You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ట్రంప్‌పై మాజీ మోడల్ ఆరోపణలు: ‘బాత్‌రూం వద్ద మాటువేసి నాపై లైంగిక దాడి చేశారు’... ఖండించిన అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 1997లో న్యూయార్క్‌లో తనపై లైంగిక దాడి చేశారని ఒక మాజీ మోడల్ ఆరోపించారు. ఆ ఆరోపణలను ట్రంప్ ఖండించారు.
మాజీ మోడల్ అమీ డోరిస్.. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ దగ్గర తాను బాత్‌రూమ్‌కు వెళ్లి బయటకు వచ్చినపుడు డోనల్డ్ ట్రంప్ తన శరీరంలోని వివిధ భాగాలను అసభ్యకరంగా తడిమారని, తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని బ్రిటన్‌కు చెందిన గార్డియన్ వార్తాపత్రికతో చెప్పారు.
ఈ ఆరోపణలను ట్రంప్ తరఫు న్యాయవాదులు తిరస్కరించారు. ఇది ఎన్నికలకు ముందు ట్రంప్ మీద ''దాడి చేసే ప్రయత్నం''గా అభివర్ణించారు.
ట్రంప్ అసభ్యకరంగా ప్రవర్తించారని, లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని గతంలోనూ పలువురు మహిళలు ఆరోపించారు.
తనపై వచ్చిన ఆరోపణలన్నిటినీ ట్రంప్ తిరస్కరించారు.
ట్రంప్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్తున్న సమయంలో అమీ డోరిస్ వయసు 24 సంవత్సరాలు. అప్పటి తన బాయ్ ఫ్రెండ్ జేసన్ బిన్‌తో కలిసి ట్రంప్‌కు చెందిన వీఐపీ బాక్స్‌లో కూర్చుని మ్యాచ్‌లను వీక్షించినట్లు ఆమె తెలిపారు.
తాను బాత్‌రూమ్‌కు వెళ్లినపుడు ట్రంప్ బాత్‌రూమ్ బయట తన కోసం మాటువేశారని ఆమె ఆరోపించారు.
''అతడు అమాతంతంగా తన నాలుకను నా గొంతులోకి చొప్పించాడు. నేను అతడిని వెనక్కు నెట్టివేస్తూ ఉన్నా. అప్పుడతడు మరింత గట్టిగా పట్టుకుని చేతులతో నా పిరుదులు, నా వక్షోజాలు, నా వీపు, అన్నీ తడిమాడు'' అని ఆమె 'గార్డియన్'తో చెప్పారు.
''అతడి పట్టులో నుంచి నేను బయటపడలేకపోయాను'' అన్నారు.
అదంతా ఆపాలని తాను ట్రంప్‌కు చెప్పానని.. కానీ అతడు ఏమాత్రం పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నారు.
ఇప్పుడు తనకు ఇద్దరు టీనేజీ కుమార్తెలు ఉన్నారని.. వారికి ఆదర్శంగా ఉండటం కోసం ఇప్పుడు ముందుకొచ్చి ఈ విషయం వెల్లడించాలని నిర్ణయించుకున్నానని డోరిస్ చెప్పారు. 2016లోనే ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకున్నానని.. కానీ తన కుటుంబ క్షేమం కోసం భయంతో ఆ పని చేయలేకపోయానని వివరించారు.
ఈ ఆరోపణలన్నీ పూర్తిగా అసత్యమని ట్రంప్ ప్రచార బృందానికి న్యాయ సలహాదారుగా ఉన్న జెన్నా ఎలిస్ సీబీఎస్ న్యూస్ చానల్‌తో పేర్కొన్నారు.
''ఈ విషపూరిత, నిరాధార కథనాన్ని ప్రచురించినందుకు ద గార్డియన్ పత్రిక బాధ్యత వహించేలా చేయటానికి అందుబాటులో ఉన్న అన్ని న్యాయపరమైన మార్గాలనూ పరిశీలిస్తాం'' అని చెప్పారు.
డోరిస్ చేసిన ఆరోపిత దాడి నిజమే అయితే దానికి ఇతర సాక్షులు కూడా ఉండి ఉండాలని ట్రంప్ న్యాయవాదులు 'ద గార్డియన్'తో వ్యాఖ్యానించారు. నవంబర్‌లో జరుగబోయే అధ్యక్ష ఎన్నికలకు ముందు చేస్తున్న ఈ ఆరోపణల వెనుక రాజకీయ ప్రేరేపణ ఉండివుండవచ్చునని సూచించారు.
ట్రంప్‌తో అసభ్యంగా కానీ, అసౌకర్యవంగా గానీ ఏదైనా జరిగిందనే విషయం డోరిస్ తనతో చెప్పినట్లు తనకేమీ గుర్తులేదని బిన్ తమతో పేర్కొన్నారని కూడా ట్రంప్ న్యాయవాదులు చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆరోపణలు రావటం ఇదే మొదటిసారి కాదు.
2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు.. ట్రంప్ మీద లైంగిక దుష్ప్రవర్తనకు సంబంధించి ఇటువంటి ఆరోపణలు వెల్లువలా వచ్చాయి. మహిళల విషయంలో ఆయన ప్రవర్తన మీద నిశిత దృష్టి కేంద్రీకరించేలా చేశాయవి.
తన వంటి సెలబ్రిటీలు మహిళలను 'ఏమైనా చేయొచ్చు' అంటూ ట్రంప్ వ్యాఖ్యానిస్తున్న వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయనపై ఆరోపణలు ఎక్కువయ్యాయి.
అటువంటి వారిలో వ్యాస రచయిత్రి జీన్ ఇ కారోల్ ఒకరు. 1995 చివర్లోనో, 1996 మొదట్లోనో ట్రంప్ తన మీద ఒక డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.
ట్రంప్ తన మీద దూకి, తనను గోడకు అదిమిపట్టి, తన మీద పడ్డారని చెప్పారు. అవి పూర్తిగా అబద్ధాలని ట్రంప్ ప్రత్యారోపణ చేశారు.
ఇవి కూడా చదవండి:
- #విమెన్ హావ్ లెగ్స్: మహిళలు కాళ్లు కనిపించేలా బట్టలు ధరించకూడదా?
- వంట నూనెల్లో ఏది ఆరోగ్యానికి మంచిది.. ఆలివ్ నూనె గుండెకు మేలు చేస్తుందా
- కోవిడ్-19 నుంచి కోలుకున్నా అనారోగ్యం ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- భారత్-చైనా వివాదం: హాట్‌లైన్ అంటే ఏంటి? దీనిని ఉపయోగించే అధికారం ఎవరిది?
- భారత్-చైనా ఘర్షణలు ప్రధాని మోదీ "స్టార్టప్ ఇండియా" కలలపై ప్రభావాన్ని చూపుతున్నాయా?
- ఫాతిమా షేక్: తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలేతో కలిసి పనిచేసిన ఈమె ఎవరు?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)