You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు పెరిగాయా?
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సాధారణంగా ఎక్కడైనా ఎన్నికలు జరిగితే ముందు గుర్తొచ్చేది మందే.. ఎన్నికల్లో మందు ఏరులై పారుతుందన్న విషయం తెలిసిందే. ఈసారి హైదరాబాద్ ఎన్నికల్లో కూడా మద్యం ప్రభావం ఉందనీ, నగరంలో మద్యం అమ్మకాలు పెరిగాయనీ వార్తలు వస్తున్నాయి. నిజంగా హైదరాబాద్లో మద్యం పారుతోందా?
తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ నెలలో ఇప్పటి వరకూ 1,685 కోట్ల రూపాయల మద్యం అమ్ముడయింది. అదే గతేడాది నవంబరు నెల మొత్తం తెలంగాణలో 2,007 కోట్ల రూపాయల మద్యం అమ్ముడయింది. అప్పటికీ ఇప్పటికీ ధరల్లో తేడాలు వచ్చాయి. కాబట్టి ఇది సరైన పోలిక కాదు. వాస్తవ అమ్మకాలు చూద్దాం.
ఈ ఏడాది ఇప్పటి వరకూ లిక్కర్ 25.12 లక్షల కేసులు అమ్ముడుకాగా, బీర్లు 20.39 లక్షల కేసులు అమ్ముడయ్యాయి కేస్ అంటే 12 సీసాలు. కానీ, గత ఏడాది 32.66 లక్షల కేసుల మద్యం, 38.36 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఈ లెక్క చూస్తే వాస్తవంగా ఈ నెల అమ్మకాలు పెరగలేదు. అయితే, ధరల తేడా వల్ల ఆదాయంలో 16 శాతం పెరుగుదల ఉంది.
గత మూడేళ్లలో హైదరాబాద్ నగర పరిధిలో నవంబర్ 1 నుంచి 25 వరకూ అమ్ముడైన మద్యం, బీర్లు విలువ రూ. కోట్లలో:
గత మూడేళ్లలో హైదరాబాద్ నగర పరిధిలో నవంబర్ 1 నుంచి 25 వరకూ అమ్ముడైన మద్యం, బీర్లు లెక్క - లక్షల కేసుల్లో
(ఈటేబుళ్లలో సంగారెడ్డి జిల్లా పరిధిలోని రామచంద్రాపురం, పఠాన్ చెఱువు డాటా లేదు. అలాగే రంగారెడ్డి పరిధిలోని కొన్ని గ్రామాల డాటా అదనం.)
ఈ టేబుల్ ప్రకారం చూసినా, ఈ ఏడాది, అమ్మకాలు గత ఏడాది కంటే గొప్పగా లేవు. అంతేకాదు, గ్రేటర్ నోటిఫికేషన్ తరువాత కూడా అమ్మకాల్లో అకస్మాత్తు పెరుగుదల కనిపించలేదు సరికదా, అమ్మకాలు తగ్గాయి.
డబ్బు రూపంలో చూసినప్పుడు ఆదాయం సమానంగా కనిపించినా, అమ్ముడైన మద్యం సీసాల సంఖ్యలో చూస్తే, గతేడాది కంటే ఈసారి అమ్మకాలు పడిపోయాయి. ముఖ్యంగా బీరు అమ్మకాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఆ రకంగా చూస్తే, ఎన్నికల ప్రభావం మద్యంపై పడలేదు.
అక్టోబర్ రికార్డు:
ఎన్నికలు వచ్చినా పెరగని మద్యం అమ్మకాలు, గత అక్టోబరులో మాత్రం అకస్మాత్తుగా పెరిగాయి. ఆ విషయంలో రికార్డు సృష్టించాయి. అక్టోబరులో తెలంగాణలో ఏకంగా 2,152 కోట్ల రూపాయల మద్యం అమ్ముడయింది. ఇందులో లిక్కర్ 31.31 లక్షల కేసులు ఉండగా, బీర్లు 26.83 లక్షల కేసులు ఉన్నాయి.
2019 అక్టోబరులో 1,662 కోట్ల రూపాయల మద్యం అమ్ముడయింది. అప్పుడు 26.69 లక్షల కేసుల మద్యం, 38.57 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. అంటే 2019 అక్టోబరు కంటే 2020 అక్టోబరులో అమ్మకాలు 29.44 శాతం పెరిగాయి.
ఈ ఏడాది అక్టోబరులో రాజధాని జిల్లాల్లో అమ్ముడైన మద్యం విలువ రూ. కోట్లలో:
ఎన్నికల ఎఫెక్టు లేదంటున్న షాపు యజమానులు:
''ఈసారి ఎన్నికల అమ్మకాలు ఏమీ లేవు అనే చెప్పాలి. గతంతో పోలిస్తే అమ్మకాల్లో పెద్ద మార్పు రాలేదు'' అని బీబీసీతో చెప్పారు హైదరాబాద్లో ఒక వైన్ షాపు యజమాని వేంకటేశ్వర రావు. సాధారణంగా ఎన్నికల వేళ మద్యం అమ్మకాలు పెరుగుతుంటాయనీ, కానీ ఈసారి పెరగలేదని ఆయన అన్నారు.
అయితే ఎన్నికలకు ఇంకా వారం ఉన్నందున అప్పుడు ఏమైనా పెరగొచ్చేమోనని అభిప్రాయం వ్యక్తం చేశారు మరో షాపు యజమాని.
అమ్మకాల హెచ్చు తగ్గులపై తెలంగాణ ఎక్సైజ్ అధికారులు అధికారికంగా స్పందించలేదు. అయితే, ''ఎన్నికల్లో మద్యం ప్రభావం విషయంలో గ్రామాలకూ, సిటీకీ తేడా ఉంటుంది. ఎన్నికల సమయంలో పల్లెలో పంచేంత మందు ఇక్కడ పంచరు'' అని వ్యాఖ్యానించారు ఎక్సైజ్ శాఖలో సూపరింటెండ్ గా పనిచేస్తోన్న ఒక అధికారి.
అక్రమ మద్యం కేసులూ తక్కువే:
ఎన్నికల సమయంలో వేలాది బాటిళ్లు, లక్షలాది రూపాయల విలువైన మద్యం పట్టుకుంటారు.
కానీ గ్రేటర్ ఎన్నికల్లో ఆ హడావిడి కూడా లేదు. 18వ తేదీ నుంచి ఇప్పటి వరకూ జీహెచ్ఎంసీ పరిధిలో పోలీసులు పట్టుకున్న మొత్తం మద్యం బాటిళ్లు వెయ్యి కూడా లేవు. వాటి విలువ కూడా నామమాత్రమే.
ఇవి కూడా చదవండి:
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. ఒళ్లు గగుర్పొడిచే యుద్ధాలలో ఏం జరిగింది
- దీపావళి ప్రత్యేకం: లక్ష్మీదేవి బొమ్మలో ముఖం ఎవరిది?
- కోర్టు ధిక్కరణ అంటే ఏమిటి.. ఈ నేరానికి ఏ శిక్షలు విధిస్తారు?
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)