ప్లాస్టిక్ కాలుష్యం: ఏటా వెయ్యి కోట్ల వెట్‌వైప్స్ వాడి పారేస్తున్నారు.. అవి ఏమవుతున్నాయి?

వీడియో క్యాప్షన్, ఏటా వెయ్యి కోట్ల వెట్‌వైప్స్ వాడి పారేస్తున్నారు.. అవి ఏమవుతున్నాయి?

మరకలు తుడవడానికి, మేకప్ కోసం, పిల్లల కోసం మనం వెట్‌వైప్స్‌ను తరచుగా వాడుతుంటాం కదా... మనం వాడిపడేసే వాటిలో చాలా వరకు నదుల్లో కలుస్తుంటాయి.

లండన్‌లో బ్యాటర్‌సీ బ్రిడ్జ్ వద్ద థేమ్స్ నది చూడటానికి మామూలుగానే కనిపిస్తుంది.

కానీ దగ్గరగా చూస్తే తీరమంతా మురికి కాలువల ద్వారా కొట్టుకొని వచ్చిన వెట్‌వైప్స్‌తో నిండిపోయి ఉంటుంది.

థేమ్స్ వాటర్ అనే కంపెనీ ఈ వెట్ వైప్స్‌ను ఒక కాలువ నుంచి బయటకు తీసింది.

అవి చమురు, గ్రీజుతో కలిసి పైపులను బ్లాక్ చేస్తున్నాయి.

‘‘ఇక్కడ మాకు ముఖ్యంగా కనిపిస్తున్న సమస్యేంటంటే చాలా మంది వెట్ వైప్‌లను టాయిలెట్లలో పడేయడం. కానీ అలా చేయకూడదు. మేకప్ వైప్స్, క్లీనింగ్ వైప్స్ వంటి వాటిలో ప్లాస్టిక్ ఫైబర్స్ వాడటం వలన అవి తేలికగా కరగవు. ఫలితంగా డ్రైనెజీలో చిక్కుకొని పోతాయి. అవి ఒకదానితో ఒకటి పెనవేసుకొని పోయి మరింత చిక్కుబడి పోతాయి. ఇలా మురుగు కాలువల ద్వారా కొట్టుకొని వచ్చి నది తీర ప్రాంతాల్లో పేరుకొని పోతున్నాయి. ఇక్కడ ఇసుకలో చిన్నచిన్న ముక్కలుగా పడిపోయిన వైప్స్‌ను జంతువులు తింటాయి’’ అని థేమ్స్ నది తీరాలను శుభ్రం చేయడానికి థేమ్స్-21 చారిటీ ద్వారా పనిచేస్తున్న క్రిస్ కూడ్ తెలిపారు.

‘‘వెట్ వైప్స్ వంటి కరిగిపోని మెటీరియల్స్ మురుగునీటి వ్యవస్థలో కలిస్తే చివరకు ఏం జరుగుతుందనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నట్లు వాటిని ప్రాసెస్ చేయడమనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఎంత ప్రాసెస్ చేసినప్పటికీ ఇంకా వెట్ వైప్స్ కనిపించడాన్ని మీరు చూడొచ్చు. వాటిని చేతితో కూడా తీయొచ్చు. కానీ ఈ స్థాయిలో ప్లాస్టిక్‌ను ప్రాసెస్ చేసేలా ఇక్కడి యంత్రాలను రూపొందించలేదు. పేపర్లు తప్ప మరే ఇతర వస్తువులను టాయిలెట్లో వేయకూడదు’’ అని థేమ్స్-21 చారిటీకి చెందిన అన్నా బోయల్స్ చెప్పారు.

వెట్ వైప్స్‌లో ప్లాస్టిక్ వాడకుండా నిషేధించడంపై పోరాడుతున్న లేబర్ ఎంపీ ఫ్లార్ అండర్సన్‌తో కలిసి పని చేస్తోంది థేమ్స్ వాటర్.

వెట్‌వైప్స్‌లో ప్లాస్టిక్ కలపడం వల్ల కలిగే చెడు ప్రభావాలను తాము గమనిస్తున్నామని దీనికొక పరిష్కారం కనుగొంటామని ప్రభుత్వం చెబుతోంది.

సాధారణంగా వస్తువులను బ్యాన్ చేయడం కన్నా ఇతర ఉత్తమ మార్గాలను ప్రజలకు, కంపెనీలకు ప్రభుత్వాలు సూచిస్తుంటాయి.

కాబట్టి , సరైన పద్ధతిలో వెట్ వైప్స్‌ను డిస్పోజ్ చేయడం గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వెట్ వైప్‌లలో ప్లాస్టిక్ బ్యాన్ చేయకపోతే ఈ సమస్య చాలా పెద్దది అవుతుందని లేబర్ ఎంపీ అండర్సన్ హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)