హువావే: పడిపోయిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు, పందుల పెంపకంపై దృష్టి పెట్టిన చైనీస్ టెక్ సంస్థ

ఫొటో సోర్స్, Getty Images
స్మార్ట్‌ఫోన్ల తయారీలో పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న హువావే సంస్థ కొంత కాలంగా పందుల పెంపకానికి కావలసిన సాంకేతికపై దృష్టి సారిస్తోంది.
తమ జాతీయ భద్రతకు హువావేతో ముప్పు ఉందంటూ ట్రంప్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అమెరికా నిర్ణయాలతో ఈ చైనీస్ టెక్ దిగ్గజానికి స్మార్ట్‌ఫోన్ల తయారీకి కావలసిన కీలక విడి భాగాలు దిగుమతి చేసుకునే అవకాశాలు కూడా తగ్గిపోయాయి.
దాంతో హువావే స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు క్షీణించాయి. ఇప్పుడు హువావే ఇతర ఆదాయ వనరుల కోసం అన్వేషిస్తోంది.
పందుల పెంపకం కోసం కృత్రిమ మేధస్సు (ఏఐ)కు సంబంధించిన సాంకేతిక అందించడంతో పాటూ బొగ్గు గనుల పరిశ్రమలో కూడా కాలు పెడుతోంది.
హువావే సంస్థ వినియోగదారుల సమాచారాన్ని చైనా ప్రభుత్వంతో పంచుకుంటోందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలుమార్లు ఆరోపించారు.
అయితే, హువావే ఆ ఆరోపణలన్నింటినీ ఖండించింది.
కానీ, ఈ ఆరోపణల ఫలితంగా, ప్రపంచంలోని అతి పెద్ద టెలికాం పరికరాల తయారీ సంస్థ అయిన హువావే 4జీ మోడల్స్ తయారీకి మాత్రమే పరిమితమైపోయింది.
5జీ మోడల్స్‌కు కావలసిన ముఖ్యమైన భాగాలను దిగుమతి చేసుకునేందుకు అమెరికా ప్రభుత్వం అనుమతించట్లేదు.

ఫొటో సోర్స్, Getty Images
స్మార్ట్‌ఫోన్ల తయారీకి కావలసిన మైక్రోచిప్స్ దిగుమతిపై ఆంక్షలు ఉండడంతో 2020 చివరిర్లో హువావే స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు 42% క్షీణించాయి.
జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లవచ్చన్న ఆందోళనతో బ్రిటన్‌తో సహా మరి కొన్ని దేశాలు కూడా హువావే 5జీ టెక్నాలజీని అనుమతించడం లేదు.
ఈ ఏడాది హువావే స్మార్ట్‌ఫోన్ల తయారీని అధికంగా 60% తగ్గించేస్తుందని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే, ఎంత తగ్గిస్తారన్నదానిపై హువావే స్పష్టమైన సమాచారమేమీ ఇవ్వలేదు.
"ఇక్కడ సమస్య హువావే నాణ్యత, ఉత్పత్తి అనుభవాలకు సంబంధించినది కాదు. దేశాల మధ్య ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఈ సంస్థ చిక్కుకుపోయింది" అని హువావే ప్రతినిధి బీబీసీకి చెప్పారు.
అందుకే హువావే ఇతర వ్యాపార మార్గాలను అన్వేషిస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు, స్మార్ట్ వెహికిల్స్, వేరబుల్ డివైజెస్.. ఇలా ఇతర అవకాశాలను పరిశీలిస్తోంది. స్మార్ట్ కార్ ఉత్పత్తి చెయ్యాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం.
వీటితో పాటూ, కొన్ని సంప్రదాయకమైన వ్యాపారాలు చేపట్టాలనే ఉద్దేశంలో కూడా ఉంది.
ప్రపంచంలోనే అతి పెద్ద పందుల పెంపకం పరిశ్రమ చైనాలోనే ఉంది. ప్రపంచంలోని సగం పందులు కూడా ఆ దేశంలోనే ఉన్నాయి.
పందుల కదలికలను ట్రాక్ చేయడానికి, వాటికి వచ్చే వ్యాధులను గుర్తించడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తూ పందుల పెంపకాన్ని ఆధునికీకరించేందుకు సాంకేతికత తోడ్పడుతోంది.
ముఖకవళికల గుర్తింపు సాంకేతికత (ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ) కూడా పందులను గుర్తించేందుకు వాడొచ్చు. అలాగే వాటి బరువు, ఆహారం, వ్యాయామం మొదలైన విషయాలను పర్యవేక్షించేందుకు సాంకేతికతను అభివృద్ధి పరుస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హువావే ఇప్పటికే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. అయితే, గత నెలలో స్థానిక వీగర్ ముస్లింలంకు సంబంధించి.. జాతిని బట్టి ముఖాలను గుర్తిస్తోందన్న విమర్శలు ఎదుర్కొంది హువావే.
జేడీ.కాం, అలీబాబా మొదలైన ఇతర చైనీస్ టెక్ దిగ్గజాలు ఇప్పటికే పందుల పెంపకం పరిశ్రమలో సాంకేతికను అభివృద్ధి పరిచే దిశలో పనిచేస్తున్నాయి.
బొగ్గు గనులలో తక్కువమంది కార్మికులతో, ఎక్కువ భద్రత, అధిక సామర్థ్యంతో పని చేయగలిగే సాంకేతికతను అభివృద్ధి పరిచే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నామని ఇటీవలే హువావే వ్యవస్థాపకులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రెన్ జెంగ్ఫే ప్రకటించారు.
అంతే కాకుండా, టీవీలు, కంప్యూటర్లు, టాబ్లెట్ల తయారీలో కూడా హువావే కాలు పెడుతోందని రెన్ తెలిపారు.
"స్మార్ట్‌ఫోన్ల మీద ఆధారపడకుండా కూడా మేము నెగ్గుకురాగలం" అని రెన్ అన్నారు. అమెరికా హువావే పేరును బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగిస్తుందన్న నమ్మకం లేదని కూడా ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:
- ధోనీ వ్యవసాయం ఎలా చేస్తున్నారో చూశారా? కడక్‌నాథ్ కోళ్లు, స్ట్రాబెర్రీలు..
- నువ్వలరేవులో పెళ్లి: వధువు వరుడి మెడలో తాళి కట్టడమే కాదు, ఈ ఊరికి ఎన్నో ప్రత్యేకతలు
- కొటియా గ్రామాలు: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని ఈ 34 గ్రామాలు ఏ రాష్ట్రానివి? దశాబ్దాలుగా ఈ వివాదం ఎందుకు కొనసాగుతోంది?
- కేజీఎఫ్: కోలార్ గోల్డ్‌ఫీల్డ్స్ ఇప్పుడు ఎందుకు వెలవెలబోతున్నాయి... ఏపీలో చిగురిస్తున్న ఆశలేంటి?
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- డోనల్డ్ ట్రంప్‌కు అభిశంసన ఆరోపణల నుంచి విముక్తి... సెనేట్‌లో వీగిపోయిన తీర్మానం
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
- సెక్స్ సమయంలో శరీరంలో చేరి ప్రాణాలకే ముప్పు తెచ్చే ఈ బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- సెక్స్ పట్ల సమాజానికి గౌరవం ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









