You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డోనల్డ్ ట్రంప్: కరోనా నిర్ధారణ అయిన 24 గంటల్లోనే ఆస్పత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు కరోనావైరస్ పరీక్షల్లో పాజిటివ్ అని తెలిసిన 24 గంటల లోపే ఆయనను ఆస్పత్రిలో చేర్చారు.
ముందు జాగ్రత్త చర్యగానే ట్రంప్‌ను వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్‌లో చెర్పించామని వైట్ హౌస్ తెలిపింది.
తనకు, తన భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌కు కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని శుక్రవారం నాడు ట్రంప్ తెలిపారు.
ట్రంప్‌కు కాస్త అలసటగా ఉందిగానీ ఉత్సాహంగానే ఉన్నారని, కోవిడ్ 19 లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని వైట్ హౌస్ తెలిపింది.
వచ్చే నెల నవంబరులో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, డెమొక్రటిక్ పార్టీకి చెందిన జో బైడెన్‌తో పోటీ పడుతున్నారు.
శుక్రవారం ట్రంప్ ఎలా కనిపించారు?
శుక్రవారం మధ్యహ్నం మాస్క్ వేసుకుని వైట్ హౌస్ నుంచి తన హెలికాఫ్టర్ మరీన్ వన్‌లో ఆస్పత్రికి వెళ్లారు. వెళ్లే ముందు రిపోర్టర్లందరికీ థంబ్స్ అప్ అన్నట్టు చెయ్యి చూపించారు.
ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ట్రంప్ మాట్లాడుతూ.. "నాకు గొప్ప మద్దతునిచ్చి, సహాయంగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. నేను వాల్టర్ రీడ్ ఆస్పత్రికి వెళుతున్నాను. నా ఆరోగ్యం బాగానే ఉంది. మేము అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. అమెరికా ప్రథమ మహిళ కూడా బాగున్నారు. అందరికీ కృతజ్ఞతలు. మీ మేలు మరిచిపోలేను" అని తెలిపారు.
ట్రంప్ కుమార్తె ఇవాంక, కుమారుడు ఎరిక్ తన తండ్రి పోస్ట్ చేసిన వీడియోను మళ్లీ ట్వీట్ చేస్తూ "మీరు యోధులు" అని అభివర్ణించారు. .
వైట్ హౌస్ ఏం చెబుతోంది?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్సాహంగానే ఉన్నారని, కోవిడ్ 19 లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, రోజంతా పని చేస్తూనే ఉన్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెయ్‌లీ మెకనానీ తెలిపింది.
"డాక్టర్ల సలహాతో ముందు జాగ్రత్త చర్యగానే ట్రంప్‌ను ఆస్పత్రిలో చేర్చాం. రాబోయే కొద్ది రోజులు ట్రంప్ వాల్టర్ రీడ్‌లో అధ్యక్ష కార్యాలయం నుంచి పని చేస్తారు" అని కెయ్‌లీ మెకనానీ తెలిపారు.
వైట్ హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ అలిసా ఫరా మాట్లాడుతూ..ట్రంప్ తన పదవీ బాధ్యతలను ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు బదిలీ చెయ్యలేదని స్పష్టపరిచారు.
"ప్రస్తుతం ట్రంప్ తన విధులను తానే నిర్వహిస్తున్నారు" అని అలిసా ఫరా తెలిపారు.
శుక్రవారం నాడు సీనియర్ అధికారులతో జరిగిన సమావేశం నుంచి ట్రంప్ బయటకి వచ్చేస్తూ సమావేశాన్ని కొనసాగించే బాధ్యతను ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు అప్పగించారు.
అమెరికా రాజ్యాంగం ప్రకారం, అధ్యక్షుడు బాగా అస్వస్థతకు గురైన పక్షంలో, తాత్కాలికంగా పదవీ బాధ్యతలను ఉపాధ్యక్షుడికి అప్పగిస్తారు. ట్రంప్ తన విధులను నిర్వర్తించలేని పక్షంలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారు.
డెమొక్రటిక్ పార్టీ స్పందన ఏమిటి?
జో బైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్‌కు శుక్రవారం జరిపిన కోవిడ్ 19 పరీక్షల్లో నెగటివ్ వచ్చింది.
కోవిడ్ 19 ఫలితాల తరువాత బైడెన్ ట్వీట్ చేస్తూ.. "ఇదొక హెచ్చరికగా భావించాలి. అందరూ మాస్కులు వేసుకోండి. భౌతిక దూరం పాటించండి. చేతులు కడుక్కోండి" అని తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌కి ప్రతికూలంగా చేస్తున్న ప్రచారాన్ని తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు డెమొక్రటిక్ పార్టీ తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు, ఆయన భార్య త్వరగా కోలుకోవాలని బైడెన్ దంపతులు కోరుకుంటున్నట్లు తెలిపారు.
"ఇది విభజన సమయం కాదు.. ఈ దేశ పౌరులుగా మనందరం ఒక్కట్టవ్వాల్సిన సమయం" అని బైడెన్ ట్వీట్ చేశారు.
జో బైడెన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా మాట్లాడుతూ.. "మనందరం అమెరికన్లం. మనందరం మనుషులం. అందరూ ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం" అని పేర్కొన్నారు.
కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?
ట్రంప్ దంపతులకు కోవిడ్ 19 ఎలా సోకింది?
ట్రంప్‌కు, ఆయన భార్యకు కరోనావైరస్ ఎలా సోకి ఉంటుందన్న విషయంపై స్పష్టమైన సమాచారం లేదు.
గురువారం నాడు, ట్రంప్‌కు అత్యంత సన్నిహిత సహాయకురాలు హోప్ హిక్స్‌కు కోవిడ్ 19 పరీక్షల్లో పాజిటివ్ అని నిర్థారణ కాగానే ట్రంప్ దంపతులు హోం క్వారంటీన్ పాటించనున్నట్లు తెలిపారు. అయితే, వెంటనే ట్రంప్‌కు, ఆయన భార్యకు కూడా కరోనవైరస్ పరీక్షల్లో పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది.
గురువారం నాడు ఒక నిధుల సేకరణ కార్యక్రమానికి ట్రంప్ వెళ్లారని, అప్పటికే హోప్ హిక్స్‌కు కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయని, అది తెలిసి కూడా అనేకమంది హాజరైన ఆ కార్యక్రమానికి ట్రంప్ వెళ్లారని విమర్శలు వెల్లువెత్తాయి.
గత కొన్నిరోజులుగా అమెరికా అధ్యక్షుడికి దగ్గరగా మెసలిన వారందరి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకినవారు మీ వీధిలో ఉంటే ఏం చేయాలి... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)