You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సీన్ కాన్లీ: డోనల్డ్ ట్రంప్‌కు వైద్యం చేసే డాక్టర్ ఎవరు? అమెరికా అధ్యక్షుడికి సరైన మందులే ఇస్తున్నారా?
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ సీన్ కాన్లీ శనివారం ఉదయం అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిని ప్రపంచానికి తెలియజేయడం కోసం వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్ నుంచి వైద్యుల బృందంతో కలిసి బయటకొచ్చారు.
''అధ్యక్షుడి ఆరోగ్యం మెరుగుపడినందుకు నేను, మా వైద్య బృందం చాలా సంతోషంగా ఉన్నాం'' అని చెప్పారు డాక్టర్ సీన్ కాన్లీ.
''మేం ఆశాజనంగా, జాగ్రత్తగా ఉన్నాం.. అధ్యక్షుడు బాగున్నారు'' అని చెప్పారు.
అయితే, అక్కడికి కొద్ది నిమిషాలలోనే అధ్యక్షుడి సిబ్బంది ప్రధానాధికారి మార్క్‌మెడోస్ పూర్తి భిన్నమైన వివరాలు చెప్పారు. ''నాలుగు కీలక ఆరోగ్య సూచీలు(శరీర ఉష్ణోగ్రత, పల్స్ రేట్, శ్వాస రేటు, రక్తపోటు) గత 24 గంటల్లో ఆందోళనకరంగా ఉన్నాయి. రానున్న 48 గంటలు క్లిష్టమైనవి'' అని ఆయన మీడియాకు చెప్పారు.
కాగా నేవీ అధికారి అయిన డాక్టర్ సీన్ కాన్లీ ఆ తరువాత తన పేషెంట్ డోనల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి గురించి మరిన్ని వివరాలు చెప్పాల్సి వచ్చింది.
సీన్ కాన్లీ మొదట మాట్లాడినప్పుడు అధ్యక్షుడికి కరోనా సోకి 72 గంటలైంది అన్నారు.. అయితే, బుధవారం ఆయనకు కరోనా సోకినట్లు అధికారికంగా ప్రకటించిన సమయంతో పోల్చితే ఇది 36 గంటలు అదనం.. దీంతో తాను మూడో రోజు అనాల్సింది పోయి 72 గంటలు అన్నానని కాన్లీ వివరణ ఇచ్చారు.
మరోవైపు తొలుత ట్రంప్‌కు ఆక్సిజన్ పెట్టలేదని చెప్పిన కాన్లీ ఆదివారం మాత్రం అధ్యక్షుడికి కృత్రిమంగా ఆక్సిజన్ అందిస్తున్నట్లు చెప్పారు.
అధ్యక్షుడి ఆరోగ్యం దెబ్బతిన్న సమయంలో ఇలా విరుద్ధ ప్రకటనలు రావడంతో వైట్‌హౌస్ పారదర్శకతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇంతకీ సీన్ కాన్లీ ఎవరు?
నలభయ్యేళ్ల సీన్ కాన్లీ 2018 మార్చి నుంచి అధ్యక్షుడు ట్రంప్‌కు వైద్యుడిగా సేవలందిస్తున్నారు.
వైట్‌హౌస్‌లోని చాలామంది వైద్య సిబ్బంది మాదిరే కాన్లీ కూడా మిలటరీ అధికారి. అంటే.. అధ్యక్షుడు ట్రంప్ ఆయనకు కమాండర్ ఇన్ చీఫ్.
అమెరికా అంతర్యుద్ధం తరువాత నుంచి అధ్యక్షుడి కోసం వైద్యులను సైన్యం నుంచి నియమించే అలవాటు కొనసాగుతోంది. బయట వైద్యులైతే కొద్ది రోజుల ముందు చెప్పి ఉద్యోగం మానేయొచ్చు.. కానీ, మిలటరీ నుంచి వచ్చినవారికి అలాంటి అవకాశం ఉండదు.
గతంలో అమెరికా అధ్యక్ష వైద్యురాలిగా పనిచేసిన డాక్టర్ కానీ మారియానో 'న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ ఈ విధులకు మిలటరీ వైద్యులే సరిగ్గా సరిపోతారని అన్నారు.
యుద్ధక్షేత్రంలో వైద్యం చేసినట్లే వైట్‌హౌస్‌లోనూ పనిచేయాల్సి ఉంటుంది.. సత్వరం స్పందించగలిగేది మిలటరీ వైద్యులే కాబట్టే వారే ఈ బాధ్యతలకు సరైనవారు'' అన్నారామె.
ప్రస్తుత అధ్యక్ష వైద్యుడు డాక్టర్ సీన్ కాన్లీ విషయానికొస్తే ఆయన పెన్సిల్వేనియా రాష్ట్రం డోలెస్టోన్‌కు చెందినవారు. 2002లో యూనివర్సిటీ ఆఫ్ నోట్రడామ్ నుంచి వైద్య పట్టా పుచ్చుకున్నారు. ఆ తరువాత ఫిలడెల్ఫియా కాలేజీలో ఆస్టియోపతిక్ మెడిసిన్ చదివారు. 2006లో ఆయనకు డాక్టర్ ఆఫ్ ఆస్టియోపతిక్ మెడిసిన్ పట్టా వచ్చింది.
ప్రొఫెసనల్ డాక్టర్ డిగ్రీకి 'డాక్టర్ ఆఫ్ మెడిసిన్'కు తేడా ఉంది. ఆస్టియోపతిక్ మెడిసిన్ అనేది జీవనశైలి, పర్యావరణ కారకాలను దృష్టిలో పెట్టుకుని మరింత ఫోకస్డ్‌గా అందించే సమగ్ర చికిత్స.
అయితే బ్రిటన్‌కు భిన్నంగా అమెరికాలో ఆస్టియోపతిక్ డాక్టర్లకు శిక్షణ కూడా మెడికల్ డాక్టర్లకు అందించే సంప్రదాయ శిక్షణలానే ఉంటుంది.
ఆస్టియోపతిక్ మెడిసిన్ శిక్షణ తరువాత డాక్టర్ సీన్ కాన్లీ వర్జీనియా రాష్ట్రంలోని పోర్ట్స్‌మౌత్ నావల్ మెడికల్ సెంటర్‌లో మరిన్ని ఇతర కోర్సులు నేర్చుకున్నారు.
2014లో ఆయన అఫ్గానిస్తాన్‌లో నాటో మెడికల్ యూనిట్‌లో 'చీఫ్ ఆఫ్ ట్రామా'గా పనిచేశారు.
ఆ తరువాత 2018 మార్చి నుంచి అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యక్తిగత వైద్యుడిగా పనిచేస్తున్నారు. కాన్లీ కంటే ముందు తనకు వ్యక్తిగత వైద్యుడిగా పనిచేసిన డాక్టర్ రోనీ జాక్సన్‌ను ట్రంప్ 'యూఎస్ డిపార్టమెంట్ ఆఫ్ వెటరన్ అఫైర్స్'కు నామినేట్ చేయడంతో ఆయన స్థానంలో కాన్లీకి అవకాశం దక్కింది.
అయితే, డెమొక్రాట్లు విడుదల చేసిన ఒక పత్రంలో రోనీ జాక్సన్ నామినేషన్ అనైతికమని పేర్కొనడంతో ఆయన ఉపసంహరించుకున్నారు.
2018 మే నెలలో డాక్టర్ కాన్లీ ట్రంప్ వ్యక్తిగత వైద్యుడి బాధ్యతలను అధికారికంగా చేపట్టారు.
ట్రంప్ ఆరోగ్యం గురించి కాన్లీ గతంలో ఏం చెప్పారు?
ట్రంప్‌కు 2019 ఫిబ్రవరిలో శారీరక పరీక్షలు నిర్వహించినప్పుడు ఆ 11 మంది వైద్యుల బృందానికి పర్యవేక్షకుడిగా వ్యవహరించింది కాన్లీయే.
'అధ్యక్షుడి ఆరోగ్యం భేషుగ్గా ఉంది.. ఆయన పదవీ కాలం పూర్తయ్యే వరకు, ఆ తరువాత కూడా ఆయన ఆరోగ్యంగా ఉంటారు'' అని చెప్పారు కాన్లీ.
అయితే.. నాలుగు గంటల పాటు ఆయన చేసిన పరీక్షలకు సంబంధించిన సమాచారం మాత్రం వెల్లడించలేదని 'న్యూయార్క్ టైమ్స్' అప్పట్లో రాసింది.
ఆ తరువాత 2019 నవంబరులో ట్రంప్ ఆసుపత్రికి వెళ్లినప్పుడు కూడా డాక్టర్ కాన్లీ అదంతా రొటీన్ చెకప్ అనే చెప్పారు.
ట్రంప్‌కు ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లారని వదంతులు వ్యాపించగా కాన్లీ అవన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు.
ట్రంప్ హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకుంటున్నారా?
కరోనా బారినపడిన ట్రంప్‌కు అందిస్తున్న చికిత్స గురించి డాక్టర్ కాన్లీ శనివారం విలేకరులకు చెబుతూ ఆయనకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇవ్వడం లేదన్నారు.
కరోనావైరస్ దరిచేరకుండా తాను హైడ్రాక్సీ క్లోరోక్వీన్ వాడుతున్నట్లు ఈ ఏడాది మే నెలలో ట్రంప్ చెప్పారు.
ట్రంప్ అప్పుడు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ గురించి చెప్పిన తరువాత ఆయనకు ఆ మందు సూచించిన డాక్టర్ కాన్లీ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
హైడ్రాక్సీ క్లోరోక్వీన్ వల్ల ఉన్న ముప్పుతో పోల్చితే దాంతో కలిగే ప్రయోజనాలు ఎక్కువని ఆయన అప్పట్లో అన్నారు.
అయితే, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో కరోనా తగ్గుతుందనడానికి ఆధారాలున్నాయని ఏ అధ్యయనం కూడా చెప్పకపోవడంతో డాక్టర్ కాన్లీ అధ్యక్షుడు ట్రంప్‌కు సరైన మందే సూచించారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఇవి కూడాచదవండి:
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు మొదలయ్యేది ఎప్పుడు?
- 10 కి.మీ దూరంలో భారతీయ మహిళ మృతదేహం.. తీసుకురావాలంటే 2291 కి.మీ. ప్రయాణించాలి
- అక్షరాస్యతలో బిహార్ కంటే వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్.. అసలు కారణాలేంటి?
- వంట నూనెల్లో ఏది ఆరోగ్యానికి మంచిది.. ఆలివ్ నూనె గుండెకు మేలు చేస్తుందా
- తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మీ భూమి మీదేనని అధికారికంగా చెప్పేది ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)