You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డ్యాన్‌డ్రఫ్‌కి డైనోసార్లకి సంబంధం ఏంటి?
- రచయిత, మట్ట్ మెక్‌గ్రాత్
- హోదా, బీబీసీ పర్యావరణ ప్రతినిధి
పాములు తమ చర్మాన్ని వదిలివేయడం గురించి మనకు తెలిసిందే. దీన్నే మనం కుబుసం విడవడం అంటాం.
అయితే, లక్షల సంవత్సరాల కిందట భూమిపై జీవించిన డైనోసార్లు, ఆ కాలం నాటి పక్షులు కూడా చర్మాన్ని విడిచేవని శాస్త్రవేత్తలు తమ తాజా అధ్యయనం ద్వారా చెబుతున్నారు.
డైనోసార్ల శిలాజాలపై పెచ్చులుగా ఉన్న పదార్ధాన్ని పరిశీలించడంతో ఈ విషయం తెలిసిందని వారు తెలిపారు.
ఈ పదార్థం చుండ్రేనని తమ పరిశోధనల్లో తేలిందని వారు పేర్కొన్నారు.
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కార్క్‌కు చెందిన ప్రొఫెసర్ మెక్ నరమా మరికొందరు 2012లో చైనాకు వెళ్లి అక్కడి డైనోసార్ల శిలాజాలను అధ్యయనం చేశారు.
''రెక్కలున్న డైనోసార్ శిలాజాలాలపై రసాయనికంగా, ఎలక్ర్టానిక్ మైక్రోస్కోప్ కింద పరీక్షలు నిర్వహించాం. ఇలా డైనోసార్ల శిలాజాలాలపై పరిశోధనలు చేయడం ఇదే మొదటిసారి. వీటి ఫలితాలు శాస్త్రీయ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి'' అని మెక్ పేర్కొన్నారు.
పాములు, సరీసృపాల మాదిరిగా కాకుండా డైనోసార్లు చిన్న చిన్న భాగాలుగా తమ ఈకల నుంచి చర్మాన్ని వదిలేసేవని వీరి బృందం తెలిపింది.
అంతేకాదు, డైనోసార్ల కాలం నాటి పక్షులు ఎగరడంలో అంత నైపుణ్యాన్ని ప్రదర్శించేవికావని తమ అధ్యయనంలో తేలిందని మెక్ పేర్కొన్నారు.
''నిజానికి మేం అప్పటి పక్షుల ఈకలపై అధ్యయనం చేయాలనుకున్నాం. ఈకలను పరిశీలించగా వాటిపై తెల్ల మచ్చలుండటం గమనించాం. ఆ మచ్చలు ఈకల చుట్టూ ఉన్నాయి'' అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ మరియా మెక్ నమరా బీబీసీకి తెలిపారు.
''అయితే మేం వాటిని శిలాజాల జీవ లక్షణమని అనుకున్నాం. కానీ, అది చివరకు చుండ్రు అని తేలడంతో ఆశ్చర్యపోయాం'' అని ఆయన వివరించారు.
ఈకలు ఉండటం వల్లే వాటికి చుండ్రు వచ్చిఉంటుందని తాము నమ్ముతున్నామన్నారు.
''శిలాజాలపై పెచ్చులుగా అది(చుండ్రు) కనిపించింది. దాన్ని పరిశోధించగా మరో ఆసక్తికర విషయం కూడా తెలిసింది. డైనోసార్లు చర్మాన్ని ఏ విధంగా వదిలేస్తున్నాయో కూడా దీని వల్లే అర్థమైంది'' అని ఆయన వివరించారు.
ఈ అధ్యయనంపై మరొక ప్రొఫెసర్ మైక్ బెంటన్ మాట్లాడుతూ, ''డైనోసార్ల చర్మాన్ని అధ్యయనం చేయడం అసాధారణం. ఇప్పటి బల్లులు, పాముల మాదిరిగా డైనోసార్లు ఒకేసారి తమ చర్మాన్ని వదిలేయడం లేదని ఈ చుండ్రును పరిశోధించడంతో తెలిసింది. అవి కేవలం తమ ఈకల నుంచే చర్మాన్ని కొద్దికొద్దిగా వదిలేస్తున్నాయి'' అని ఆయన వివరించారు.
నేటి పక్షుల కంటే అప్పటి పక్షుల శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉందని కూడా తమ అధ్యయనంలో తేలిందని పరిశోధకులు తెలిపారు.
వీరి అధ్యయన ఫలితాలు నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)