నిత్యావసర సరుకులను నిల్వ చేసుకోవాలని ప్రజలను కోరిన చైనా, కారణమేంటి?

అత్యవసర పరిస్థితులకు తగ్గట్టుగా అవసరమైన నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోవాలని చైనా ప్రభుత్వం ప్రజలను కోరింది.

వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఈ నోటీసులో కారణాన్ని మాత్రం పేర్కొనలేదు.

కరోనావైరస్ లాక్‌డౌన్‌లతోపాటూ అసాధారణంగా కురిసిన భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని కూరగాయల సరఫరాపై ప్రభావం పడిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది.

ధరలు స్థిరంగా ఉండేలా సరఫరాపై ప్రభావం పడకుండా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ కోరింది.

ఈ ప్రకటనతో కొనుగోళ్లు, ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయన్న రిపోర్టులను ప్రభుత్వ మీడియా నియంత్రించే ప్రయత్నం చేసింది.

"ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే, నా దగ్గర ఉన్న వృద్ధులందరూ షాక్‌కు గురయ్యారు. సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేయడానికి భయపడిపోయారు" అని చైనీస్ సోషల్ మీడియా సైట్ వీబోలో ఒకరు రాశారు.

చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుగల వార్తాపత్రిక ఎకనామిక్ డైలీ, దాని పాఠకులను ఆందోళన చెందవద్దని కోరింది. ఎవరి ప్రాంతంలోనైనా లాక్‌డౌన్ ప్రకటిస్తే, దానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా లేదా నిర్ధారించుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రకటన చేసిందని పేర్కొంది.

ఇటువంటి నోటీసులు అసాధారణమేమీ కాదని పీపుల్స్ డైలీ వార్తాపత్రిక తెలిపింది. కూరగాయల ధరల పెరుగుదల, ఇటీవలి కోవిడ్ కేసుల పెరుగుదల కారణంగానే ఈ ప్రకటన వచ్చినట్లు పేర్కొంది.

చలికాలం సమీపిస్తున్న కొద్దీ చైనాలో ఆహార ధరలు సహజంగానే పెరుగుతాయి. అయితే తీవ్రమైన వాతావరణ పరిస్థితులతో కూరగాయల ధరలు ఇటీవలి వారాల్లో భారీగా పెరిగాయి.

మరోవైపు, కరోనావైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి కొన్ని ప్రాంతాల్లో కఠినమైన లాక్‌డౌన్‌ నిబంధనలను చైనా అమలు చేస్తోంది. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికంటే ముందే జీరో ఇన్‌ఫెక్షన్లకు చేరుకోవాలని చైనా భావిస్తోంది.

సోమవారం చైనాలో తొంభై రెండు కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. షాంఘై డిస్నీల్యాండ్‌ను కనీసం రెండు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు. వారాంతంలో డిస్నీల్యాండ్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత సందర్శకుడికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)