You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: ఊపిరితిత్తులపై మూడు నెలల తర్వాత కూడా ప్రభావం.. కొత్త రకం స్కానింగ్‌లో బయటపడ్డ నిజాలు
- రచయిత, పల్లబ్ ఘోష్
- హోదా, బీబీసీ సైన్స్ కరస్పాండెంట్
కోవిడ్ వైరస్ సోకి మూడు నెలలయ్యాక కూడా దాని ప్రభావం ఊపిరితిత్తులపై కనిపిస్తోందని నిపుణుల తాజా పరిశీలనలతో తేలింది.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో 10 మంది కోవిడ్ వ్యాధిగ్రస్తులపై జరిపిన పరిశీలనలతో ఊపిరితిత్తులకు జరిపే పరీక్షలలో వాడే స్కానింగ్ యంత్రాలకు దొరకని అనేక విషయాలు బయటపడ్డాయి.
తాజా పరిశీలన కోసం ఊపిరితిత్తులకు ఎంఆర్ఐ స్కానింగ్ చేసే సమయంలో జెనాన్ అనే గ్యాస్‌ను ఉపయోగించారు. ఈ స్కానింగ్‌లో కోవిడ్ పేషెంట్ల ఊపిరితిత్తులలో దీర్ఘకాలం కొనసాగడానికి అవకాశం ఉన్న సమస్యలు కనిపించాయని నిపుణులు వెల్లడించారు.
19 నుంచి 69 సంవత్సరాల మధ్య వయస్కులైన 10 మంది కోవిడ్ పేషెంట్లపై ప్రొఫెసర్ ఫెర్గస్ గ్లీసన్ నేతృత్వంలోని బృందం పరిశోధన జరిపింది. ఈ పది మందిలో ఎనిమిది మంది దాదాపు మూడు నెలల పాటు శ్వాస సంబంధమైన సమస్యలు, అలసట లాంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు గుర్తించారు.
అంతకు ముందు వీరిలో ఎవరికీ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం గానీ, వెంటిలేషన్ మీద ఉండాల్సిన పరిస్థితి గానీ రాలేదు. వీరికి నిర్వహించిన సాధారణ స్కాన్‌లో ఏ సమస్యా లేదని తేలింది.
ఈ ఎనిమిది మందికి నిర్వహించిన స్కానింగ్‌లో ఆక్సిజన్ సరైన పరిమాణంలో రక్తంలో కలవడం లేదని గుర్తించడంతో పాటు వీరు కొన్నాళ్లు శ్వాస సంబంధమైన సమస్యను ఎదుర్కొన్నారని తేలింది.
ఈ ఫలితాలను గమనించాక, ఇలాంటి కేసుల తీరు తెన్నులను పరిశీలించేందుకు మరో 100 మందిపై ప్రయోగాలు చేయాలని ప్రొఫెసర్ గ్లీసన్ నిర్ణయించారు.
విధానాలు మార్చుకోవాలి
ప్రొఫెసర్ గ్లీసన్ పరిశోధన అసలు లక్ష్యం కోవిడ్ పేషెంట్లలో ఊపిరితిత్తులు చెడిపోవడం అనే సమస్య ఏ స్థాయిలో ఉంటుందన్నది తేల్చడమే. "మేం ఊపిరితిత్తులకు సంబంధించి ఓ సమస్యను గుర్తించాం. కానీ దాని తీవ్రత ఎంతో తెలుసుకోవాల్సి ఉంది’’ అన్నారు ప్రొఫెసర్ గ్లీసమ్.
కోవిడ్ కారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో మరణాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే చేయబోయే పరిశోధనలు ఈ సమస్య ఇంకా విస్తృత స్థాయిలో ఉందని తేల్చితే, ముఖ్యంగా ఆసుపత్రిదాకా వెళ్లని పేషెంట్లలో కూడా ఈ సమస్య ఉందని వెల్లడైతే.. వైరస్‌కు సంబంధించి ఇప్పటి వరకు అనుసరిస్తున్న చాలా పద్ధతులను మార్చుకోవాల్సి ఉంటుందని ప్రొఫెసర్ గ్లీసన్ చెప్పారు.
వైరస్ బారిన పడిన వాళ్లు ఎక్కువకాలం కోలుకోలేక పోవడానికి కారణం తాజా పరిశీలనలో వెల్లడైన ఊపిరితిత్తుల సమస్యే కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
కోవిడ్ తీవ్రతను, అనంతరం ఏర్పడే సమస్యలను అంచనా వేయడానికి ఈ కొత్త తరహా పరీక్ష మిగిలిన టెస్టులకు భిన్నమైనదని జెనాన్ గ్యాస్ టెస్టింగ్ విధానాన్ని కనుగొన్న యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్‌లో ప్రొఫెసర్ జేమ్స్‌వైల్డ్ అన్నారు.
కోవిడ్ బారినపడ్డ వారిలో దాదాపు పది శాతం మందిలో ఊపిరితిత్తుల సమస్యలు కనిపించాయని ఆక్స్‌ఫర్డ్ ప్రాంతానికి చెందిన డాక్టర్ షెల్లీ హేల్స్ అన్నారు.
దీర్ఘకాలిక సమస్య అవుతుందా?
ఇదే ప్రాంతానికి చెందిన టిమ్ క్లాడియెన్ తన 60వ పుట్టిన రోజును జాన్ రాడ్‌క్లిఫ్ ఆసుపత్రిలో జరపుకున్నారు. తాను బతుకుతానని అనుకోలేదని ఆయన చెప్పారు.
అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడినా ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడలేదు. తాను ఈ సమస్య నుంచి ఎందుకు బయటపడలేకపోతున్నారో ఆయనకు అర్ధం కాలేదు.
ప్రొఫెసర్ గ్లీసన్ పరిశోధన తర్వాత అసలు విషయం తనకు అర్ధమైందని టిమ్ అన్నారు. సమస్య మూలం తెలుసుకోవడానికి ఈ టెస్టు బాగా ఉపయోగపడింది. అయితే ఇది శాశ్వతమా, తాత్కాలికమా అన్నది మాత్రం ఇంకా తెలియలేదన్నారు టిమ్.
“ఈ పరిశోధన చాలా కీలకమైంది. దీని ద్వారా కోవిడ్ తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. వ్యాధిగ్రస్తుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది’’ అని ఆస్తమా యూకే అండ్ ది బ్రిటీష్ లంగ్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ సమంతా వాకర్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు పెరిగాయా?
- తుపాన్లకు పేర్లను ఎవరు పెడతారు?
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
- GDP: ఆర్థిక సంక్షోభంలో భారతదేశం... 7.5 శాతం పడిపోయిన జీడీపీ
- GDP Meaning: జీడీపీ అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు? ఈ గణాంకాలు ఎందుకంత కీలకం?
- కరోనావైరస్: కేరళలో దాచి పెట్టిన కోవిడ్ మరణాల గుట్టు రట్టు చేసిన వలంటీర్లు
- పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం
- BBC SPECIAL: ఆత్మహత్యకు పాల్పడిన రైతుల పిల్లలకు తల్లి ఒడి లాంటి బడి 'శాంతివన్'
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)