You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రెండో ప్రపంచ యుద్ధం జపాన్ రాజకీయాలను ఎలా ప్రభావితం చేసింది?
- రచయిత, రూపర్ట్ వింగ్‌ఫీల్డ్-హేస్
- హోదా, బీబీసీ న్యూస్-టోక్యో
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి తర్వాత చివరిగా లొంగిపోయిన సైనికుడి పేరు హిరూ ఒనొడా. 1974, మార్చి 9న లెఫ్టినెట్ ఒనొడా తన కత్తిని ఇచ్చేయడం ద్వారా ఆయన అధికారికంగా లొంగిపోయినట్లయింది.
అప్పటికి ఆయన 29 సంవత్సరాలపాటు ఫిలిప్పీన్స్ అడవుల్లో కాలం గడిపారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోవడాన్ని తాను జీర్ణించుకోలేకపోయానని, జపాన్‌కు తిరిగి వచ్చాక పలు ఇంటర్వ్యూలలో, వ్యాసాలలో ఒనొడా పేర్కొన్నారు.
సాధారణంగా బయటి దేశస్తులైతే ఒనొడాను మూర్ఖుడిగా పరిగణిస్తారు. కానీ రాజరిక జపాన్‌లో అతను చేసింది కరెక్టే. ఎందుకంటే సైనికుడిగా బాధ్యతలు స్వీకరించే ముందు తాను ఎవరికీ లొంగిపోనని, రాజుకోసం అవరసరమైతే ప్రాణాలను ఇస్తానని ప్రమాణం చేశారు.
రాజు కోసం ప్రతి ఒక్కరు అలాగే చేయాలని ఆయన కోరుకునేవారు.
కానీ జపాన్ సైనికులెవరూ అలా చేయలేదు. 1945 ఆగస్టు 15న అప్పటి జపాన్ చక్రవర్తి హిరోహిటో అంతకు ముందు ఏ చక్రవర్తి చేయని పని ఒకటి చేశారు. హిరోషిమా, నగాసాకి నగరాలను అప్పటికే ఆటంబాంబులు ధ్వంసం చేశాయి.
రెండోబాంబు పడిన రోజున జోసెఫ్ స్టాలిన్ తాను కూడా జపాన్‌పై యుద్ధానికి దిగుతున్నట్లు ప్రకటించారు. అప్పటికే మంచూరియా ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకుంది. కొన్నివారాల్లోనే రష్యన్ సైన్యం జపాన్‌లోని హోక్కాయిడో ద్వీపానికి చేరుతుంది. అలాంటి సమయంలో అమెరికాకు లొంగిపోవడమే సరైన మార్గమని చక్రవర్తి హిరోహిటో భావించారు.
ఇంకా జపాన్ చక్రవర్తి లొంగుబాటు ప్రకటన రాలేదు. ఆగస్టు 15 ఉదయం కొందరు అధికారులు కొంత సైన్యాన్ని తీసుకుని చక్రవర్తి ఇంటికి వచ్చారు. లొంగుబాటు ప్రకటన రాకుండా ఆపాలన్నది వారి ప్రయత్నం. యుద్ధం ఇంకా ముగియలేదని వారు చక్రవర్తికి వివరించాలనుకున్నారు. జపాన్ ద్వీపాలు ఇంకా దేశం ఆధీనంలోనే ఉన్నాయని, చైనాలో ఉన్న సైన్యం ఇంకా ఓడిపోలేదని వారు చెప్పాలనుకున్నారు.
అమెరికా విసిరిన బాంబుల వల్ల జరిగిన ప్రాణ నష్టం ఒక్కటే అధికారులను కలవరపెట్టింది. అందుకే చక్రవర్తి అస్థిత్వాన్ని కాపాడాలని, ఆయనకు ఏమీ కాదని నిర్ధారణ అయ్యే వరకు లొంగిపోవద్దన్నది ఆ అధికారుల ఉద్దేశం.
కానీ అధికారులు చక్రవర్తి రేడియో ప్రసంగాన్ని ఆపలేకపోయారు. అయితే వారి కోరిక మాత్రం నెరవేరింది. లొంగుబాటు తర్వాత జపాన్ చక్రవర్తిని యుద్ధ నేరాల కింద విచారణ జరపకూడదని అమెరికా నిర్ణయించింది. అయితే అమెరికా అదుపాజ్జలలో పనిచేసే చక్రవర్తిగా ఆయన సింహాసనం మీదే ఉండే ఏర్పాటు చేసింది.
చక్రవర్తిని విచారించవద్దని తీసుకున్న నిర్ణయం అప్పటి అమెరికా జనరల్ డగ్లస్ మెకార్థర్‌ది. ఆయన జపాన్ ఓటమి తర్వాత 1949 వరకు ఆ దేశంలో అమెరికా తరఫున పాలనా వ్యవహారాలు చూశారు. జపాన్‌ను కూడా అమెరికా తరహాలో ప్రజాస్వామ్య దేశంగా మార్చాలన్న తన సొంత అజెండాను చక్రవర్తితో అమలు చేయించేందుకు ప్రయత్నించారు.
జపాన్‌కు చెందిన 28మంది సైనికాధికారులను యుద్ధ నేరస్తులుగా గుర్తించింది అమెరికా. అప్పటి ప్రధాని హిడేకి టోజో సహా ఏడుగురిని ఉరి తీశారు. కానీ తర్వాత ఎవరినీ విచారించలేదు.
అలా విచారణను ఎదుర్కోని వారిలో యువరాజు యశుహికో అసాక కూడా ఉన్నారు. ఆయన చక్రవర్తికి స్వయంగా మామ అవుతారు. చైనా నగరం నాన్జింగ్ మీదకు సైన్యాన్ని నడిపిన అధికారి కూడా ఆయనే. వాళ్లందరినీ క్షమించడం తప్పనిసరని మెకార్థర్ భావించారు.
ఈ విచారణ నుంచి బైటపడ్డ మరో వ్యక్తి నొబుసుకే కిషి. మంచూరియాను ఆక్రమించడంలో కిషి కీలక పాత్ర పోషించారు. ఆయన అప్పటి ప్రధాని హిడేకి టోజోకు అత్యంత సన్నిహితుడు. ఆయన్ను కూడా విచారించవద్దని అమెరికా నిర్ణయించింది.
1948లో ఆయన్ను విడుదల చేశారు. అయితే రాజకీయాల్లో పాల్గొనవద్దని షరతులు పెట్టారు. అమెరికా అధికారం కొనసాగినంత కాలం ఈ షరతు అమల్లో ఉంది.
1955లో కిషి లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ పేరుతో ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. తర్వాత కొన్నాళ్లకు ఆయన జపాన్ ప్రధానమంత్రి అయ్యారు. కిషి స్థాపించిన పార్టీ జపాన్‌ను 65ఏళ్లపాటు పాలించింది.
జపాన్ రాజకీయాల్లో మరో శక్తివంతమైన నేత షింతారో అబే. ఆయన కుమారుడిని నొబుసుకే కిషి కుమార్తె వివాహమాడారు. తర్వాత ఆయన జపాన్ విదేశాంగ మంత్రి అయ్యారు. ఆయన వారసత్వమే ప్రస్తుత ప్రధాని షింజో అబే.
షింజో అంబే తన రాజకీయ కుటుంబ చరిత్రకంటే చాలా భిన్నంగా ఉంటారు. తన తాత భావాలకు అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఆయన రాజకీయ సిద్ధాంతాలపై తాత ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
చాలామంది ఆయన మిత్రుల్లాగే యుద్ధ నేరాల విచారణ అనేది విజేతలు నిర్ణయించే న్యాయమని నమ్ముతారు నొబుసుకు కిషి. ఈ తరహా యుద్ధ నేరాల చట్టాలను రద్దు చేయాలన్న ఆశయం అలాగే ఉండిపోయింది.
అమెరికా చేతిలో ఓటమి తర్వాత ఏర్పడిన పరిణామాల నుంచి జపాన్ బైటపడాలని 1965లో ఓ ప్రసంగంలో కిషి పిలుపునిచ్చారు.
అయితే రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి తర్వాత జపాన్‌పై సరిగా విచారణ జరగలేదని చైనా, కొరియాలలోని జపాన్ విమర్శకులు వాదిస్తారు. కానీ వారి అభిప్రాయం తప్పు. ఎందుకంటే ఓటమి తర్వాత జపాన్ అనేకమార్లు క్షమాపణలు చెప్పింది. అయితే సమస్య ఎక్కడంటే జపాన్ నాయకత్వంతోనే. ఎందుకంటే వారి చర్యలుగానీ, క్షమాపణలుగానీ నిబద్ధతతో, నిజాయితీగా లేవు.
1997 వచ్చేసరికి జపాన్‌లో ఒక కొత్త రాజకీయ వర్గం బయలుదేరింది. దానిపేరే నిప్పన్ కైగీ. అది రహస్య సంఘం కాకపోయినా, ఆ గ్రూపు రాజకీయ లక్ష్యాలు, సిద్ధాంతాలు చాలామందికి తెలియవు.
చక్రవర్తి కేంద్రంగా జపాన్ జాతీయ గౌరవాన్ని, వారసత్వాన్ని పునరుజ్జీవింపజేయాలన్నది వీరి లక్ష్యాలలో ఒకటిగా చెబుతారు. జపాన్ జాతీయ చిహ్నాలను, జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని, చరిత్ర వైభవాన్ని కీర్తించడం, సైన్యాన్ని బలోపేతం చేయడం వీటి లక్ష్యాలలో కొన్ని.
ఆ దేశంలో 38,000మంది సభ్యులున్న నిప్పన్ కైగీ గ్రూపులో ప్రధాని షింజో అబే, ఉప ప్రధాని టారో అసో, టోక్యో గవర్నర్ యూరికో కొయికేలాంటి వారు కూడా సభ్యులే.
ఆ గ్రూపులో తాను మరణించే వరకు సభ్యుడిగా ఉన్న వ్యక్తి హిరూ ఒనొడా. తనకు ఇష్టం లేకున్నా 1970లలో విధుల నుంచి రిటైర్‌మెంట్ తీసుకోవాల్సి వచ్చిందాయన. యుద్ధానంతరం చాలా మృదుస్వభావం ఉన్న తరాలు పుట్టాయని ఒనొడా నమ్మేవారు.
కొంతకాలంపాటు ఆయన బ్రెజిల్ వెళ్లి ఒక ర్యాంచ్‌లో గడిపారు. తర్వాత జపాన్ తిరిగి వచ్చి, ఒక స్కూలు ఏర్పాటు చేసిన ఆయన, తాను 29 సంవత్సరాలు అడవుల్లో బతకడానికి ఉపయోగపడ్డ నైపుణ్యాలను విద్యార్ధులకు నేర్పించే ప్రయత్నం చేశారు.
2014లో హిరూ ఒనొడా తన 91వ ఏట మరణించారు. ఈ సందర్భంగా ప్రధాని షింజో ప్రతినిధి ఒనొడాను కీర్తించారు. కానీ ఆయన వృథాగా సాగించిన ఒంటరి పోరాటం గురించిగానీ, అడవుల్లో ఆయన ఫిలిప్పీన్ ప్రజలను చంపిన విషయాన్నిగానీ ఆయన ప్రస్తావించలేదు. దానికి బదులుగా ఆయన్ను జపాన్ హీరో అంటూ ఆకాశానికెత్తారు.
ఇవి కూడా చదవండి:
- ‘నేను ఆక్స్ఫర్డ్ కరోనావైరస్ వ్యాక్సీన్ వేయించుకున్నా.. ఇప్పుడు నేనేం చేస్తానంటే..’
- ‘చైనా తరఫున అమెరికాలో గూఢచర్యం చేస్తున్నా’ - సింగపూర్ పౌరుడు
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- స్వదేశంలో కంటే విదేశాలకు అప్పులు ఇవ్వడానికే చైనా బ్యాంకుల మొగ్గు
- టిబెట్‌ను చైనా ఎప్పుడు, ఎలా తన ఆధీనంలోకి తీసుకుంది?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- కృత్రిమ దీవులు నిర్మిస్తామన్న చైనా కంపెనీలు.. అక్కర్లేదన్న పసిఫిక్ దేశం తువాలు
- హాంకాంగ్ ప్రజల నిరసనలకు కారణమైన మర్డర్ స్టోరీ.. ఎందుకింత వివాదాస్పదమైంది? హోటల్లో ఆ రాత్రి ఏం జరిగింది
- చైనాకు హాంకాంగ్ ‘తలనొప్పి’.. మకావు మాత్రం ‘మచ్చుతునక’..
- హాంగ్‌కాంగ్ సెక్యూరిటీ లా: వివాదాస్పద చట్టానికి చైనా ఆమోదం... వెల్లువెత్తిన ఆగ్రహం
- చైనాపై అమెరికా, బ్రిటన్ కీలక చర్యలు.. అదే బాటలో ఆస్ట్రేలియా, జపాన్, తైవాన్, కెనడా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)