You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వై.ఎస్.జగన్‌కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. బెంగాల్‌లో మమతను గట్టెక్కించగలరా?
- రచయిత, ప్రభాకర్ మణి తివారీ
- హోదా, బీబీసీ కోసం
వచ్చే ఏడాది జరగబోతున్న కీలకమైన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ చేతిలో నుంచి అధికారం చేజారకుండా ఎన్నకల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) అడ్డుకోగలరా?
ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్‌తోపాటు రాజకీయ వర్గాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది.
బిహార్ ఎన్నికల సమయంలో విరామం తీసుకున్న పీకే అందరనీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ తృణమూల్ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను తలకెత్తుకున్నారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బీజేపీకి వ్యతిరేకంగా వేసిన వ్యూహాలు ఫలించలేదు.
వరసగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమవైపు తీసుకొచ్చే బాధ్యతలను పీకేపైనే తృణమూల్ కాంగ్రెస్ పెట్టింది. అయితే ఇదే పార్టీలో అంతృప్తికీ కారణమవుతోంది. చాలా మంది పార్టీ నాయకులు బహిరంగంగానే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సుభేందు అధికారి అయితే, పీకేపై నేరుగా విమర్శలు చేస్తున్నారు. ఆయన్ను శాంతింప జేయడంలో పీకే విఫలమయ్యారనే చెప్పాలి.
2014 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలను తీర్చిదిద్దడంలో పీకే కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాతి ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన కీలకంగా మారారు.
వరుస విజయాల తర్వాత రాజకీయ పార్టీల్లో ఆయనకు డిమాండ్ పెరిగింది. పీకే తమ వైపు ఉంటే కచ్చితంగా గెలుస్తామనే ధీమా రాజకీయ వర్గాల్లో ఉండేది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో(2019) వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ గెలిచేలా పీకే వ్యూహాలను రచించారు.
అయితే, పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలపై బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌తో పీకేకు విభేదాలు వచ్చాయి. దీంతో పీకేను జేడీయూ గత జనవరిలో బహిష్కరించింది.
2015లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పీకే పేరు బాగా వినిపించింది. అయితే, ఈ సారి మాత్రం ఆయన ఎక్కడా కనిపించలేదు.
నీతీశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత పీకే ట్వీట్ చేశారు. ‘‘బీజేపీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న నీతీశ్ కుమార్‌కు ధన్యవాదాలు. అలసిపోయిన, రాజకీయంగా ప్రాముఖ్యంలేని ముఖ్యమంత్రితో బిహార్ మరికొన్నేళ్లు నెట్టుకురావాలి’’అని ఆయన ట్వీట్ చేశారు.
గత నాలుగు నెలల్లో ఇదే ఆయన తొలి ట్వీట్.
మమత మేనల్లుడు తీసుకొచ్చారు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ.. పీకేను తమ శిబిరంలోకి తీసుకొచ్చారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై ఆయన వ్యూహాలు ఫలించని సంగతి తెలిసిందే.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించేలా ప్రశాంత్ కిశోర్‌కు చెందిన వేల మంది ఐప్యాక్ సంస్థ సిబ్బంది పనిచేస్తున్నారు.
పీకే సూచనలపై మమత తీసుకున్న నిర్ణయాలతో పార్టీ నేతల్లో ఆగ్రహం పెరుగుతోంది. ముఖ్యంగా సంస్థాగతంగా మార్పులు చేయడంతో సీనియర్ నాయకుల్లో అసంతృప్తి పెరుగుతోంది.
రవాణా మంత్రి సుభేందు అధికారిలో అసంతృప్తి పెరగడానికి పీకేనే ప్రధాన కారణం. ఆయన్ను ఆఫీసుతోపాటు ఇంటిలో కూడా పీకే కలిశారు. కానీ ఆయనను శాంతింప జేయడంలో పీకే విఫలమయ్యారు.
మరోవైపు సుభేందు బీజేపీలో చేరబోతున్నారని, మరోవైపు కొత్త పార్టీ పెట్టబోతున్నారని ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేదు.
మమతా అధికారంలోకి రావడానికి కారణమైన భూసేకరణ వ్యతిరేక ఉద్యమం నందిగ్రామ్‌లోనే మొదలైంది. ఇక్కడ సుభేందుతోపాటు తృణమూల్ కాంగ్రెస్ నాయకులూ తరచూ ర్యాలీలు, సమావేశాలు జరుపుతుంటారు.
ఆయనే కారణమా?
ఇటీవల ఇక్కడే పీకేకు వ్యతిరేకంగా చాలా మంది ఎమ్మెల్యేలు, తృణమూల్ కాంగ్రెస్ నేతలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తంచేశారు. ముఖ్యంగా సీనియర్ నాయకుల్ని పార్టీ పక్కన పెడుతోందని, గత ఎన్నికల్లో బీజేపీకి సాయం చేసిన వారిని ఇప్పుడు చేరదీస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
గత ఆదివారం ముర్షీదాబాద్‌లో జరిగిన ర్యాలీలో హరిహర్‌పారాకు చెందిన ఎమ్మెల్యే నియామత్ షేక్ నేరుగా పీకేపై వ్యాఖ్యలు చేశారు.
‘‘పార్టీలో వస్తున్న అన్ని సమస్యలకూ ప్రశాంత్ కిశోరే కారణం. ముర్షీదాబాద్‌లో పార్టీ పటిష్ఠం అయ్యేందుకు సుభేందు కృషిచేశారు. కానీ ఇప్పుడు ఆయనతో మాట్లాడే నాయకుల్ని వేధిస్తున్నారు’’అని నియామత్ అన్నారు.
‘‘మేం ప్రశాంత్ కిశోర్ నుంచి రాజకీయాలు నేర్చుకోవాలా? ఒకవేళ జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు షాక్ ఎదురైతే, అది ఆయన వల్లే అవుతుంది’’అని ఆయన అన్నారు.
ముర్షీదాబాద్ జిల్లా కేంద్రం బ్రహ్మపుర్‌లో గత నెలలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అతికించిన ఒక పోస్టర్‌లో అయితే పీకేను బందిపోటుగా పేర్కొన్నారు.
అయితే, పీకేపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమైనవని ముర్షీదాబాద్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అబూ తాహిర్ ఖాన్ వివరించారు. ఆ పోస్టర్లను విపక్ష నాయకులే అతికించారని ఆయన చెప్పారు.
మరోవైపు కూచ్‌బెహార్ ఎమ్మెల్యే మిహిర్ గోస్వామి కూడా బహిరంగంగానే పీకేపై విమర్శలు చేస్తున్నారు.
‘‘తృణమూల్ కాంగ్రెస్ అసలు మమతా బెనర్జీ పార్టీనేనా? లేకపోతే పార్టీని ఎవరికైనా మమత కాంట్రాక్టుకు ఇచ్చారా?’’అని సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్టు పెట్టారు.
‘‘మమతకు పార్టీపై నియంత్రణ లేదు. తృణమూల్ కాంగ్రెస్ బాగా మారిపోయింది. మీరు కావాలంటే ఉండొచ్చు. లేకపోతే హాయిగా బయటకు వెళ్లిపోవచ్చు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
కొంతకాలం వరకు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని తను నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.
‘‘తృణమూల్ కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలవాలని అనుకుంటే.. అందరూ తమ భేషజాలను పక్కనపెట్టి పనిచేయాలి. పార్టీలోని సీనియర్ నాయకుల్ని పక్కన పెట్టేయాలనే కుట్ర జరుగుతోంది’’అని అదే జిల్లాకు చెందిన సీతాయ్ ఎమ్మెల్యే జగదీశ్ వర్మ బసునియా వ్యాఖ్యానించారు.
ఎందుకు ఇలా?
తృణమూల్ ఒక్కసారిగా పీకేపై అంతృప్తి పెరగడానికి గల కారణాలు ఏమిటి?
జులై పీకే సూచనలపై మమతా బెనర్జీ పార్టీలో చాలా మార్పులు చేశారు. బ్లాకు, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల్లోనూ మార్పులు చేశారు. ఈ మార్పులే పార్టీలో అసంతృప్తికి కారణమని వార్తలు వస్తున్నాయి.
‘‘పీకే బృందం సమర్పించిన ఒక నివేదిక ఆధారంగా పార్టీలో చాలా మార్పులు చేశారు. ప్రతి జిల్లానూ సందర్శించిన తర్వాత పీకే బృందం ఈ మార్పులు సూచించింది. మరోవైపు అసంతృప్త నాయకులపైనా పీకే టీమ్ ఒక నివేదిక సమర్పించింది. మంచి ప్రజాదరణ కలిగిన నాయకుల్ని ముందుకు తీసుకురావడమే ఈ మార్పుల లక్ష్యం’’అని సీనియర్ తృణమూల్ నాయకుడు ఒకరు తెలిపారు.
ఈ విషయంపై ప్రశాంత్ కిశోర్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. అయితే పీకే సంస్థకు చెందిన ఓ అధికారి మాట్లాడారు. ‘‘మమతా బెనర్జీ, పార్టీలోని సీనియర్ నాయకుల సూచనలపై మేం పనిచేస్తున్నాం. మా పని సూచనలు ఇవ్వడం మాత్రమే. వాటిని అమలు చేయాలా? వద్దా అనేది పార్టీ ఇష్టమే. కాబట్టి పార్టీలోని అసంతృప్తులపై మేం మాట్లాడటం సరికాదు’’అని ఆయన చెప్పారు.
క్రమశిక్షణ కోసమేనా?
మరోవైపు తృణమూల్ కాంగ్రెస్‌లో పీకే జోక్యం పెరగడంతో చాలా మంది నాయకులు తమను పక్కన పెట్టేసినట్లు భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
పార్టీ అంతర్గత వ్యవహారాల్లో పీకే టీమ్ జోక్యం చేసుకుంటోందని తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్న సుభేందు అధికారి వివరించారు.
సుభేందు అధికారి సొంత జిల్లా తూర్పు మేదినీపుర్‌లో పీకే బృందం నిర్వహించే చాలా కార్యక్రమాలకు సుభేందు హాజరుకాకపోవడమూ పార్టీలో అసంతృప్తి పెరుగుతోందనే వాదనను మరింత బలపరుస్తోంది.
‘‘తృణమూల్ కాంగ్రెస్ అనేది సీపీఎం లాంటి క్యాడర్ ఆధారిత పార్టీ కాదు. ప్రస్తుతం బ్లాక్‌తో మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో క్రమశిక్షణ పెంచేందుకు పీకే బృందం ప్రయత్నిస్తోంది. ఇలాంటి చర్యలతో కొంత అసంతృప్తి ఉండే మాట వాస్తవమే. అయితే, పార్టీ అధినాయకత్వం పీకే బృందానికి గట్టి మద్దతు ఇస్తుండటంతో అసంతృప్తి పెద్దగా ఫలితం చూపిస్తుందని అనుకోవడం సరికాదు’’అని రాజకీయ విశ్లేషకుడు విశ్వనాథ్ చక్రబర్తి వివరించారు.
అయితే, ఏళ్ల నుంచి బెంగాల్ రాజకీయాలను దగ్గర నుంచి పరిశీలిస్తున్న సీనియర్ జర్నలిస్టు శ్యామలేందు మిత్ర భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
‘‘పీకే బృందం ముందుకు వెళ్లడం చాలా కష్టంగా మారుతోంది. తృణమూల్ నాయకులు, ఎమ్మెల్యేలు మమతను మాత్రమే తమ నాయకురాలిగా చూస్తారు. పీకే పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతో అసంతృప్తి బాగా పెరుగుతోంది. ఫలితంగా పీకే ఊహించిన స్థాయిలో ఇక్కడ సఫలం కాకపోవచ్చు’’అని ఆయన అన్నారు.
ఇవి కూడాచదవండి:
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- యూరినరీ ఇన్‌కాంటినెన్స్: మహిళల్లో మూత్రం లీకయ్యే సమస్యకు కారణాలేంటి...
- కరోనావైరస్ నుంచి 90 శాతం రక్షణ కల్పించే తొలి వ్యాక్సీన్ ఇదే
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- ఆకాశంలోని విమానాలను నేలకు దించిన మనిషి.. కెప్టెన్ జీఆర్ గోపీనాథ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)