You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇండొనేసియా: ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు, కానీ...
- రచయిత, ఆండ్రియాస్ ఇల్‌నర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇండోనేషియాలోని ఒక గ్రామస్థుడి ఇంటి పైకప్పు చీల్చుకుని పడిన ఒక ఉల్క లక్షల డాలర్ల విలువ చేస్తుందని, అతడి జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుందని ఒక వార్త ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికల్లో నిలిచింది.
అతడికి దొరికిన ఆ ఉల్క విలువ 1.8 మిలియన్ డాలర్లు( 13 కోట్ల రూపాయలకు పైనే) ఉంటుందని, అతడిని రాత్రికిరాత్రి కోటీశ్వరుడిని చేస్తుందని వార్తల్లో చెప్పారు.
లేదంటే, ఆయన దాని ధర కాస్త తగ్గించి, అమెరికాలో ఎవరికో ఒకరికి అమ్మేస్తారని చర్చలు కూడా నడిచాయి.
కానీ, వీటిలో ఏదీ నిజం కాలేదు. ఆ ఉల్క లక్షల డాలర్లు చేయదు. దానిని ఆ ధరకు ఎవరూ కొనలేదు. దాన్ని మొదట చూడగానే ఎన్ని అంచనాలు వేశారో, అవేవీ జరగలేదు.
ఇంటి పైన పడిన శిల
మనం అసలు కథలోకి వెళ్తే.. అది చందమామ కథలా లేకపోయినా, ఆసక్తికరంగా ఉంటుంది. జోసువా హుటాగలంగ్ సుమత్రాలోని ఒక గ్రామంలో శవపేటికలు తయారు చేస్తుంటారు. ఆగస్టు మొదట్లో ఆయన తన పనిలో ఉన్నప్పుడు పైనుంచి ఒక శబ్దం వినిపించింది. కొన్ని సెకన్ల తర్వాత ఆయన ఇంటి పైన ఒక పెద్ద శబ్దం వినిపించింది.
మొదట, జోసువా కూడా భయపడ్డారు. ఏమైందా అని చూశారు. ఒక అంతుపట్టని వస్తువు ఆయన ఇంటి పైకప్పు నుంచి లోపల పడింది. దాని వేగానికి ఇంటికి ఉన్న మెటల్ పైకప్పుకు కూడా రంధ్రం కూడా పడింది. అది ఇంట్లో మట్టి నేలలో ఆరు అంగుళాల లోతులో కూరుకుపోయింది.
ఆయన చివరికి దాదాపు 2 కిలోల బరువుతో వింతగా కనిపిస్తున్న ఒక చిన్న బండరాయిని తవ్వి బయటకు తీశారు.
"నేను దాన్ని తీసేటప్పటికి కూడా, అది వెచ్చగా ఉంది. ఇది ఆకాశం నుంచి పడిన ఉల్కేమో అని నాకు అప్పుడే అనిపించింది. ఎవరైనా, అంత పెద్ద రాయిని మా పైకప్పు మీద విసరడం అసాధ్యం" అని జోసువా బీబీసీ ఇండోనేషియా సర్వీస్‌కు చెప్పారు.
అంతరిక్షం నుంచి వచ్చిన ఒక బండరాయి మన పైకప్పును విరగ్గొట్టుకుని ఇంట్లో పడడం సాధారణంగా జరగదు. దాంతో, జోసువా తనకు దొరికిన ఆ ఉల్క ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టారు. తర్వాత ఆ వార్త మెల్లమెల్లగా ప్రపంచమంతా పాకింది.
ఉల్కలు ప్రధానంగా అంతరిక్షం నుంచి వేగంగా పడుతుండే పురాతన శిలలు. అవి అప్పుడప్పుడూ భూమి వరకూ వస్తుంటాయి.
ఉల్కలపై అంత ఆసక్తి ఎందుకు
వాటిపై శాస్త్రీయపరంగా ఆసక్తి ఉండడంలో ఆశ్చర్యమేమీలేదు. అవి ఎక్కడనుంచి వచ్చాయి, ఏ పదార్థంతో తయారయ్యాయి. విశ్వం గురించి అవి మనకు ఏమేం చెబుతాయి అనే ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి.
వీటికి సేకరణ ఆసక్తి కూడా తోడైంది. ఉల్కలు అంటే 400 కోట్ల ఏళ్ల కంటే పురాతనమైనవి, అంటే, మన భూమి కంటే పురాతనమైనవి. అందుకే, వాటిపై అందరికీ అంత ఆసక్తి ఉంటుంది.
ఉల్కలను సేకరించేవారు జోసువా శిలపై కూడా ఆసక్తి చూపించారు. దాన్ని కొనాలని తహతహలాడారు. కానీ ఆగస్టులో కోవిడ్ వల్ల మొత్తం ప్రపంచమంతా షట్ డౌన్ అయ్యింది. దాంతో, వారు వెంటనే ఇండోనేషియా చేరుకోవడం సాధ్యం కాలేదు. అదే సమయంలో అమెరికాలో దానిని కొనుగోలు చేయాలనుకున్న కొందరు ఉల్కలపై ఆసక్తి ఉన్న ఇండోనేషియాలోని అమెరికన్ జారెడ్ కాలిన్స్ ను సంప్రదించారు.
ఆయన సుమత్రాకు వెళ్లి జోసువాను కలిశారు ఆ శిలను పరిశీలించారు. దానిని సరిగా భద్రపరిచారా అని చూశారు. ఉల్కను త్వరగా నాశనం చేసే నీళ్లు దానికి తగిలాయేమో గమనించారు.
"మన సౌర వ్యవస్థ ప్రారంభ దశకు సంబంధించిన అసలైన, భౌతిక అవశేషాన్ని చూసే అవకాశం నాకు దొరకడం నిజంగా నమ్మలేకపోతున్నా. నేను వెంటనే దానిలో విలక్షణమైన జెట్ బ్లాక్ రంగు, బయటివైపు పలుచటి లేత గోధుమరంగు ఉండడం గమనించాను. వాతావరణం గుండా ప్రయాణించడంతో దానికి ఆ రంగు ఏర్పడింది. దానికి ఒక ప్రత్యేకమైన వాసన కూడా ఉంది, దాన్ని మాటల్లో వర్ణించడం కష్టం" అని ఆయన చెప్పారు.
అమెరికాలోని ఒకరు ఒక ధరకు దానిని కొనడానికి జోసువాతో డీల్ చేసుకున్నారు. జారెడ్ మధ్యవర్తిగా ఆ శిల అమ్ముడైపోయింది.
కానీ, అది ఎంతకు అమ్ముడయ్యిందో బయటపెట్టలేదు. కానీ, అది న్యాయమైన ధరేనని, ఈ ఒప్పందంలో ఎవరూ ఎవరినీ మోసం చేయలేదని రెండు వైపులవారూ చెబుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా పతాకశీర్షికల్లో కనిపించిన అంకెకు మాత్రం ఇది అమ్ముడు కాలేదు. అది కనీసం వారు అనుకున్న దానికి దగ్గరగా కూడా లేదు.
ధర ఎలా నిర్ణయించారు
అయితే దీనికి ఈ 1.8 మిలియన్ డాలర్లు అనే ధరను వారు ఎలా నిర్ణయించారు. దీనిని జోసువా ఆశ, కొంతమంది ఔత్సాహికుల లెక్కలు ఫిక్స్ చేశాయి.
జోసువా ఇంట్లో ఉల్కకు సంబంధించి కొన్ని చిన్న చిన్న ముక్కలు కూడా పడ్డాయి. వాటిలో కొన్నింటిని అమ్మేశారు.
వీటిలో రెండు ముక్కలను ఈబే సైట్‌లో పెట్టారు. 0.3 గ్రాముల ఒక ముక్కకు 285 డాలర్లు. 33.68 గ్రాముల ముక్కకు 29,120 డాలర్ల ధర పెట్టారు.
ఈ లెక్క ప్రకారం గ్రాముకు 860 డాలర్లు వస్తుంది. దానిని పెద్ద శిల బరువుతో గుణిస్తే అది 1.8 మిలియన్ డాలర్లు వస్తుంది. దాంతో వారు ఆ ధరకు ఫిక్స్ అయ్యారు.
"ఆ అంకె చూడగానే నాకు నవ్వొచ్చింది" అని ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రొఫెసర్ లారెన్స్ గార్వీ బీబీసీతో అన్నారు. ఆయన సమత్రాలో దొరికిన ఉల్క భాగాలను కూడా పరీక్షించారు.
"నేను ఈ కథను ఇంతకు ముందు చాలాసార్లు చూశాను. కొందరు ఉల్కను కనుగొంటారు. తర్వాత ఈబేలో చూస్తారు. అక్కడ ఉన్నవి చూసి, అది లక్షల డాలర్లు చేస్తుందని అనుకుంటారు. ఎందుకంటే, ఈబేలో చిన్న ముక్కలు పెద్ద మొత్తానికి అమ్ముడవడం వారు చూస్తారు" అన్నారు.
ఒక గ్రహాంతర మట్టి ముద్ద
కానీ, అన్నీ అనుకున్నట్టే జరగవు. అంతరిక్షం నుంచి పడిన భూమికంటే పురాతనమైనవి ఏవైనా, వాటిని సొంతం చేసుకోవాలని జనాలకు ఆసక్తి ఉంటుంది.
అందుకే, ఒక చిన్న ఉల్క ముక్కకు కొన్ని వందల, వేల డాలర్లు చెల్లించే వారు మనకు కనిపిస్తారు. కానీ, ఒక పెద్ద శిల కోసం ఎవరూ మిలియన్ డాలర్లు చెల్లించరు" అంటారు ప్రొఫెసర్ గార్వీ.
నిజానికి, అలాంటి ఉల్క సైజు పెరిగేకొద్దీ దాని ధర పడిపోతూ ఉంటుంది.
అసలు, ఈబేలో చెప్పిన ధరకు ఎవరైనా ఆ ముక్కలను కొంటారా అని కూడా ఆయనకు సందేహం వచ్చింది. అలాంటి వాటిని సగం ధరకే సొంతం చేసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
అంటే, ఒక ఉల్కకు మార్కెట్ ధర నిర్ణయించడం అసాధ్యం. అలాంటప్పుడు సుమత్రాలో దొరికిన ఉల్క అసలు విలువ ఎంతుంటుంది.
"దాన్లో దాదాపు 70-80 శాతం మట్టే ఉంటుంది. చెప్పాలంటే, అదొక గ్రహాంతర మట్టి ముద్ద"ని ఆరిజోనా ప్రొఫెసర్ చెప్పారు.
"దాన్లో కాస్త ఐరన్, ఆక్సిజన్, మెగ్నీషియం, అల్యూమినియం, కాల్షియం లాంటివి ఉండచ్చు. నేనైతే దానికి బహుశా ఒకటి రెండు డాలర్లు ఇస్తానేమో" అన్నారు.
అది దాదాపు ఒక మీటరు వ్యాసంతో ఉండుండవచ్చని, భూమి వాతావరణంలోకి వచ్చాక విరిగిపోవడంతో కొన్ని ముక్కలు మాత్రమే నేలకు చేరుంటాయని ఆయన భావిస్తున్నారు. ఆ ముక్కల్లో ఒకటి జోసువా హుటాగ్లాంగ్ ఇంటిపై పైకప్పు లోంచి పడిందని చెబుతున్నారు.
ప్రారంభ జీవానికి ఆధారాలు
ఉల్కలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అలాంటి వాటికి శాస్త్రీయంగా విలువ ఉంటుంది.
"సుమత్రాలో దొరికిన ఉల్క ఒక కార్బనేషియస్ కాండ్రైడ్. గ్రహాలు ఏర్పడడానికి ముందు సంభవించిన ఘటనలను తెలుసుకోడానికి ప్రారంభ సౌర వ్యవస్థ అవశేషాలు ఒక అవగాహనను అందిస్తాయ"ని ఎర్త్ అబ్జర్వేటరీ సింగపూర్‌కు చెందిన జాసన్ స్కాట్ హెర్రిన్ బీబీసీకి చెప్పారు.
వాటిలో సేంద్రీయ సమ్మేళనాలు ఉండడం, మన గ్రహం ప్రారంభం నుంచీ అవి మన భూమిపైకి దూసుకొస్తుండడం వల్ల "ఉల్కలు తమతోపాటూ బహుశా ప్రారంభ జీవితానికి సంబంధించిన ఆధారాలు కూడా తీసుకొస్తుండచ్చు".
అంటే జోసువా కనుగొన్న ఉల్కలు లాంటివి శాస్త్రవేత్తలకు భూమిపై జీవం ప్రారంభం గురించి ఆధారాలు ఇవ్వవచ్చు.
ఇది ఒక శాస్త్రీయ ఆధారం. దానికి మిలియన్ డాలర్ల వెలకట్టలేం. కానీ, ఉల్కలు కొనాలనే అంత ఆసక్తి ఎందుకు అనేది మాత్రం ఇందులో దాగుంది.
ఇవి కూడా చదవండి:
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- నరేంద్ర మోదీ ఆర్మీ యూనిఫామ్ వేసుకోవడంపై సోషల్ మీడియాలో చర్చ
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)