You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫాతిమా షేక్: తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలేతో కలిసి పనిచేసిన ఈమె ఎవరు?
- రచయిత, నసీరుద్దీన్
- హోదా, బీబీసీ కోసం
సాధారణంగా సామాజిక సేవకులు, రాజకీయ నాయకులను వారు అందించిన సేవల ద్వారా గుర్తు పెట్టుకుంటాం. శతాబ్దాలుగా ఎందరో నాయకులను ఇలానే మనం కొనియాడుతూ వస్తున్నాం. అయితే, కొందరు మహిళలు కూడా విశేష సేవలు అందించారు. వారిలో కొందరిని మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటుంన్నాం.
దేశానికి, సమాజానికి జీవితాన్ని అంకితం చేసిన ఎందరో మహిళలు తెర వెనుకనే ఉండిపోయారు. వారి పేర్లను మనం వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఒకవేళ పేర్లు తెలిసిన వారి జీవిత విశేషాల గురించి తెలిసింది అంతంత మాత్రమే.
చాలా మంది మహిళలు తమ ఆత్మకథలను తాము రాసుకోరు. చాలా మంది వారి జీవిత చరిత్రలను పట్టించుకోరు. అవును, మనది పురుషాధిక్య సమాజం. మనం అలాంటి విధానాలనే అనుసరిస్తున్నాం.
ఎంతో సేవ చేసినప్పటికీ.. గుర్తింపుకు నోచుకోని మహిళల్లో ఫాతిమా షేక్ కూడా ఒకరు. ఆమెపై ఏళ్లతరబడి పరిశోధనలు చేసినా బయటకు వచ్చిన సమాచారం అంతంత మాత్రంగానే ఉంది.
జ్యోతిబా ఫూలే, సావిత్రి బాయి ఫూలే అందరికీ సుపరిచితమే. జ్యోతిబా ఫూలే ఓ సామాజిక విప్లవకారుడు. అణగారిన వర్గాల కోసం ఆయన కృషి చేశారు. సావిత్రి బాయి ఫూలేను తొలి భారత మహిళా ఉపాధ్యాయురాలిగా చెబుతుంటారు. తాను లేనప్పుడు అన్ని పనులనూ ఈమె చూసుకోగలదని సావిత్రి బాయి చెప్పారంటే.. ఆ వ్యక్తి ఎంతటివారో అర్థంచేసుకోవచ్చు. ఆమె ఎవరో కాదు ఫాతిమా షేక్.
సావిత్రి బాయికు తోడుగా
సావిత్రి బాయి చేపట్టే దాదాపు అన్ని కార్యక్రమాల్లోనూ ఫాతిమా పాలుపంచుకునేవారు. అయితే సావిత్రి బాయి గురించి మాత్రమే మనకు తెలుసు. ఎందుకంటే ఆమె జ్యోతిబా ఫూలేతో కలిసి చాలా రచనలు చేశారు. ఆ రచనలు పదిలంగా ఉన్నాయి కాబట్టే వారి గురించి మనకు తెలుసు. కానీ ఫాతిమా గురించి అలాంటి ఆధారాలేమీ కనబడవు.
ఇటీవల కాలంలో ఫాతిమాపై చరిత్రకారులు దృష్టి కేంద్రీకరించారు. జ్యోతిబా ఫూలే, సావిత్రి బాయి ఫూలేలపై పరిశోధనలు చేపట్టినవారు సైతం ఫాతిమా గురించి వివరాలు చెప్పలేకపోతున్నారు. అందుకే ఆమెకు సంబంధించిన చాలా అంశాలపై వాస్తవాలు తెలియడంలేదు. అయితే, చాలా కథలు మాత్రం మనుగడలో ఉన్నాయి. ఈ కథలకు మూలాలు ఎక్కడున్నాయో తెలియడంలేదు. కొందరు ఫాతిమాను ఉస్మాన్ షేక్ సోదరిగా చెబుతుంటారు. సామాజిక సేవల విషయంలో సొంత తండ్రే జ్యోతిబా ఫూలేను ఇంటి నుంచి బయటకు పంపించినప్పుడు.. ఆయనకు ఉస్మాన్ షేక్ ఆశ్రయమిచ్చారు. అయితే, ఉస్మాన్ షేక్ గురించి కూడా తెలుసుకోవడం అంత తేలికేమీ కాదు.
ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు.
ఈ సిరీస్‌లోని ఇతర కథనాలు:
- ముత్తులక్ష్మి రెడ్డి: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
- రఖ్మాబాయి రౌత్: బలవంతపు పెళ్లిళ్లపై జైలుకు వెళ్లేందుకు సిద్ధపడిన ధీరవనిత
- రుకేయా షకావత్: వేల మంది అమ్మాయిల జీవితాల్లో మార్పు తెచ్చిన రచయిత్రి
- చంద్రప్రభ సైకియాని: అసోంలో పర్దా పద్ధతికి తెరదించడంలో కీలకపాత్ర పోషించిన వనిత
- ఇందర్జీత్ కౌర్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు తొలి మహిళా అధ్యక్షురాలు
- సుగ్రా హుమాయూన్ మీర్జా: బురఖా లేకుండా బయటకు వచ్చిన తొలి మహిళ.. దక్కన్ మహిళల గొంతుక
- అన్నా చాందీ: భారత్‌లో హైకోర్టు తొలి మహిళా జడ్జి.. మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాడిన న్యాయవాది
- అనసూయ సారాభాయ్: కార్మిక ఉద్యమానికి బాటలు వేసిన మహిళ
- కమలాదేవి చటోపాధ్యాయ: ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి భారతీయ మహిళ
కానీ, విశేషం ఏమిటంటే.. నేడు ఫాతిమా గురించి మనకు అంతోఇంతో తెలుసంటే అది సావిత్రా బాయి ఫూలే వల్లే. అంటే ఓ మహిళ సేవ నుంచి మరో మహిళ వివరించారన్నమాట.
సావిత్రి బాయి ఫూలే సమగ్ర వాంగ్మయ్ పుస్తకంలో ఓ ఫోటో కనిపిస్తుంది. దీనిలో సావిత్రి బాయి పక్కనే ఓ మహిళ కూర్చొని ఉన్నారు. ఆమె ఎవరో కాదు.. ఫాతిమా షేక్. సావిత్రి బాయికి ఫాతిమా సన్నిహితురాలని చెప్పడానికి ఇదే అతిపెద్ద ఆధారం.
చారిత్రక చిత్రం
సావిత్రి బాయి ఫూలే సమగ్ర వాంగ్మయ్ పుస్తక సంపాదకుడైన డాక్టర్ ఎంజీ మాలి ముందుమాటలో కొంత కీలక సమాచారం ఇచ్చారు.
చాలా ఏళ్ల క్రితం ఈ ఫోటోను పుణెకు చెందిన మజూర్ అనే పత్రిక ప్రచురించింది. ఆ పత్రిక 1924 నుంచి 1930 మధ్యలో ప్రచురితమైంది. దీని సంపాదకుడు ఆర్‌ఎన్ లాడ్. అయితే కొంతకాలం డీఎస్ జోడ్గే ఈ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. ఆయనే మాలికి ఆ చిత్రాన్ని ఇచ్చారు. అంతేకాదు దీనికి గురించి కొన్ని వివరాలు కూడా చెప్పారు.
డాక్టర్ ఎంజీ మాలి సమాచారం ప్రకారం.. ఓ మిషనరీ రాసిన లొఖెండే అనే ప్రసిద్ధ పుస్తకంలో సావిత్రి బాయి ఫూలేకు చెందిన ఓ గ్రూప్ ఫోటో ప్రచురితమైంది. ఈ పుస్తకంలో ప్రచురితమైన ఫోటో, మజూర్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన ఫోటో ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ఆ గ్రూప్ ఫోటో నుంచే సావిత్రి బాయి ఫోటో లభించింది.
1966లో ప్రొఫెసర్ లీలా పాండే రాసిన పుస్తకం ''మహారాష్ట్ర కర్తృత్వశాలిని'' ప్రచురితమైంది. దీనిలో ఓ స్కెచ్ కనిపించింది. ఇది ఆ చారిత్రక ఫోటోతో సరిగ్గా సరిపోలుతోంది. నేను ఈ ఫోటోతోపాటు ఇతర ఫోటోల గురించి కూడా పరిశోధించాను. పుణెకు చెందిన ఏక్‌నాథ్ దగ్గర కూడా కొన్ని ఫోటోల నెగెటివ్‌లు లభించాయి. జోడ్గేకు కూడా ఆయన నుంచే ఈ ఫోటో నెగెటివ్ దొరికింది. దీని నుంచే సావిత్రి బాయి, ఫాతిమాల ఫోటో అందరికీ దొరికింది. ఇది వందేళ్లనాటి నెగెటివ్ నుంచి తీసిన అరుదైన ఫోటో.
ఈ ఫోటో లేకపోతే, ఫాతిమా షేక్ గురించి ఎవరికీ తెలుసుండేది కాదు. అలానే సావిత్రి బాయి ఎలా ఉంటారో కూడా ఎవరికీ తెలిసేది కాదు. అంతేకాదు చరిత్రలో ఫాతిమా చాలా ముఖ్యమైన వారని ఈ ఫోటోనే చెబుతోంది. ఫాతిమాకు ఈ ఫోటోనే మళ్లీ జీవం పోసింది. ఆమెను మన ముందుకు తీసుకొచ్చింది.
పాఠశాల బోర్డుపైనా..
పుణెలో బాలికల కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే స్థాపించిన ఓ పాఠశాల వెలుపల ఓ బోర్డు కనిపిస్తోంది. దీనిపైనా ఫాతిమా షేక్ పేరు కనిపిస్తోంది. చిందరవందరగా కనిపించే ఇక్కడి పాఠశాల గోడలను తీక్షణంగా పరిశీలిస్తే.. బాలికలతోపాటు ఇద్దరు మహిళలు కనిపిస్తారు. వారెవరో కాదు సావిత్రా బాయి, ఫాతిమా షేక్. దాదాపు 175ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో ఓ విప్లవాత్మక మార్పుకు నాందిపలికారు. ఇవే గదుల్లో వారిద్దరూ కలిసి బాలికలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు.
ఫూలే దంపతులకు, మఖ్యంగా సావిత్రి బాయికి చాలా అవరోధాలు ఎదురైనట్లు చరిత్ర చెబుతోంది. దీనికి కారణం వారు దళితులు, అణగారిన వర్గాలు, మహిళల అభ్యున్నతికి కృషి చేయడమే. ఈ అవరోధాలు, అడ్డంకులను ఫాతిమా షేక్ కూడా ఎదుర్కొనే ఉంటారు. రాళ్లు, పేడ, మట్టి గడ్డలను పైన వేయడంతోపాటు అవహేళనలనూ సావిత్రి బాయి ఎదుర్కొన్నప్పుడు.. ఆమె పక్కనే ఉండే ఫాతిమా ఇవన్నీ ఎలా తప్పించుకోగలరు? ముఖ్యంగా ఆమె కుటుంబ నేపథ్యం, సామాజిక పరిస్థితులూ ఆమెపై ప్రభావం చూపి ఉండొచ్చు.
ఈ పాఠశాల వయసుతోపాటు, సావిత్రి బాయి వయసునూ దృష్టిలో పెట్టుకొని చూస్తే.. 180 లేదా 190 ఏళ్లకు పూర్వం ఫాతిమా జన్మించి ఉండొచ్చు. బ్రిటిష్ కాలంలో పుణెలో ఆమె సేవలందించి ఉండొచ్చు.
సావిత్రి బాయి లేఖ
ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఒకటుంది. సావిత్రి బాయి, ఫాతిమాల మధ్య సన్నిహిత సంబంధాలకు ఇది అద్దంపట్టేది.
సావిత్రి బాయి ఒకసారి తన పుట్టింటికి వెళ్లారు. అక్కడ ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆమె తిరిగి పుణెకు తిరిగివచ్చే పరిస్థితిలో లేరు. అప్పటికే పుణెలో అణగారిన వర్గాలు, మహిళల కోసం చాలా పాఠశాలలు నడుస్తుండేవి. పని కూడా చాలా ఎక్కువే ఉండేది. సామాజిక సేవ చేసేవారు చాలా తక్కువగా ఉండేవారు. ఈ పాఠశాలల గురించి ఆందోళన చెందుతూ సావిత్రి బాయి ఓ లేఖ రాశారు.
10, అక్టోబరు 1856లో ఫూలేకు ఆమె ఈ లేఖ రాశారు. ''నా గురించి బాధ పడకండి. ఫాతిమాకు కూడా చాలా కష్టంగా ఉండే ఉంటుంది. కానీ ఆమె మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఎలాంటి ఫిర్యాదులూ చేయదు''అని సావిత్రి బాయి వివరించారు.
ఫాతిమా ఏ విషయంలో ఇబ్బంది పడతారు? ఎందుకు ఆమె జ్యోతిబాను ఇబ్బంది పెట్టరు? ఇది పాఠశాలకు సంబంధించిన విషయమే. ఫాతిమా కేవలం ఉపాధ్యాయురాలు మాత్రమే కాదు. అణగారిన వర్గాల మహిళల అభ్యున్నతి కోసం ఆమె సావిత్రితో కలిసి పనిచేశారు. బాధ్యతలను పంచుకోవడంలోనూ వీరిద్దరూ సమానమే. వారిద్దరూ కలిసే పనిచేసినా వారి వ్యక్తిత్వాలు భిన్నమైనవి. అందుకే ఆమె పాఠశాలను సొంతంగా నడిపించగలిగారు. ఈ లేఖ ఆమె కృషికి అతిపెద్ద నిదర్శనం.
ఈ లేఖ ఫాతిమా జీవితానికి, ఆమె ఆలోచనా శక్తికి అద్దం పడుతోంది. ఫాతిమా ఎవరి ప్రభావానికీ లోనుకారు. ఆమెకు ప్రత్యేకమైన వ్యక్తిత్వముంది. అణగారిన వర్గాలు, మహిళల అభ్యున్నతికి పోరాడేవారిలో ఆమె ముందువరుసలో ఉంటారు.
సావిత్రి బాయి తొలి మహిళా ఉపాధ్యాయురాలు అయితే, ఫాతిమా ఏమవుతారు? ఆమె కూడా తొలి మహిళా ఉపాధ్యాయురాలే. కొందరు ఆమెను తొలి మహిళా ముస్లిం ఉపాధ్యాయురాలిగా చెబుతుంటారు. కానీ సావిత్రి బాయికి అలాంటి విశేషణాలేవీ పెట్టనప్పుడు.. ఫాతిమాకు మాత్రం ఎందుకు?
(చిత్రాలు: గోపాల్ శూన్య)
ఇవి కూడా చదవండి:
- కొబ్బరి చరిత్ర ఏమిటి? హిందూ ధార్మిక కార్యక్రమాలలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- మహిళలు గర్భం దాల్చినప్పుడు రకరకాల ఆహార పదార్ధాలు తినాలని ఎందుకనిపిస్తుంది?
- కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు WHO చెప్పిన అయిదు ఆహార చిట్కాలు
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- 2 వేల సంవత్సరాలు నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయా?
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)