బాయ్‌ఫ్రెండ్ ఆమె కొడుకుని చంపేశాడు.. కానీ, ఆమె జైలుకు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు?

    • రచయిత, రాబిన్ లెవిన్సన్-కింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రెబెకా హోగ్ ఇంట్లో లేని సమయంలో ఆమె బాయ్‌ఫ్రెండ్ ఆమె కొడుకును కొట్టి చంపేశాడు. కానీ, రెబెకా ఎందుకు జైలుకు వెళ్లారు?

గమనిక: ఈ కథనంలో గృహహింస, పిల్లలపై వేధింపులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. అవి పాఠకుల హృదయలను కలచివేయవచ్చు.

2020, కొత్త సంవత్సరం తొలిరోజు తెల్లవారుజామున రెబెకా హోగ్ 12 గంటల షిఫ్టు ముగించుకుని ఇంటికి వచ్చారు. అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రంలో ఓ కాసినోలో ఆమె కాక్టెయిల్ వెయిట్రెస్‌గా పనిచేస్తున్నారు.

ఇంట్లో తన రెండేళ్ల కొడుకు రైడర్, బాయ్‌ఫ్రెండ్ పడుకుని ఉన్నారు. ఆమె కూడా వారి పక్కనే చేరి నిద్రలోకి జారిపోయారు.

మర్నాడు ఉదయం లేచి చూసేసరికి, రైడర్ ఊపిరి తీసుకోవడం లేదని గమనించారు రెబెకా. ఆమె బాయ్‌ఫ్రెండ్ క్రిస్టోఫర్ ట్రెంట్ ఆఫీసుకి వెళ్లిపోయారు. ఆమె కంగారుగా పోలీసులకు ఫోన్ చేశారు.

రెబెకా తన కొడుకుపై సీపీఆర్ (గుండెను అదిమి శ్వాస ఆడేలా చేయడం) చేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. రైడర్‌ను ఆస్పత్రికి తరలించగా, చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు.

బలప్రయోగం వలనే రైడర్ చనిపోయాడని అనుమానాస్పద మరణాలపై విచారణలు నిర్వహించే అధికారి తెలిపారు. హోగ్ ఇంట్లో రైడర్ తల వెంట్రుకలు ఒక వైపు గోడకు అతుక్కుని కనిపించాయి.

రైడర్‌ను తీసుకుని ఆస్పత్రికి వెళ్లే సమయానికి హోగ్‌కు ఈ వివరాలేవీ తెలీదు. ఆస్పత్రి నుంచి ఆమె తన బాయ్‌ఫ్రెండ్ ట్రెంట్‌కు ఫోన్ చేశారు. ట్రెంట్ ఫోను పలకలేదు. మెసేజ్, వాయిస్ మెసేజ్ పెట్టినా ట్రెంట్ స్పందించలేదు.

నాలుగు రోజుల తరువాత, కొండల్లో ట్రెంట్ మృతదేహం పోలీసులకు దొరికింది. ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.

ఆ తరువాత, ట్రెంటే రైడర్‌ను చంపారని కేసు వాదిస్తున్న ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు.

ట్రెంట్ మృతదేహం దొరికిన స్థలంలో ఒక చెట్టు మీద "రెబెకా అమాయకురాలు" అని రాసి ఉన్న అక్షరాలు కనిపించాయి.

రెబెకా హోగ్‌పై కేసు ఎందుకు?

ట్రెంట్ చనిపోవడంతో, కేసు 29 ఏళ్ల రెబెకా వైపుకు మళ్లింది. గత నవంబర్‌లో ఆమెపై ఫస్ట్ డిగ్రీ హత్య అభియోగం మోపారు.

ఓక్లహామా రాష్ట్రంలో తమ పిల్లలను హింస, వేధింపుల నుంచి రక్షించడంలో విఫలమైన తల్లిదండ్రులకు కూడా నేరస్థుడితో సమానంగా శిక్ష విధించే అవకాశం ఉంది.

ఇలాంటి "ఫెయిల్యూర్ టు ప్రొటెక్ట్" (రక్షించడంలో వైఫల్యం) చట్టాలు అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. వీటిపై విమర్శలూ ఉన్నాయి. ఈ చట్టాల ప్రకారం గృహహింస బాధితులను నేరస్థులుగా పరిగణించే అవకాశం ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. చిన్న పిల్లలకు రక్షగా ఈ చట్టాన్ని జారీ చేసినా, చెడు సంబంధాల నుంచి బయటపడలేని మహిళలకు ఇది భారం అవుతుందని మహిళా సంఘాలు వాదిస్తున్నాయి.

రెబెకా హోగ్‌కు జీవిత ఖైదు విధించాలని జ్యూరీ రికమండ్ చేసింది. కానీ, ఆమెకు 16 నెలల జైలు శిక్ష విధిస్తూ ఫిబ్రవరి 11న జడ్జి తీర్పు చెప్పారు. కేసు మోపిన దగ్గర నుంచి ఇప్పటికే మూడు నెలలు గడిచిపోవడంతో రెబెకా 13 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

తీర్పు విన్న తరువాత రెబెకా మాట్లాడుతూ, నిజంగా అవకాశముంటే కాలాన్ని వెనక్కు జరిపి తన కొడుకుని ఎలాగైనా రక్షించుకునే ప్రయత్నం చేస్తానని అన్నారు.

"ఇంత అందమైన, ఆరోగ్యమైన కొడుకుని కన్నందుకు నేను చాలా గర్వపడ్డాను. కానీ, నా కొడుకును పొట్టన పెట్టుకున్నవాడు ఈ భూమి మీద లేడు. అదే నాకు శాంతి. ఇప్పుడు నా బిడ్డ స్వర్గంలో ఉన్నాడని, తను (ట్రెంట్) మాత్రం నా బిడ్డకు దగ్గర్లో లేడని నాకు తెలుసు" అని రెబెకా అన్నారు.

రెబెకా "చెడ్డ వ్యక్తి కాదని", ఆమె "జైల్లోనే ప్రాణాలు వదలాల్సిన అవసరం లేదని" తీర్పు చెప్పిన జడ్జి మైఖేల్ టప్పర్ అన్నారు.

రెబెకా కేసుపై మీడియాలో పలు చర్చలు జరుగుతున్నాయి. ఈ చట్టం పరిమితుల గురించి మహిళా సంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

'నా బిడ్డను హింసిస్తున్నాడని నాకు తెలీదు'

ట్రెంట్ తన కొడుకు రైడర్‌ను వేధిస్తున్నాడన్న సంగతి తనకు తెలీదని రెబెకా చెప్పారు. బాబు చనిపోవడానికి కొద్ది రోజుల ముందు నుంచీ తన ఒంటిపై చిన్న చిన్న గాయాలను గమనించానుగానీ అది ట్రెంట్ చేసిన పని అని ఊహించలేకపోయానన్నారు.

రెబెకా పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం, రైడర్ చనిపోవడానికి రెండు వారాల ముందు బాబు ఒంటిపై చిన్న చిన్న గాయాలు ఉండడం గమనించారామె. వాటి ఫొటోలు తీసి, బాబుపై హింస లేదా వేధింపులు జరిగిన సంకేతాల కోసం వెతకడం మొదలుపెట్టారు.

ట్రెంట్‌తో ఆ మాట చెప్పినప్పుడు పిల్లలకు "చిన్న చిన్న గాయాలు కావడం" మామూలేనని ఆయన అన్నారు.

రైడర్ చనిపోవడానికి రెండు రోజుల ముందు బాబు నీరసంగా ఉన్నట్లు రెబెకా గమనించారు. రైడర్‌కు జ్వరం వచ్చి ఉండొచ్చని ట్రెంట్ సూచించారు.

వేధింపులకు గురైన పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు, జ్వరం వచ్చిన పిల్లలకు ఉండే లక్షణాలేమిటి వంటి అంశాలను రెబెకా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయడం ప్రారంభించారు.

వీటి బట్టి చూస్తే, ట్రెంట్ తన కొడుకును హింసిస్తున్నాడన్న సంగతి రెబెకాకు తెలుసు. కానీ, ఆమె ట్రెంట్‌ను క్షమించేశారు అని విచారణ అధికారులు వాదించారు.

కానీ, ముందు జాగ్రత్త కోసమే నెట్‌లో అలా వెతికానని, చివరికి ట్రెంట్ చెప్పిన మాటలే నమ్మానని రెబెకా అన్నారు.

రైడర్ ఒంటిపై గాయాల గురించి ఆమెకు తెలిసినా, బాబును ట్రెంట్ దగ్గర వదిలిపెట్టి ఆమె ఉద్యోగానికి వెళ్లారని, ఈ ఆధారాల బట్టి "బిడ్డ చావుకు" ఆమె కూడా కారణమని నిరూపించవచ్చని ప్రాసిక్యూటర్ వాదించారు.

అయితే, కేసు విచారణలో చాలా విషయాలను పరిగణించలేదని రెబెకా తరపు లాయర్ అన్నారు. ఉదాహరణకు చెట్టుపై "రెబెకా అమాయకురాలు" అని చెక్కి ఉన్న విషయాన్ని వదంతిగా పరిగణించి, వాటి చిత్రాలు షేర్ చేయడాన్ని నిషేధించారని లాయర్ తెలిపారు.

తీర్పు విన్నాక రెబెకా కుటుంబం ఊపిరి పీల్చుకుందని, ఆమె ఇంటికి తిరిగి రావడం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.

'బిడ్డను మర్చిపోలేకపోతున్నాను'

బిడ్డ ఒంటిపై గాయాలు పదే పదే జ్ఞాపకం వస్తున్నాయని, విచారణలో చెప్పిన విషయాలు వెంటాడుతున్నాయని ఓక్లహామాలోని క్లీవ్‌ల్యాండ్ కౌంటీ డిటెన్షన్ సెంటర్ నుంచి మాట్లాడుతూ రెబెకా, బీబీతో చెప్పారు.

బాబు తన "బెస్ట్ ఫ్రెండ్" అని "రెండున్నరేళ్లకే జోకులు వేస్తే నవ్వేవాడని" అన్నారు.

తీర్పు రాక ముందు రెబెకా మాట్లాడుతూ, "కోర్టు విచారణ, తీర్పు తనకున్న తీపి జ్ఞాపకాలను చెరిపేస్తాయన్న భయం ఉందని" వాపోయారు.

"మాకే ఎందుకు ఇలా జరిగిందో తెలీదు. ఇదే ప్రశ్న నన్ను తొలుస్తూ ఉంది" అని ఆమె అన్నారు.

'నన్ను కొట్టినా బాగుండేది'

రెబెకా గతంలో గృహహింస బాధితురాలు. రైడర్ తండ్రి కూడా ఆమెను వేధించారు. దాంతో, ఆమె ఆయన్నుంచి విడిపోయారు.

ట్రెంట్ సంగతి ముందే పసిగట్టి ఉంటే తనను కూడా విడిచిపెట్టి వెళ్లిపోయేదాన్నని రెబెకా అన్నారు.

"నన్ను కొట్టి ఉంటే బాగుండేది. అప్పుడే బాబును తీసుకుని బయటికొచ్చేసి ఉండేదాన్ని" అని ఆమె అన్నారు.

రైడర్ చనిపోవడానికి సుమారు ఆరు నెలల ముందు రెబెకా, ట్రెంట్‌ను ఆన్‌లైన్‌లో కలిశారు. ట్రెంట్‌ను పరీక్షించమని తన స్నేహితులకు చెప్పారు రెబెకా.

"బాబుతో నేను ఒంటరి మహిళను. తను ఎలాంటివాడో ముందే తెలుసుకోవాలనుకున్నా. అందుకే, తన సంగతి కనుక్కోమని నా ఫ్రెండుని అడిగా."

కొన్ని రోజుల తరువాత బాబును ట్రెంట్‌కు పరిచయం చేశారు రెబెకా. తను బాబుతో సరదాగా మాట్లాడారని, ప్రశ్నలు అడుగుతూ, జోకులు వేస్తూ సమయం గడిపారని ఆమె చెప్పారు.

చాలా తొందరగా వాళ్లిద్దరూ సహజీవనం ప్రారంభించారు. రైడర్‌ను తన సొంత బిడ్డలా చూసుకుంటానని, మనమంతా ఒక కుటుంబమని ట్రెంట్, రెబెకాతో నమ్మబలికారు. తన గుండెలపై రెబెకా, రైడర్‌ల పేర్లను టాటూ వేయించుకున్నారు కూడా.

"నా బిడ్డని తను నిజంగా ప్రేమించాడనుకున్నా. మేం తొందరపడ్డామేమో అనిపిస్తోంది."

తన బిడ్డ మరణానికి, ట్రెంట్ సంగతి పసిగట్టలేకపోయినందుకు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నానని రెబెకా అన్నారు.

ఇప్పుడు, ట్రెంట్ చేసిన నేరానికి ఆమె శిక్ష అనుభవిస్తున్నారు.

జైల్లో ఉండడం తనకు బాధేనని చెబుతూ, దానికన్నా ముఖ్యంగా తన బిడ్డ మరణానికి తాను కారణం కాదని అందరూ గ్రహించాలని ఆమె కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)