చైనా: ఈ ఏనుగుల గుంపు 500 కి.మీ. ఎందుకు నడుచుకుంటూ వెళ్తోంది?

    • రచయిత, సురంజన తివారీ
    • హోదా, బీబీసీ న్యూస్

ఏనుగులు స్వతహాగా ఎంతో తెలివైన జీవులు. ఈ విషయం వాటిని ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్న పరిశోధకులకు తెలుసు.

కానీ వారికీ కూడా అంతుచిక్కని విషయం ఒకటుంది. అదే చైనాకి చెందిన 16 నుంచి 17 ఏనుగులతో కూడిన గుంపు.

వాటి ప్రవర్తన అంతుబట్టక ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు తలలుపట్టుకుంటున్నారు.

సాధారణంగా సొంత ఆవాసాలను వదిలి ఎక్కువ దూరం ప్రయాణించని గజరాజులు.. ఏడాది కాలంలో 500 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

అవి ఏ నిమిషాన ఎటు పయనమవుతాయో అంచనా వేయడం అనుభవమున్న పరిశోధకులకు కూడా కష్టతరమవుతోంది.

గత ఏడాది చైనాలో మియన్మార్‌ సరిహద్దుల సమీపంలో యునాన్‌ ప్రావిన్స్‌లోని అభయారణ్యం నుంచి ఈ ఏనుగుల గుంపు ఉత్తరంవైపుగా బయలుదేరింది.

మార్గం మధ్యలోని సరస్సులలో జలకాలాడుతూ, బురదలో ఆడుకుంటూ సందడి చేశాయి. పొలాలు, ఊర్లు, నగరాల గుండా ప్రయాణించాయి. ఆహారం కోసం ఇళ్లు, పంటలు, దుకాణాలు ఇలా వేటిని వదలలేదు.

అయితే ప్రస్తుతం అవి తిరిగి దక్షిణం వైపు ప్రయాణాన్ని ప్రారంభించాయి. తిరిగి తమ గమ్యస్థానాన్ని చేరడానికే వెనుదిరిగాయా లేక దారి తప్పి ఎటుపడితే అటుపోతున్నాయా అన్న సంగతి ఎవరికీ అర్థం కావడంలేదు. ప్రస్తుతం ఇవి, యూక్సీ నగరం సమీపంలోని షీజీలో శివార్లలో సంచరిస్తున్నాయి.

‘నిజం ఎవరికీ తెలియదు. ఆహారం, నీరు, ఆవాసాల కోసం ఈ ఏనుగుల గుంపు ప్రయాణాన్ని ప్రారంభించి ఉంటుంది. సహజంగా తమ స్థావరాలను వదిలి వెళ్లని ఆసియా ఏనుగులు, మనుషులు సృష్టిస్తున్న అవాంతరాల వల్ల ఇలా చేసి ఉంటాయి’ అని ఏనుగుల సైకాలజీపై అధ్యయనం చేస్తున్న ప్రొఫెసర్‌ జోషువా ప్లాట్నిక్‌ బీబీసీకి తెలిపారు.

ఈ గుంపులో ప్రస్తుతం మూడు మగ ఏనుగులతో పాటూ దాదాపు 16 లేక 17 ఏనుగులు ఉన్నాయి. మిగతా జంతువులతో పోల్చితే ఏనుగుల ప్రవర్తన మనుషులకు దగ్గరగా ఉంటుంది.

జన్మనిచ్చినప్పుడు ఆనందం, మరణంలో శోకం, కొత్త ప్రదేశాల్లో ఆందోళన వంటి భావోద్వేగాలను ఏనుగులు అనుభవిస్తాయి. దారిలోనే రెండు ఆడ ఏనుగులు పిల్లలకి జన్మనివ్వడంపై నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

‘ఏనుగులు గర్భం దాల్చినప్పుడు కొత్త ప్రాంతాలకు వెళ్లడం అసాధారణం. అవి సాధ్యమైనంత వరకు సురక్షిత ప్రాంతాలను వెతకడానికి ప్రయత్నిస్తాయి’ అని జాంబియాలో వన్యప్రాణి సంరక్షణ సంస్థ అయిన గేమ్‌ రేంజర్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన లీసా ఒలివర్‌ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన ఏనుగుల గుంపు బురదలో సేదతీరుతున్న ఫోటోలు కూడా అసాధారణమైనవని లీసా పేర్కొన్నారు.

‘సాధారణంగా ఏనుగు పిల్లలు భూమిపై పడుకుంటాయి. పెద్ద ఏనుగులు చెట్లు లేదా మట్టి దిబ్బలపై ఒరుగుతాయి. ఎందుకంటే వాటిది భారీ శరీరాకృతి అవ్వడంతో ఏదైనా ముప్పు వస్తే, భూమిపై పడుకుంటే లేవడానికి చాలా సమయం పట్టడమే కాకుండా వాటి ఊపిరితిత్తులు, గుండెపై కూడా ఒత్తిడి పడుతుంది’ అని ఆమె చెప్పారు.

పట్టణాల గుండా ప్రయాణం సాగించడంతో వివిధ శబ్దాలతో ఉక్కిరిబిక్కిరి అవ్వడంతో అలా ఆద మరిచి సేద తీరి ఉంటాయి అని లీసా ఒలీవర్ తెలిపారు.

డ్రోన్ల సాయంతో నిపుణులు ఏనుగుల గుంపు కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వాటి మార్గంలో ఉండే ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఏనుగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటానికి డ్రోన్ల ద్వారా తీసిన ఫోటోలు వాటిపై అధ్యయనం చేస్తున్న వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

ఇటీవల కాలంలో ఏనుగుల మందను నిలువరించడానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోకి రాకుండా, రోడ్లపై భారీ ట్రక్కులను నిలుపుతున్నారు. వాటికి ఇష్టమైన ఆహారాన్ని అందిస్తూ దారి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏనుగుల గుంపును రక్షించడానికి ప్రభుత్వం, స్థానిక అధికారులు, గజరాజుల పరిరక్షణ ప్రాజెక్టుల మధ్య సహకారాన్ని లీసా ఒలీవర్‌ కొనియాడారు. ఈ గుంపు అందరి దృషిని ఆకర్షించడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వన్యప్రాణుల సంరక్షణకు సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)