రైతుల ఆందోళనలు: ‘రెండేళ్లకు సరిపోయే సరకులతో తిష్ట వేశాం... ఎన్ని రోజులన్నది మోదీ ప్రభుత్వమే తేల్చుకోవాలి’

    • రచయిత, దిల్ నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో పది రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతులు వ్యూహం మార్చుకుంటున్నారు. మరింత దూకుడుగా నిరసనలు చేపట్టే ప్రణాళికల్లో ఉన్నారు.

శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రభుత్వంతో రైతుల ఐదో విడత చర్చలు జరిగాయి. తమ డిమాండ్ల సాధన విషయంలో రైతులు వెనక్కితగ్గేలా లేరని ఈ సమావేశం అనంతర పరిణామాలతో స్పష్టమైంది. ఈ చర్చల్లో.. తాము 'మౌన వ్రతం' పాటించామని రైతు సంఘాల ప్రతినిధులు చెప్పారు. తదుపరి చర్చల కోసం డిసెంబర్ 9వ తేదీన మరోసారి సమావేశం అయ్యేందుకు రైతులకు, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను చట్టపరమైన హక్కుగా కల్పించాలన్న డిమాండ్ నెరవేరితే సంతృప్తి చెందేలా మొదట్లో కనిపించిన రైతులు... ఇప్పుడు మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తే కానీ, నిరసనలను ఆపమని అంటున్నారు.

‘‘మాది ఒకే డిమాండ్... ఆ మూడు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలి. ఇంతకన్నా తక్కువగా ఏం చేసినా, మేం అంగీకరించం. ప్రభుత్వంతో జరగాల్సిన చర్చలు జరిగాయి. ఆ చట్టాలు ఉపసంహరించుకునేంతవరకూ మేం ఇక్కడి నుంచి తప్పుకోం’’ అని కీర్తి కిసాన్ యూనియన్ నాయకుడు రాజిందర్ సింగ్ అన్నారు.

నవంబర్ 26-27న చేపట్టిన ‘దిల్లీ చలో’ ఆందోళనల్లో పంజాబ్, హరియాణాలోని రైతు సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.

పంజాబ్ నుంచి దిల్లీ వైపు తరలి వస్తున్న రైతులను ఆపేందుకు ప్రభుత్వం వీలైనన్ని ప్రయత్నాలు చేసింది.

రోడ్లపై బారికేడ్లు పెట్టారు. రోడ్లను తవ్వారు. నీటి క్యానన్లను ప్రయోగించారు. కానీ, రైతులు వీటన్నింటినీ ఎదుర్కొంటూ దిల్లీ వరకూ వచ్చారు.

అప్పటి నుంచి రైతుల ఆందోళనలు రోజురోజుకూ బలపడుతూ వస్తున్నాయి. పంజాబ్, హరియాణాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివస్తున్నారు. నిరసనకారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రైతు సంఘాలు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి.

డిసెంబర్ 8న భారత్ బంద్

ప్రభుత్వం రైతులను బురాడీ మైదాన్‌లో ప్రదర్శనలు నిర్వహించుకోవాలని సూచించింది. కొన్ని సంఘాలు దీనికి అంగీకరించేందుకు కూడా సిద్ధమయ్యాయని... అయితే, జనాగ్రహం పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న నేపథ్యంలో దిల్లీ సరిహద్దుల్లో అలాగే తిష్ట వేసి ఉండాలని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రైతు సంఘం నాయకుడు ఒకరు చెప్పారు.

‘‘ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. ఒకవేళ రైతు సంఘాల నేతలు ప్రభుత్వంతో రాజీకి వస్తే, ఆ నేతలనే రైతులు మార్చేస్తారు. వాళ్లు వెనక్కితగ్గరు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వంతో ఓవైపు శనివారం, ఆదివారం చర్చలు జరగాల్సి ఉన్నా... రైతులు ముందుగానే డిసెంబర్ 8న భారత్ బంద్ ప్రకటించారు.

‘‘భారత్ బంద్ ప్రకటించడం ద్వారా మా వైఖరి ఏంటో ప్రభుత్వానికి స్పష్టం చేశాం. మా డిమాండ్లకు ఒప్పుకోకపోతే, ఆందోళనలు మరింత తీవ్రం అవుతాయి. దిల్లీ ఏడు సరిహద్దులను పూర్తిగా మూసేస్తాం. ఆందోళనల్లో పాల్గొంటున్న ప్రముఖులంతా సరిహద్దుల్లోనే తిష్ట వేస్తారు’’ అని మహారాష్ట్రకు చెందిన రైతు సంఘం నాయకుడు సందీప్ గిడ్డే అన్నారు.

‘మోదీ మ్యాజిక్ పోతుందని...’

ఈ చట్టాల విషయంలో వెనక్కితగ్గితే ‘మోదీ మ్యాజిక్’ భావనకు భంగం కలుగుతుందన్న కారణంతో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని రాజిందర్ సింగ్ అభిప్రాయపడ్డారు.

మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనకరమైనవని, రైతులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారని ప్రధాని మోదీ పదే పదే అంటున్నారు.

ఏడేళ్ల పాలనలో నోట్లరద్దు, జీఎస్‌టీ లాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని మోదీ ప్రభుత్వం జనాగ్రహం చవిచూసిందని, అందుకే పరువు పోగొట్టుకోకూడదని తపనపడుతోందని రాజిందర్ అన్నారు.

రైతు సంఘాలు ఏం చేయబోతున్నాయి?

దూరపు రాష్ట్రాల రైతులు దిల్లీ రాలేకపోతున్నా, వారి వారి రాష్ట్రాల్లో ఆందోళనలకు సిద్ధమవుతున్నారని ఒడిశాకు చెందిన నవ్ నిర్మాణ్ రైతు సంఘం నేత అక్షయ్ సింగ్ చెప్పారు.

‘‘దిల్లీ నుంచి ఒడిశా రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. మా రాష్ట్రం రైతులు ఇక్కడికి చేరుకోలేరు. ఒడిశాలో ఆందోళనలను మాత్రం తీవ్రం చేస్తున్నాం. ప్రభుత్వం ఈ చట్టాలను ఉపసంహరించుకోకపోతే, ప్రతి జిల్లాలోనూ ఆందోళనలు నిర్వహిస్తాం. ఇవి రైతుల ఆందోళనలు మాత్రమే కాదు... ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాందోళనలు. ఒకప్పుడు ప్రభుత్వం ప్రజలకు సేవకుల పాత్రలో ఉండేది. ఇప్పుడు కార్పొరేట్లకు సేవకుల పాత్రలోకి మారింది. ఈ ప్రభుత్వంలో నిర్ణయాలు ప్రధాని కాకుండా, మరెవరో తీసుకుంటున్నారని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు’’ అని ఆయన అన్నారు.

ఈ ఆందోళనలు ఇంత పెద్దవవుతాయని రైతు సంఘాల నాయకులు కూడా ఊహించలేదని రాజిందర్ సింగ్ అన్నారు.

‘‘మేం ఆరు నెలలకు సరిపోయే సరుకులు తీసుకుని వచ్చాం. కానీ, జనాలు మా కోసం మరింత పంపించారు. ఇప్పుడు రెండు ఏళ్లకు సరిపోయే సరుకులు మా వద్ద ఉన్నాయి. ఈ ఆందోళనలు ఎంత కాలం కొనసాగాలన్నది మోదీ ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి. ఎంత కాలం సాగితే, ప్రభుత్వం అంత లోతుకు దిగజారుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)