You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చిదంబరం నటరాజ ఆలయం: తమిళనాడులోని ఈ గుడి భూ అయస్కాంత క్షేత్రం నాభిలో ఉందా?
- రచయిత, ఎ. విఘ్నేష్
- హోదా, బీబీసీ తమిళ్
దాదాపు అన్ని మతాల గ్రంథాలు, పురాణాల్లో సైన్స్‌తో విభేదించే చాలా సమాచారం ఉంటుంది. ఎందుకంటే వీటిలో చాలావరకు ఆధునిక సైన్స్ పుట్టకముందే రాసినవి. అయితే, శాస్త్రీయ పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి వస్తున్న నేటి రోజుల్లోనూ కొన్ని కథలు బలంగా ప్రజల్లో నాటుకుపోతున్నాయి. వీటిలో తమిళనాడులోని ప్రఖ్యాత చిదంబరం కథ కూడా ఒకటి.
భూమికి సరిగ్గా కేంద్రంలో ఈ దేవాలయం ఉందని కొందరు చెబుతున్నారు. భూ అయస్కాంత క్షేత్రం కేంద్రం మీద దీన్ని కట్టారని మరికొందరు అంటున్నారు.
సోషల్ మీడియాలో ఈ సమాచారం ఎప్పటికప్పుడే చక్కర్లు కొడుతూ ఉంటుంది. అంతేకాదు తమిళనాడు, శ్రీలంకల్లోని కొన్ని మీడియా సంస్థలు కూడా దీనిపై వార్తలు, కథనాలు ప్రచారం చేశాయి.
ఈ దేవాలయంపై శ్రీలంకలోని ఒక ప్రధాన వార్తా సంస్థ 2016లో ఒక కథనం ప్రచురించింది. కొన్ని కోట్ల డాలర్లు ఖర్చుపెట్టి, ఎనిమిదేళ్ల పాటు పరిశోధన చేపట్టిన అనంతరం.. చిదంబరం నటరాజ విగ్రహానికి బొటన వేలు కింద భూ అయస్కాంత క్షేత్ర నాభి ఉందని తేలినట్లు పేర్కొంది.
అయితే, ఈ పరిశోధన చేపట్టింది ఎవరు? దేని ఆధారంగా ఈ పరిశోధన సాగింది? లాంటి అంశాలను ఈ వార్తలో పేర్కొనలేదు.
ఈ వార్తలు ఎంత బలంగా వస్తున్నాయంటే, ఈ దేవాలయానికి నిలయమైన కడలూరు జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లోనూ వీటి ప్రస్తావన ఉంది. ప్రపంచ అయస్కాంత క్షేత్ర నాభిపై ఈ దేవాలయం ఉందని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
నిజమే భూ అయస్కాంత క్షేత్ర మధ్య రేఖ ఒక భారత నగరం గుండా వెళ్తుంది. అది ఏ నగరమో ఈ కథనం చివర్లో చూద్దాం.
భూ కేంద్రాన్ని పరిశీలిస్తే..
భూ కేంద్రం, భూ అయస్కాంత క్షేత్ర మధ్య రేఖ కేంద్రంపై ఈ దేవాలయం ఉందన్న వార్తలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సమాచారం ప్రకారం.. భూమి వ్యాసార్థం 6,378.137 కిలోమీటర్లు. ధ్రువాల వద్ద దీని వ్యాసార్థం 6,371 కిలోమీటర్లు.. ప్రపంచ వ్యాప్తంగా అందరూ అంగీకరించే కొలతలివి.
భూమి గోళాకృతి (స్పిరికల్)లో ఉంటే, భూమి ఉపరితలం నుంచి కేంద్రం మీదుగా ఏ గీత గీసినా ఒకే పరిమాణంలో ఉండాలి. కానీ అలా ఉండదు. ఎందుకో ఇప్పుడు చూద్దాం.
నాసాతో పాటు చాలా శాస్త్ర, సాంకేతిక సంస్థలు.. భూమి ధ్రువాల దగ్గర కాస్త సమతలంగా ఉంటుందని అంగీకరించాయి. దీన్నే అబ్లేట్ స్పెరాయిడ్ అంటారు.
అందుకే, ధ్రువాల నుంచి కేంద్రానికి మధ్య ఉండే దూరం.. భూమధ్య రేఖ నుంచి కేంద్రానికి ఉండే దూరం కంటే తక్కువగా ఉంటుంది. ఇంకోలా చేప్పాలంటే భూమధ్య రేఖ దగ్గర వ్యాసార్థంతో పోల్చినప్పుడు ధ్రువాల దగ్గర వ్యాసార్థం కొంచెం తక్కువగా ఉంటుంది.
భూమి పశ్చిమం వైపు నుంచి తూర్పు దిశగా తిరుగుతుంది. దీనివల్ల జనించే అపకేంద్ర బలం.. భూమధ్య రేఖ వద్ద వ్యాసం పెరగడానికి కారణం అవుతుంది. దీని వల్లే భూ మధ్య రేఖపై వ్యాసం ఎక్కువగా ఉంటుంది.
భూ మధ్య రేఖపై మీరు నిలబడి ఉంటే.. భూ కేంద్రం మీకు 6,378.137 కి.మీ.ల దూరంలో ఉంటుంది. అదే మీరు ఉత్తర, లేదా దక్షిణ ధ్రువాల పైన నిలబడితే.. భూ కేంద్రం మీకు 6,256.752 కి.మీ.ల దూరంలో ఉంటుంది.
మీరు వేరే ఇంకెక్కడైనా నిలబడితే భూ కేంద్రం మీకు దాదాపుగా 6,371 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ అంచనాలు చిదంబరం దేవాలయంతో పాటు భూమిపై ఉండే అన్ని ప్రాంతాలకూ వర్తిస్తాయి.
అయస్కాంత భూమధ్య రేఖ విషయంలో..
నటరాజ దేవాలయం అయస్కాంత భూ మధ్య రేఖకు మధ్యలో ఉందనే వాదన రెండోది.
భూమి కేంద్రంలో జనించే ''భూ అయస్కాంత క్షేత్రం'' అంతరిక్షంలో కొన్ని వేల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. భూ అయస్కాంత క్షేత్రానికి కేంద్రం కూడా భూ కేంద్రమే కాబట్టి.. అయస్కాంత క్షేత్రానికి మధ్యలో చిదంబరం దేవాలయం ఉందనేది కూడా తప్పుడు వార్తే.
మరయితే, భూ అయస్కాంత మధ్యరేఖకు కేంద్రంలో ఈ దేవాలయం ఉందా?
ఈ ప్రశ్నపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన విజ్ఞాన ప్రసార్ సభలో పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్. టి.వి.వెంకట్రామన్ మాట్లాడారు.
''భూ అయస్కాంత క్షేత్రం.. ఉత్తర అయస్కాంత క్షేత్రం, దక్షిణ అయస్కాంత క్షేత్రం అని రెండు భాగాలుగా ఉంటుంది. ఉత్తర ధ్రువం వల్ల దక్షిణ అయస్కాంత క్షేత్రం, దక్షిణ ధ్రువం వల్ల ఉత్తర అయస్కాంత క్షేత్రం ఏర్పడతాయి. ఉత్తర ధ్రువం లేదా దక్షిణ ధ్రువం నుంచి నడుచుకుంటూ వచ్చినప్పుడు ఒక దగ్గర రెండు క్షేత్రాల ప్రభావం సమానంగా ఉంటుంది. దీన్నే భూ అయస్కాంత మధ్య రేఖగా పిలుస్తారు'' అని ఆయన చెప్పారు.
''అయితే, ఇదేమీ భూ మధ్య రేఖలా సరళ రేఖలా ఉండదు. సూర్యుడి నుంచి జనించే ఆవేశపూరిత అణువులు ఈ రేఖను పది నుంచి 15 కి.మీ. మేర ప్రభావితం చేస్తుంటాయి. అంటే ఎప్పటికప్పుడు ఇది మారుతూ ఉంటుంది. సూర్యుడి నుంచి వెలువడే శక్తిపై ఇది ఆధారపడి ఉంటుంది'' అని ఆయన వివరించారు.
''ఈ అయస్కాంత మధ్య రేఖ తమిళనాడులోని తిరునెల్వేలి నగరం నుంచి వెళ్తుంది. ముంబయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోమేగ్నిటిజమ్ ఇక్కడ ఒక అయస్కాంత అబ్జర్వేటరీని కూడా ఏర్పాటుచేసింది'' అని వెంకటేశ్వరన్ తెలిపారు.
అయస్కాంత మధ్యరేఖ అనేది ఒక ఊహాజనిత రేఖ కాబట్టి, పైగా భూమి గోళాకృతిలో ఉంది కాబట్టి.. దీనికంటూ ఒక కేంద్ర బిందువు ఉండదు. చిదంబరం దేవాలయం విషయంలో ఒకవేళ భూ అయస్కాంత మధ్యరేఖనే.. భూ అయస్కాంత మధ్య రేఖ నాభిగా చెప్పారని అనుకున్నా.. ఇది చిదంబరానికి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)