You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రైతుల నిరసనలు: ఉద్యమాన్ని నడిపించేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆరు అడుగుల పొడవున్న సందీప్ సింగ్ నిరసనలు చేపట్టేందుకు ఫతేగఢ్ నుంచి దిల్లీ సరిహద్దులకు వచ్చారు. ఆయనతోపాటు మరొక 20 మంది ఉన్నారు. వీరంతా రెండు ట్రాలీల్లో ఇక్కడకు చేరుకున్నారు.
ఈ బృందంలో నలుగురు తమ గ్రామానికి వెళ్లిపోతున్నారు. అయితే, అదే గ్రామం నుంచి మరొ ఎనిమిది మంది నిరసనలు చేపట్టేందుకు వస్తున్నారు.
‘‘నాకు మూడు ఎకరాల వరి పంట ఉంది. దాన్ని చూసుకోమని మా గ్రామస్థులకు చెప్పాను. వారు కూడా నువ్వు దిల్లీ వెళ్లు. పనులు మేం చూసుకుంటాం అన్నారు’’అని సందీప్ వివరించారు.
సందీప్ లాంటి వేల మంది రైతులు నిరసనలు చేపట్టేందుకు దిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. ట్రాలీలు, ట్రక్కుల్లో వచ్చిన వీరంతా రోడ్లపైనే నిరసన తెలుపుతున్నారు.
రోడ్డుపై వంట చేసుకోవడం, అక్కడే తినడం, అక్కడే పడుకోవడం లాంటి చర్యలతో నిరసనలు తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై వీరు నిరసన తెలుపుతున్నారు. వ్యవసాయంలోకి ప్రైవేటు రంగం అడుగుపెట్టేందుకు ఈ చట్టాలు వీలు కల్పిస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
అయితే, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే ఈ చట్టాలను తీసుకొచ్చామని, వీటితో రైతుల ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ, తమ భూములు లాక్కోవడానికే ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకొచ్చిందని రైతులు ఆరోపిస్తున్నారు.
‘‘చందాలు వేసుకుంటున్నాం‘‘
రైతుల ఉద్యమాన్ని పరిశీలిస్తుంటే.. అసలు వీరికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
సందీప్ లాంటి కొందరు రైతులైతే.. ప్రజల నుంచి డబ్బులు పోగేసి తాము ఇక్కడి వచ్చామని చెబుతున్నారు.
‘‘మేం వచ్చిన ట్రాక్టరు చాలా డీజిల్ తాగేస్తోంది. దాదాపు పది వేల రూపాయలు డీజిల్‌కే ఖర్చు చేశాం. ఈ డబ్బులను నేను, మా బాబాయ్ పెట్టుకున్నాం’’అని సందీప్ చెప్పారు.
డబ్బులు ఖర్చవుతున్నందుకు తనకు ఎలాంటి బాధాలేదని, దీన్ని భవిష్యత్‌కు పెట్టుబడిగా భావిస్తున్నానని చెప్పారు. ‘‘నిజమే.. పది వేల రూపాయలు ఖర్చు అయ్యాయి. అయితే ఆ చట్టాలు అమలుచేస్తే జరిగే విధ్వంసాన్ని మనం ఊహించలేం’’అని ఆయన వివరించారు.
నిరసన తెలియజేసేందుకు నృపేంద్ర సింగ్ బృందం లూథియానా నుంచి వచ్చింది. తనతోపాటు మూడు గ్రామాల రైతులు వచ్చారని ఆయన చెప్పారు. ఇక్కడకు వచ్చేందుకు అందరి దగ్గరా చందాలు సేకరించామని ఆయన వివరించారు.
‘‘మేం డబ్బుల కోసం చందాలు సేకరించాం. మా గ్రామంలో చాలా మంది మాకు డబ్బులు ఇచ్చారు. నేను ఒక్కడినే ఇప్పటివరకు రూ.20,000 ఖర్చు చేశాను. నాతోపాటు వచ్చిన చాలా మంది మాకు సాయం చేశారు’’అని ఆయన పేర్కొన్నారు.
సాయం చేస్తున్న ఎన్‌ఆర్‌ఐలు
విదేశాల్లో ఉంటున్న కొందరు ఎన్‌ఆర్ఐ స్నేహితులు తమకు సాయం చేస్తున్నారని నృపేంద్ర తెలిపారు.
‘‘నా స్నేహితుల్లో ఒకరు ఎన్‌ఆర్ఐ ఉన్నారు. ఆయన రూ.20,000 ఇచ్చారు. ఇంకా అవసరమైతే ఇస్తానని కూడా చెప్పారు. అవసరమైతే తన ఎన్‌ఆర్ఐ స్నేహితుల నుంచి నిధులు సేకరిస్తానని ఆయన అన్నారు. మాకు నిధులకు ఇప్పుడు ఎలాంటి కొరతా లేదు’’అని ఆయన వివరించారు.
మేం మాట్లాడిన వారిలో చాలా మంది తమకు ఎన్‌ఆర్‌ఐలు సాయం చేస్తున్నారని, నిరసనల గురించి వారు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని వివరించారు.
‘‘వెనకడుగు వేయొద్దు. గట్టిగా నిలబడండి. నిధులకు ఎలాంటి కొరతాలేదు’’అని విదేశాల్లోని తన స్నేహితులు హామీ ఇచ్చినట్లు నృపేంద్ర చెప్పారు.
‘‘మేం రైతులం. మా నిరసనలకు మేం డబ్బులు పెట్టుకోలేనంత పేదవాళ్లం కాదు. సిక్కుల లంగర్ (భోజనశాల) తరహా సదుపాయాలను మేం ఏళ్ల నుంచీ నడిపిస్తున్నాం. మాకు తిండికి కొదువలేదు. ఈ ఉద్యమానికి ఎలాంటి కొరతా లేదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
పెరుగుతున్న సంఖ్య
పంజాబ్, హరియాణాల్లోని దిల్లీ సరిహద్దులకు వస్తున్న ట్రాక్టర్లు, ట్రక్కుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇక్కడకు వస్తున్న ట్రాలీల్లో ఆహారం, పానీయాలు ఉంటున్నాయి.
మరోవైపు రోజంతా రోడ్లపై పొయ్యిలు వెలుగుతూనే ఉన్నాయి. చాలా గురుద్వారాలు ఇక్కడకు వచ్చే రైతులకు సాయం చేస్తున్నాయి. దిల్లీకి చెందిన చాలా మంది సిక్కులు కూడా సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు.
నిరసన తెలపడానికి వచ్చినవారిలో ఇంద్రజీత్ సింగ్ కూడా ఒకరు. తనతో వచ్చిన చాలా మంది నిరసనలకు సాయం అందించారని ఆయన తెలిపారు.
‘‘ట్రాక్టర్ నాదే. దానిలో డీజిల్ కొట్టించాను. నాతో 15 మంది ఉన్నారు. వీరంతా నిధులు సేకరించారు. ప్రతి రైతూ తమకు తోచినంత సాయం చేశారు. భూమి ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ సాయం చేశారు’’అని ఆయన చెప్పారు.
‘‘ఉద్యమం లక్ష్యాలు నెరవేరే వరకు వెనక్కి రాకూడదని ముందే మేం నిర్ణయించుకున్నాం. ఏదైనా అవసరమైతే మరింత మంది వచ్చి మాతో కలుస్తారు. మాకు ఏవైనా అవసరమొచ్చినా వారే చూసుకుంటారు’’అని ఇంద్రజీత్ అన్నారు.
రాజకీయ నిధులపై ప్రశ్నలు
కొన్ని రాజకీయ పార్టీలు కూడా రైతుల ఉద్యమానికి నిధులు సమకూరుస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
‘‘రాజకీయ పార్టీలు మాకు నిధులు ఇస్తున్నాయని చెప్పేవారు ముందు ఆధారాలు చూపించాలి. ఎందుకంటే నిధులు మాకు మా గ్రామస్థులే ఇస్తున్నారు. కొందరు రూ.100 చొప్పున కూడా సాయం చేశారు’’అని ఇంద్రజీత్ అన్నారు.
మన్‌దీప్ సింగ్.. హోషియార్‌పుర్ నుంచి ఇక్కడకు వచ్చారు. రెండు ట్రాక్టర్లు, ఒక ఇన్నోవా కారుపై మూడు గ్రామాల ప్రజలు తనతో వచ్చినట్లు ఆయన తెలిపారు.
‘‘నేను రూ. 2,100 ఇచ్చాను. అలానే అందరమూ డబ్బులు పోగేసుకున్నాం. మేం ఎవరిపైనా ఆధారపడటం లేదు’’అని ఆయన చెప్పారు.
‘‘నాలుగైదు రోజుల్లో ఇంటికి వెళ్లిపోతానని అనుకున్నాను. కానీ పరిస్థితులు చూస్తుంటే మరికొన్ని రోజులు ఇక్కడే ఉండాల్సి వచ్చేలా అనిపిస్తోంది. నెలలు కూడా పట్టొచ్చేమో.. మాకు ఎలాంటి చింతా లేదు. ఎందుకంటే మాకు ఏం కావాలన్నా.. మా గ్రామస్థులు ఇస్తామని హామీ ఇచ్చారు’’అని మన్‌దీప్ వివరించారు.
‘‘నా పంట గురించి బాధ పడొద్దని మా గ్రామస్థులు చెప్పారు. ఒకవేళ నేను వెనక్కి వెళ్తే.. నా స్థానంలో మరో ఇద్దరు వస్తారు. ఎందుకంటే ఇది ఎంత పెద్ద సమస్యో వారు అర్థంచేసుకున్నారు. ఆ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే.. తరతరాలు కష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి వస్తుంది’’అని ఆయన చెప్పారు.
నాలుగు నెలల నుంచి ఏర్పాట్లు
ఈ ఉద్యమం కోసం నెలల నుంచి ఏర్పాట్లు చేసుకున్నట్లు రైతులు చెబుతున్నారు.
పంజాబ్‌కు చెందిన 30కిపైగా రైతు సంఘాలు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నాయి. నాలుగు నెలలుగా ఈ ఉద్యమం కోసం ప్రణాళికలు సిద్ధంచేశామని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు.
‘‘ఈ ఉద్యమం కోసం మా సంఘం 15 లక్షలు ఖర్చుపెట్టింది. మిగతా అన్ని సంఘాల డబ్బులను కలిపితే రూ.15 కోట్లకుపైనే ఉండొచ్చు’’అని కీర్తి కిసాన్ సంఘానికి చెందిన రైతు రాజీందన్ సింగ్ దీప్ సింగ్‌వాలా చెప్పారు.
కొందరు ఎన్‌ఆర్ఐలు కూడా తమ సంఘానికి పెద్దయెత్తున నిధులు సమకూరుస్తున్నారని రాజీందర్ వివరించారు.
‘‘నిధులు విషయానికి వస్తే.. పంజాబ్ రైతుల దగ్గర సరిపడా ఉన్నాయి. కేంద్రం తీసుకొచ్చిన ఆ చట్టాలు కేవలం రైతులకే కాదు.. కార్మికులు, వినియోగదారులు అందరిపైనా ప్రభావం చూపుతాయి. ఈ ఉద్యమం ముందుకు వెళ్లేకొద్దీ.. ఇతర వర్గాల వారూ చేరతారు’’అని ఆయన చెప్పారు.
‘‘మేం ఖర్చుపెట్టిన ప్రతి రూపాయికీ లెక్కలు రాస్తున్నాం. ఎందుకంటే అన్నింటికీ పక్కాగా లెక్కలు ఉండాలి కదా. కేవలం లెక్కలు మాత్రమే కాదు.. ఉద్యమానికి ఎవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? ఇలా అన్నింటినీ రైతు సంఘాలు నమోదు చేస్తున్నాయి’’అని రాజీందర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- చిదంబరం నటరాజ ఆలయం.. భూ అయస్కాంత క్షేత్రం నడిబొడ్డున ఉందా?
- జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు పెరిగాయా?
- తుపాన్లకు పేర్లను ఎవరు పెడతారు?
- ఎడారిలో అంతుచిక్కని లోహస్తంభం... అకస్మాత్తుగా ప్రత్యక్షం.. అదే తీరులో అదృశ్యం.. ఏలియన్స్ పనా?
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- కరోనావైరస్: కేరళలో దాచి పెట్టిన కోవిడ్ మరణాల గుట్టు రట్టు చేసిన వలంటీర్లు
- పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం
- టెడ్ గోయి: రెండు సార్లు... బికారి నుంచి బిలియనీర్‌గా ఎదిగిన డోనట్ కింగ్
- కన్యత్వాన్ని పునరుద్ధరిస్తామంటూ క్లినిక్‌ల అనైతిక వ్యాపారం
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- పంజాబ్ రైతుల మాదిరిగా.. వేరే రాష్ట్రాల రైతులు ఎందుకు ఆందోళనలు చెయ్యట్లేదు?
- OIC విదేశాంగ మంత్రుల సమావేశంలో కశ్మీర్ ప్రస్తావన పాకిస్తాన్ విజయమేనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)