You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రైతుల నిరసనలు: మోదీ మంచి వక్త... కానీ, రైతులతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?
- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావాలని పిలుపునిచ్చే ఆర్థికవేత్తల్లో గురుచరణ్ దాస్ ఒకరు. మోదీ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు సరైనవేనని ఆయన భావిస్తున్నారు.
అయితే, ఈ చట్టాల గురించి రైతులకు అర్థమయ్యేలా చెప్పడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విఫలమయ్యారని గురుచరణ్ దాస్ చెప్పారు. ''ప్రపంచంలో అత్యుత్తమ వక్తల్లో ఒకరైన మోదీ.. రైతులకు తన సందేశాన్ని స్పష్టంగా చెప్పడంలో విఫలమయ్యారు'' అని ఇండియా అన్‌బౌండ్ పుస్తక రచయిత అయిన గురుచరణ్ దాస్ వ్యాఖ్యానించారు.
''సంస్కరణలపై సందేశాన్ని విస్పష్టంగా చెప్పడంలో మోదీ విఫలమయ్యారు. దాని పర్యవసానాలు ఇప్పుడు చూస్తున్నాం. ప్రజల్లో ఆ చట్టాలపై నేడు ఒక అభిప్రాయం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వాటి గురించి వివరించి చెప్పడం ఇంకా కష్టం'' అని ఆయన వివరించారు.
ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో పబ్లిసిటీ పాత్ర చాలా ముఖ్యమని గురుచరణ్ అన్నారు. ఈ సందర్భంగా బ్రిటిష్ ప్రధానమంత్రి మార్గరెట్ థాచర్, చైనా ఆర్థిక సంస్కర్త డెంగ్ జియావోపింగ్‌లను ఆయన ఉదహరించారు.
''డెంగ్ జియావో పింగ్, మార్గరెట్ థాచర్ లాంటి ప్రపంచ ప్రముఖ సంస్కర్తలను చూస్తే ఒక విషయం స్పష్టం అవుతుంది. వారు 20 శాతం సమయాన్ని సంస్కరణల అమలుపై పెడితే.. మిగతా 80 శాతం సమయాన్ని వాటిని ప్రమోట్ చేసుకోవడంపై వెచ్చించారు''అని ఆయన చెప్పారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులను పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన రైతులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. కొన్ని రోజులుగా లక్షల సంఖ్యలో రైతులు దిల్లీ శివార్లలో నిరసన చేపడుతున్నారు. వీరితో ఇప్పటికే ప్రభుత్వం రెండుసార్లు చర్చలు జరిపింది. అయితే, ఇవి విఫలం అయ్యాయి. మరోవైపు మూడో దఫా చర్చలు శనివారం జరగబోతున్నాయి.
వ్యవసాయానికి సంబంధించిన చట్టాల్లో మార్పులు చేసి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని చేర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయ రంగంలో ప్రైవేటు సంస్థల నియంత్రణకు నిబంధనలు తీసుకురావాలని అంటున్నారు. మండీల వ్యవస్థను రద్దు చేయకూడదని కోరుతున్నారు.
నగదు బదిలీ అయితే...
రైతుల నిరసనతో ప్రభుత్వంపై కచ్చితంగా ఒత్తిడి పెరుగుతోంది. అయితే, రైతుల డిమాండ్లపై గురుచరణ్ దాస్ ఏమంటున్నారు?
''నిజమే, వారి డిమాండ్లు కొంతవరకు సరైనవే. అయితే, ఎంఎస్‌పీ వ్యవస్థేమీ అత్యుత్తమమైనది కాదు. ఓ ఆర్థిక నిపుణుడిగా దీన్ని చౌకబారు వ్యవస్థగా చెబుతాను. ఎందుకంటే దీనిలో చాలా లోపాలున్నాయి. నన్ను అడిగితే.. ఎలాంటి రాయితీలు, సబ్సిడీలు ఇవ్వద్దని అంటాను. ఎరువులు, విద్యుత్, నీరు, ధర... ఇలా దేని మీదా సబ్సిడీలు ఇవ్వొద్దు. నేరుగా నగదును పేద రైతులకు బదిలీ చేయండి. దీన్ని రైతులకు నగదు బదిలీ కింద చెప్పుకోవచ్చు'' అని ఆయన వివరించారు.
''ఇప్పుడు ఇస్తున్న చాలా రాయితీల కంటే రైతుల సామాజిక భద్రతే లక్ష్యంగా నగదు బదిలీ చేయడం మేలు'' అని ఆయన చెప్పారు.
''మన దేశంలో ఆహార భద్రత అనేది తప్పనిసరి. ఎంఎస్‌పీ లాంటి వ్యవస్థలు అందుబాటులో ఉన్నప్పటికీ, పేదలకు కచ్చితంగా ప్రభుత్వం ఆహార ధాన్యాలు సరఫరా చేయాలి. ఎంఎస్‌పీలు, మండీలతో వచ్చే సమస్యలను వివరంగా ప్రజలకు ప్రభుత్వం వివరించగలిగితే... పరిస్థితులు వేరేగా ఉండేవి''అని ఆయన వివరించారు.
ప్రభుత్వం తప్పేనా?
మొదట్లోనే రైతులతో కేంద్రం చర్చలు జరిపి ఉండాల్సిందని గురుచరణ్ దాస్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు రైతులకు అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టమని ఆయన అన్నారు.
ప్రస్తుతం అమలులోనున్న విధానాలను ఏ ప్రభుత్వమూ పూర్తిగా ఎత్తివేయలేదని ఆయన చెప్పారు.
''ఎంఎస్‌పీ వ్యవస్థ కొనసాగుతుంది. అదే సమయంలో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)లు కూడా కొనసాగుతాయి. ఎందుకంటే కోట్ల మందికి ప్రతి నెల ప్రభుత్వం ఆహార ధాన్యాలు సరఫరా చేయాలి. ఇది జరగాలంటే ముందు ఆహార ధాన్యాలను కేంద్రం కొనుగోలు చేయాలి. అందుకే ఈ వ్యవస్థ కొనసాగుతుంది'' అని ఆయన వివరించారు.
ప్రైవేటు కంపెనీల ఆధిపత్యం వ్యవసాయ రంగంలో పెరుగుతుందనే రైతుల భయాలపైనా గురుచరణ్ మాట్లాడారు. ''రైతుల ఆందోళనను మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు బడా కార్పొరేట్లు.. మరోవైపు చిన్న రైతులు ఉన్నారు. వీరి మధ్య సమానత్వమే లేదు. అయితే, రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుండా చూసుకుంటామని హామీ ఇస్తూ ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలి''అని ఆయన అన్నారు.
ఈ విషయంలో రైతులకు చాలా ప్రత్యామ్నాయాలు కూడా ఉంటాయని గురుచరణ్ అన్నారు.
''నేను చెప్పేది ఏమిటంటే, రైతులకు చాయిస్ ఉంటుంది. మీతో కలిసి పనిచేయం అని ప్రైవేటు సంస్థలకు స్వేచ్ఛగా చెప్పే హక్కు రైతులకు ఎప్పుడూ ఉంటుంది''అని ఆయన వివరించారు.
''ఈ రంగాన్ని సంస్కరించాలి''
''వ్యవసాయ రంగాల్లో మార్పులు తీసుకురావాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఈ రంగంలో చాలా మార్పులు వస్తున్నాయి''అని గురుచరణ్ చెప్పారు.
1991లో మొదలైన ఆర్థిక సంస్కరణలకు గురుచరణ్ గట్టి మద్దతుదారు. ఆనాటి సంస్కరణలను చాలా కార్మిక సంఘాలు, వాణిజ్య సంఘాలు వ్యతిరేకించాయని ఆయన గుర్తుచేశారు.
''అయితే, ఆర్థిక సంస్కరణలకు కొంత సమయం ఇవ్వాలి. అదే విధంగా ప్రస్తుతం వ్యవసాయ రంగంలోనూ మనం సంస్కరణలు తీసుకురావాలి. ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి ఇది అలానే ఉండిపోయింది''అని ఆయన అన్నారు.
''ఇవి 25ఏళ్లకు ముందే తీసుకురావాల్సిన చట్టాలు. వామపక్షాలు అడ్డుపడకపోతే.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే ఈ చట్టాలను తీసుకువచ్చేది''అని ఆయన పేర్కొన్నారు.
''1980ల్లో భారత్‌లో మధ్య తరగతి జనాభా కేవలం 8 శాతమే ఉండేది. ఇప్పుడు అది 35 శాతానికి పెరిగింది. నేడు ప్రజల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. మనం ఇప్పుడు వ్యవసాయ రంగంలో గోధుమ, వరిపై ఎక్కువ దృష్టి పెడుతున్నాం. కానీ ప్రజలు చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం మొదలుపెట్టారు. ప్రోటీన్లు, పాలు కూడా ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారు. పాల ఉత్పత్తిలో భారత్‌దే మొదటిస్థాయనం. ఇప్పుడు అదే కోణంలో విధాన నిర్ణయాలు తీసుకొనేవారూ ఆలోచించాలి. కానీ చాలా మంది ఇంకా భారత్ పేద దేశమనే భావిస్తున్నారు''అని ఆయన చెప్పారు.
''భారతీయుల ఆహారపు అలవాట్లు వ్యవసాయ ఉత్పత్తులపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. భారత్‌లో కాఫీ ఉత్పత్తి చాలా పెరిగింది. ఆరోగ్యానికి సంబంధించిన చాలా ఉత్పత్తులకు మార్కెట్ పెరిగింది. వస్తున్న మార్పులకు అనుగుణంగా విధానాలూ మారాలి''అని ఆయన అన్నారు.
రైతుల కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించవచ్చని అభిప్రాయపడిన గురుచరణ్ దాస్, చట్టాలను వెనక్కి తీసుకోవడం చాలా ప్రమాదకరమైన చర్యఅని, మనం 30ఏళ్లు వెనక్కి వెళ్లిపోవాల్సి ఉంటుందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వ్యవసాయానికి సాయం చేస్తున్న మొదటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వమేనా?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు? చరిత్ర ఏం చెబుతోంది?
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు"
- జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- రైతన్న రిటైర్మెంట్: వ్యవసాయ విరమణ సన్మానం చేసిన కుమారులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)