినర్లన్నీ తాత్కాలిక ఆవాసాలు. 2014‌లో రష్యా మద్దతు గల వేర్పాటువాదులు డాన్‌బాస్ ప్రాంతాన్ని తమ గుప్పిట్లోకి తీసుకోవడంతో పారిపోయిన వచ్చినవారంతా ఇక్కడ నివసిస్తున్నారు.

వీరంతా ఇరుకు కంటెయినర్లలో ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్నారు. నిర్మణాలు జరిగే ప్రదేశాల్లో కనిపించే కంటెయినర్లను ఒక్కసారి ఊహించుకోండి.. తలకు తగిలే పైకప్పు, ఆ చిన్న స్థలంలోనే లివింగ్ రూం, కిచెన్, బాత్‌రూం అన్నీ ఉంటూ ఇద్దరు ముగ్గురు నివసించే కంటెయినర్లవి.

''అవును, ఈ గదులు చాలా నిరుత్సాహకరంగా ఉంటాయి'' అన్నారు తన భర్త, తల్లితో కలిసి అక్కడ నివసించే ల్యూడ్‌మిలా బొబోవ్.

అయితే, వాళ్లు అంతకుముందు ఉండే గది కంటే ఇది కొంత నయం. అంతకుముందు వారు ఇంకా చిన్న ప్రదేశంలో ఉండేవారు. అదో కమ్యూనిటీ యూనిట్.. కిచెన్, బాత్‌రూం ఎవరికి వారికి వేర్వేరుగా కాకుండా కామన్‌గా ఉండేవి అక్కడ. పడుకోవడానికి కూడా బంక్ బెడ్‌లు ఉండేవి. దానికంటే ఇప్పుడున్నది కొంత నయం. ఇదో ప్రైవేట్ కంటెయినర్ యూనిట్. అందులో వీరి ఒక్క కుటుంబమే ఉంటుంది.

ఇక్కడ బతకడం ఎంతో నయమని బొబోవా, ఆమె కుటుంబం భావిస్తున్నారు. తాము వదిలేసి వచ్చిన స్వస్థలం వేర్పాటువాదుల ఆక్రమణలో ఉండడం వల్ల అక్కడ స్వేచ్ఛగా ఉండలేమని... ఇక్కడ ఇరుకుఇరుకుగా బతుకుతున్నా స్వేచ్ఛగా జీవిస్తున్నామని బొబోవా అన్నారు.

అయితే, జీవన పరిస్థితులలో వ్యత్యాసం గురించి ఆమెను ప్రశ్నించినప్పుడు అదో జీవితం, ఇదో జీవితం అని ఆమె సమాధానమిచ్చారు.

అంతకుముందు బొబోవా మొలోదోవార్డిస్క్‌లో నివసించేవారు. అది రష్యా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉండే చిన్న మైనింగ్ పట్టణం. అక్కడ పెద్దగా రాజకీయ కార్యకలాపాలేమీ ఉండేవి కాదు. ప్రజల్లో రష్యా అనుకూలత చాలా తక్కువ.

2014లో యుద్ధం జరిగినప్పుడు అక్కడ నుంచి తరలిన వేలాది మందితో పాటే బొబోవా కుటుంబం కూడా వచ్చేసింది.

ఉరుములతో కూడిన పిడుగులు పడినట్లుగా బాంబ్ షెల్స్ పడుతుంటే ప్రజలు ఎవరికి తోచినట్లు వారు కాలినడకన, రైళ్లలో అక్కడి నుంచి బయటపడ్డారు.

మాడ్యూల్ సిటీలో జీవనం తరువాత వారు ఇక్కడ కువచ్చారు. జర్మనీ ప్రభుత్వం ఆ మాడ్యూళ్లకు డబ్బు చెల్లించేది. ఆ మాడ్యూల్స్‌లో మనుషులు నివసిస్తే అవి సాధారణంగా మూడున్నరేళ్లు మన్నుతాయి. కానీ, ఏడేళ్లు దాటినా ఇంకా 175 మంది వాటిలో నివసిస్తున్నారు.

''ఇది తాత్కాలిక స్థిరత్వం తప్ప ఇంకేమీ కాదు'' అని ఆర్టర్ స్టేట్సెంకో అన్నారు. స్థానిక కౌన్సిల్ తరఫున ఈ లివింగ్ యూనిట్ల వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తుంటారు.

ప్రభుత్వం వీరి బాగోగులు చూసుకోలేదు. గత ఎనిమిదేళ్లుగా వీరి కోసం ఎలాంటి బడ్జెట్ ఇవ్వలేదు.

"తాత్కాలికం కంటే స్థిరంగా ఏమీ లేదు," అని స్థానిక కౌన్సిల్ కోసం యూనిట్లను పర్యవేక్షించే ఆర్తుర్ స్టాట్‌సెంకో అన్నారు. "రాష్ట్రం ఈ వ్యక్తులను అస్సలు నిర్వహించలేదు. గత ఎనిమిదేళ్లుగా రాష్ట్ర బడ్జెట్ నుండి మాకు ఏమీ రాలేదు. ఇలాంటి ప్రజల పునరేకీకరణకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఉన్నప్పటికీ ఆ శాఖ నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు’’ అన్నారు ఆర్టర్.

డాన్‌బాస్క్ ఆక్రమణ తరువాత నిరాశ్రయులైన ప్రజల బాగోగుల పర్యవేక్షణకు 2014లో ఏర్పాటై ఈ మంత్రిత్వ శాఖను 'బీబీసీ' సంప్రదించినప్పటికీ వారు ఈ విషయంలో జవాబిచ్చేందుకు నిరాకరించారు.

తాజాగా రష్యా నుంచి యుక్రెయిన్‌కు ఉన్న ఆక్రమణ ముప్పు ఈ నిరాశ్రయులకు మరింత ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుతం వీరంతా ఉంటున్న తాత్కాలిక ఇళ్లు కూడా రష్యా సరిహద్దుకు కేవలం 25 మైళ్ల(40 కిలోమీటర్లు) దూరంలో ఉన్నాయి.

''మేం సరిహద్దుల్లోని ఉద్రిక్తతల తీవ్రత గురించి, మేం మళ్లీ పారిపోవడం గురించి మాట్లాడం'' అని ఇరినా బెలిన్స్కా చెప్పారు. తన తొమ్మిది మంది మనవలు, మనవరాళ్లతో పాటు అనారోగ్యంతో ఉన్న భర్తతో కలిసి ఈ కంటెయినర్లలో నివసిస్తున్నారు 64 ఏళ్ల ఇరినా.

''మాకు ఉండడడానికి సరైన ఇల్లు కావాలి. ఇలాంటి ఇరుకిరుకు ప్లాస్టిక్ ఇల్లు కాదు'' అన్నారామె వారుంటున్న ఇంటి విరిగిన పైకప్పు, కుంగిన నేలను చూపిస్తూ.

''యుద్ధం కంటే ముందు మా చుట్టూ చిన్నచిన్న రోజువారీ సమస్యలు చాలా ఉన్నాయి'' అన్నారు ఇరినా.

రష్యా, యుక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు ఖార్కివ్ సాంస్కృతిక ఉనికిని మార్చేశాయి. యుక్రెయిన్ రాజధాని కీవ్‌కు 300 మైళ్ల దూరంలోని చారిత్రకంగా రష్యన్ మాట్లాడే ప్రజలున్న ప్రాంతం. ఇది రష్యా సరిహద్దు నుంచి 30 మైళ్ల దూరంలో ఉంటుంది. బెలిన్స్కా రష్యన్ భాష మాట్లాడుతారు. బొబోవా ఇప్పుడు యుక్రెయిన్ భాష మాత్రమే మాట్లాడుతున్నారు. 2014లో తన సొంత ప్రాంతాన్ని వదిలిపెట్టి ఖార్కివ్ వచ్చినప్పటి నుంచి ఆమె రష్యన్ మాట్లాడడం మానేశారు.

డాన్‌బాస్‌ను స్వాధీనం చేసుకున్న వేర్పాటువారులు ఖార్కివ్‌ స్వాధీనానికీ యత్నించారు. ఖార్కివ్ సిటీ సెంటర్‌లోని ప్రభుత్వ భవనంపై వారు తమ జెండా కూడా ఎగరేశారు.

యుక్రెయిన్ పదవీచ్యుత అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ రాజకీయ మద్దతు కోసం ఖార్కివ్‌కు పారిపోయి వచ్చినా ఇక్కడ నుంచి మళ్లీ క్రిమియాకు పారిపోయారు.

యుక్రెయిన్‌లో జనాభాపరంగా రెండో పెద్ద నగరం ఖార్కివ్. ''ఖార్కివ్ ఎప్పుడూ యుక్రెయిన్ అనుకూల నగరం'' అని అక్కడ స్థానిక ప్రభుత్వ భవనం ఎదుట 2014 నుంచి 'యుక్రెయిన్ అనుకూల నిరసన ప్రదర్శన' చేస్తున్న బోరిస్ రెడిన్ చెప్పారు.

''రష్యన్లు మాపై దాడి చేయాలనుకుంటే మేమేమీ భయపడం. వారు మా అతిథులు'' అన్నారు రెడిన్.

రష్యా కనుక యుక్రెయిన్‌లోకి చొరబడితే ఖార్కివ్ వారి గమ్యస్థానమవుతుంది.. అయితే, రష్యా దళాలకు అదేమంత సులభం కాదు. ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. ప్రజల్లో చాలామంది స్వచ్ఛంద దళాలలో చేరి పోరాటంలో శిక్షణ తీసుకున్నారు. రెండు వారాల కిందట వీధుల్లో పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. ఆ నిరసనల్లో ''ఖార్కివ్ యుక్రెయిన్‌దే, రష్యా దూకుడు తగ్గాలి'' అంటూ నినాదాలు వినిపించాయి.

''ప్రాదేశిక రక్షణ విభాగాల్లో ప్రజలు చేరారు. వలంటీర్లు వార్ జోన్‌కు వెళ్తున్నారు'' అని ఖార్కివ్ డిప్యూటీ మేయర్ స్విట్లానా గోర్బనోవ్ రూబాన్ అన్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా మా నగరాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.

ఇక్కడ రక్షించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. 38 యూనివర్సిటీలు, మ్యూజియంలు, సాంకేతిక సంస్థలు, విరాజిల్లుతున్న సమకాలీన కళారంగం వంటి అన్నిటినీ కాపాడుకోవాలి.

''యుద్ధం ప్రారంభమైనప్పడు ఖార్కివ్‌లో కళల విస్పోటం సంభవించింది' అని సిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ ఆర్ట్ డైరెక్టర్ నటాలియా ఇవనోవా అన్నారు. ''ఇది ప్రతిఘటన కళ, నిరసన-అనంగీకార కళ'' అన్నారామె.

యుక్రెయిన్ తూర్పు నగరాలకు భిన్నమైన యుద్ధానుభూతి ఉంటుంది ఇక్కడ. యుద్ధక్షేత్రం ముందుకు సాగడానికి ఖార్కివ్ మీదుగానే పటాలాలు వెళ్తాయి. గాయపడిన సైనికులు ఇక్కడి ఆసుపత్రికే వస్తారు.

వివాదాస్పద ప్రాంతం నుంచి నగరాన్ని వేరుచేసే రేఖ మీదుగా కుటుంబాలూ వేరయ్యాయి. సరిహద్దు ఆవలి జీవితాల గురించీ ఇక్కడి ప్రజలు వింటారు. అంతేకాదు... డాన్‌బాస్ నుంచి నిరాశ్రయులుగా వచ్చిన సుమారు 1,20,000 నుంచి 3,50,000 మంది రాకతో ఇక్కడకు అవే వర్గ వ్యత్యాసాలూ వచ్చాయి.

ఖార్కివ్‌కు వచ్చినవారి పట్ల వివక్ష ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు అని అల్లా ఫెషెంకో చెప్పారు. 'స్టేషన్ ఖార్కివ్' అనే స్వచ్ఛంద సంస్థను అల్లా ఫెషెంకో నిర్వహిస్తున్నారు.

''స్థానిక ప్రజలు వారికి ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరించారు. తరువాతకాలంలో వీరంతా రష్యాకు అనుకూలంగా మారుతారేమో అన్న భయం స్థానికులది' అన్నారు ఫెషెంకో.

''కానీ, ఖార్కివ్ ప్రజల్లో కొందరు మాత్రం నిరాశ్రయులుగా వచ్చినవారిలో చాలా చక్కగా వ్యవహరించారు. పరిస్థితులు బాగులేకపోతే తమకూ అలాంటి కష్టం రావొచ్చని వారు అనుకున్నారు. అదృష్టవశాత్తు అలాంటి పరిస్థితి రాలేదన్న జ్ఞానంతో వారు మాకు సహకరించారు'' అన్నారు ఫెషెంకో.

''ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. యుద్ధం కారణంగా నిరాశ్రయులై వచ్చినవారి విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది'' అన్నారు ఫెషెంకో.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)