You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘ఆక్స్‌ఫర్డ్ కరోనావైరస్ వ్యాక్సీన్ వేయించుకున్నా.. ఇప్పుడు నేనేం చేస్తానంటే..’
- రచయిత, రిచర్డ్ ఫిషర్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేస్తున్న కోవిడ్-19 వ్యాక్సీన్ ముందస్తు ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. వ్యాక్సీన్ పనితీరుని విశ్లేషించడానికి చేసే క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న రిచర్డ్ ఫిషర్ తన అనుభవాలను పంచుకున్నారు.
నేను ఆరోజు హాస్ఫిటల్ రిసెప్షన్‌లో కూర్చున్నాను. నా ఊరిపి నా కళ్లద్దాలను మసకబరుస్తోంది. డాక్టర్లు, నర్సులు అటూ ఇటూ తిరుగుతున్నారు.
మా పాప పుట్టినప్పుడు చివరిసారిగా సౌత్ లండన్‌లో సెయింట్ జార్జ్ హాస్పిటల్‌కి వచ్చాను. అప్పటికీ, ఇప్పటికీ తేడా నాకు తెలుస్తోంది. బ్లీచింగ్ వాసన ఎక్కువగా వస్తోంది. ఎవరూ కూర్చోకుండా భౌతిక దూరం పాటించేందుకు నా పక్క కుర్చీకి టేప్ వేసి ఉంచారు.
"వ్యాక్సీన్ ట్రయల్స్" అని రాసి ఉన్న ప్లకార్డ్ పట్టుకుని ఇద్దరు స్టాఫ్ నా దగ్గరకొచ్చారు. వారి వెనకాలే వెళ్లాను.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేస్తున్న కోవిడ్-19 వ్యాక్సీన్ సీహెచ్ఏడీఓఎక్స్1 ఎన్‌కోవ్-19 క్లినికల్ ట్రయల్స్ కి వాలంటీర్‌గా వెళ్లాను.
ప్రపంచ వ్యాప్తంగా తయారుచేస్తున్న కోవిడ్-19 వ్యాక్సీన్ ప్రయోగాలలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేస్తున్న వ్యాక్సీన్ ముందంజలో ఉంది.
జులై 20న ట్రయల్స్ లో పాల్గొన్న మొదటి 1,077 మంది ఆధారంగా ఈ వ్యాక్సీన్ సురక్షితమా? కాదా? రోగ నిరోధకశక్తిని పెంచుతుందా? లేదా? అని తెలియజేసే ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు.
"ఇంకా చాలా వర్క్ చెయ్యాల్సి ఉంది. అయితే, ప్రారంభ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి" అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన సారా గిల్బర్ట్ అన్నారు.
తరువాతి దశలో వ్యాక్సీన్ డోసు పెంచుతూ మరికొన్నివేల మంది వాలంటీర్ల మీద క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల్లోని వాలంటీర్లను తీసుకోనున్నారు.
ఈ ప్రయాణం ఎలా మొదలయ్యిందంటే...
ఒకరోజు అనుకోకుండా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఒక ఫిలాసఫర్.. క్లినికల్ ట్రయల్స్‌కు వాలంటియరింగ్ గురించి చేసిన ఓ ట్వీట్ చూశాను. వాలంటీర్‌గా వెళ్లేందుకు దరఖాస్తు నింపానని అతను రాశారు. నేను కూడా వెంటనే దరఖాస్తు పెట్టేశాను.
కొన్ని వారాల తరువాత వాలంటీర్లుగా అంగీకరించిన వారినందరినీ రమ్మని పిలిచారు. సైంటిస్ట్ మాథ్యూ స్నాప్ మమ్మల్ని న్యూరాలజీ వార్డుకి తీసుకెళ్లి.. వ్యాక్సీన్ తయారీలో ఉన్న సైన్స్ గురించి, దుష్ప్రభావాల గురించి వివరించారు. మేము ఏం చెయ్యొచ్చో, ఏం చెయ్యకూడదో కూడా చెప్పారు.
పది వేల మందిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపుకు కరోనావైరస్‌పై ఎలాంటి ప్రభావం చూపని వ్యాక్సీన్ , రెండో గుంపుకు సీహెచ్ఏడీఓఎక్స్1 ఎన్‌కోవ్-19 వ్యాక్సీన్ ఇస్తామని చెప్పారు.
చింపాంజీలలో సాధారణ జలుబుకు కారణమయ్యే వైరస్‌ను బలహీనపరిచి ఈ వ్యాక్సీన్ తయారుచేశారు. కోవిడ్-19 మహమ్మారిగా మారకముందే మెర్స్, ఎబోలా వ్యాధులకు వ్యాక్సీన్ తయారుచేసే పనిలో భాగంగా ఈ మందుపై పరిశోధన చేస్తున్నారు. అందుకే ఇంత త్వరగా కోవిడ్-19 వ్యాక్సీన్ తయారీ దిశలో ముందుకు వెళ్లగలిగారు.
మొదట చింపాంజీల నుంచీ జలుబుకు కారణమైన వైరస్‌ను సేకరిస్తారు. మనుషుల్లో పెరగడానికి వీలు లేకుండా ఉండేందుకు దీనిలో జన్యుపరమైన మార్పులు చేస్తారు. తరువాత ఈ వైరస్‌కు కోవిడ్-19 వైరస్‌నుంచి ప్రొటీన్లు తయారుచేసుకోగలిగే జన్యువులను కలుపుతారు. వీటిని స్పైక్ గ్లైకోప్రొటీన్లు అంటారు.
''ఈ ప్రొటీన్లను మానవ శరీరం గుర్తించి, దీనికి అనుగుణంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోగలిగితే.. ఈ వ్యాక్సీన్ ఇవ్వడం ద్వారా మనుషుల కణాల్లోకి కోవిడ్-19 వైరస్ చేరకుండా ఆపొచ్చు'' అని సైంటిస్ట్ స్నాప్ వివరించారు.
వాలంటీర్లలో ఒక గ్రూపుకు ఈ వ్యాక్సీన్ ఇస్తారు. మరొక గ్రూపుకు మెనింజైటిస్ లేదా సెప్సిస్ వ్యాధులను అరికట్టడానికి ఇచ్చే ఎన్ఏసీడబ్ల్యూవై ఇస్తారు. ఈ మందును ఈ ప్రయోగంలో "కంట్రోల్" గా ఉపయోగిస్తున్నారు.
ఇదంతా విన్నాక నా మెడికల్ హిస్టరీ గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. నాకు అసలు కరోనావైరస్ లక్షణాలు ఉన్నాయో లేదో అని డౌటు వచ్చింది. ట్రయల్స్ కోసం నా నుంచి కొంత రక్తాన్ని తీసుకున్నారు. ఇందులో చాలా షరతులు కూడా ఉన్నాయి. ఇంకెక్కడా రక్త దానం చెయ్యకూడదు. మహిళలైతే గర్భ నిరోధకాలు తప్పనిసరిగా వాడాలి.
ఇంటికి తిరిగొచ్చాక నాకు కొంత భయం పట్టుకుంది. వాలంటీర్లుగా వెళ్లిన వాళ్లకి ఈ వ్యాక్సీన్ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి చెప్పడం కూడా చాలా ముఖ్యం. చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ (వాంతులు, తలనొప్పిలాంటివి) నుంచీ పెద్దవి (గిలయన్ బారే సిండ్రోం) వరకూ ఉండొచ్చని చెప్పారు. చిన్నవే అయినా వాటన్నిటి గురించీ ఒకేసారి వినడం కొంత భయాందోళనలకు గురిచేసింది.
మరికొన్ని సైద్ధాంతిక ప్రభావాల గురించి కూడా చెప్పారు. వ్యాక్సీన్ వల్ల కరోనావైరస్ లక్షణాలు అధికమవ్వొచ్చు. గతంలో సార్స్ వ్యాధికి తయారుచేసిన వ్యాక్సీన్.. జంతువుల్లో ఆ వ్యాధి లక్షణాలను పెంచినట్లుగా పరిశోధనలు తెలుపుతున్నాయి.
అలాగే మెర్స్ వ్యాక్సీన్ ఎలుకల్లో వ్యాధి లక్షణాలను పెంచిందని పరిశోధనల్లో వెల్లడయ్యింది. అయితే అదృష్టవశాత్తు ఆక్స్‌ఫర్డ్ కోవిడ్-19 వాక్సిన్ జంతువుల్లో ఇలాంటి ప్రభావాన్ని చూపలేదు.
ఈ వ్యాక్సీన్ ఇచ్చిన చాలామందికి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాలేదని తెలిసి కొంత స్థిమితపడ్డాను.
వ్యాక్సీన్ ఇచ్చిన రోజు
జులై 3, మళ్లీ సెయింట్ జార్గ్ హాస్పిటల్‌కు పిలిచారు. ఆరోజు నాకు వ్యాక్సీన్ ఇవ్వాల్సి ఉంది. అయితే నేను క్లినికల్ ట్రయల్స్‌కు పనికొస్తానో లేదో ఇంకా తెలీదు.
నా మెడికల్ హిస్టరీని మళ్లీ పరిశీలించారు. మరికొంత రక్తాన్ని తీసుకున్నారు. వ్యాక్సీన్ ఇచ్చేటప్పుడు వాలంటీర్లకు గానీ డాక్టర్లకుగానీ సిరంజిలో ఉన్నది కోవిడ్-19 వ్యాక్సీన్ లేక రెండో వ్యాక్సీన్ అనేది తెలియనివ్వరు. ఇది ఒక నియమం.
నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా నా ఆలోచనలు నా కుటుంబం, స్నేహితులు, కరోనావైరస్, లాక్‌డౌన్ ఇలా పలు అంశాల మీదుగా సాగాయి.
చాలా దేశాల్లో ఈ మహమ్మారి ఇంకా విజృంభిస్తోంది. కొన్ని దేశాలు బయటపడ్డాయిగానీ మరికొన్ని దేశాల్లో ఈ వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుంటోంది. మరణాల సంఖ్య పెరుగుతోంది. మానవాళికి మంచి జరగడం కోసం నా లాంటి పది వేల మంది ఈ ప్రమాదకరమైన ప్రయోగాన్ని ఎదుర్కోబోతున్నారు.
కొంతసేపటి తరువాత నాకు వ్యాక్సీన్ ఎక్కించారు. అయితే అది కోవిడ్-19 వ్యాక్సీన్ లేక "కంట్రోల్" వ్యాక్సీన్ నాకు తెలీదు.
తరువాత నన్నొక హాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ నాలాగే చాలా మంది వాలంటీర్లు ట్రయల్స్ పరీక్షల కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు స్వాబ్ టెస్ట్ చేశారు.
మళ్లీ 7 రోజుల తరువాత మరికొన్ని పరీక్షల కోసం నేనిక్కడకి రావాల్సి ఉంటుంది.
తరువాత కొన్ని రోజులకి నాకు కరోనావైరస్ నెగటివ్ వచ్చిందని మెసేజ్ వచ్చింది.
కనీసం నాలుగు నెలలపాటూ ఈ మొత్తం ప్రక్రియ వారానికి ఒకసారి జరుగుతుంది. ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా బ్లడ్ టెస్టుల కోసం హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది.
ఈ ట్రయల్స్‌లో పాల్గొనడం ఎంత ముఖ్యమో రాజకీయ నాయకులతో సహా చాలామందికి అర్థం కావట్లేదు. ఇది కొంత దీర్ఘకాలిక ప్రక్రియ.. కానీ మానవాళికి ప్రయోజనం చేకూరాలంటే ఇది చెయ్యక తప్పదు. డబ్బులు పడేసి వ్యాక్సీన్ త్వరగా వచ్చేట్టు చెయ్యలేము. ఇది విజయం సాధించడానికి కొంత సమయం పడుతుంది.
ఇప్పటివరకూ వచ్చిన ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ ఫలితాలు ఆశాజనకంగా ఉనాయి. అయితే కేవలం వెయ్యిమంది మీద మాత్రమే ప్రయోగాలు జరిగాయి. లక్షల, కోట్లమందికి ఈ వ్యాక్సీన్ రూపొందించాలంటే చాలా సహనం, డేటా కావాలి.
ఈ ట్రయల్స్ ఫెయిల్ అవ్వొచ్చు. వ్యాక్సీన్ వచ్చాక కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సర్ జాన్ బెల్ జూలై 21న బీబీసీ టుడే ప్రోగ్రాంలో మాట్లాడుతూ "ఒక వ్యాక్సీన్ సురక్షితం, వైరస్‌ను అరికట్టడంలో ఇది సహాయపడుతుంది అని ప్రకటించడం చాలా కష్టమైన విషయం. చాలా భయంగా ఉంటుంది. నేనైతే ఆ పదవిని తీసుకోను. వ్యాక్సీన్ విడుదల చేసిన వెంటనే లక్షలమంది జనం క్యూ కడతారు" అన్నారు.
గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. వ్యాక్సీన్ వచ్చినా కూడా అది కరోనావైరస్‌ను పూర్తిగా తొలగిస్తుందని చెప్పలేము. అయితే లక్షణాలను బాగా తగ్గించవచ్చు. వ్యాధి లక్షణాలు బయటపడకుండా ఉన్నవారు ఈ వైరస్ వ్యాప్తికి కారణమవుతూ ఉండొచ్చు. ఈ వైరస్‌తో మనం కలిసి జీవించాల్సి ఉంటుంది అనేది నిజం.
ట్రయల్స్‌లో నాకిచ్చిన వ్యాక్సీన్ కోవిడ్-19 వ్యాక్సీనో కాదో తెలీదు. తెలిసినా కూడా నా నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండదు. వ్యాక్సీన్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి అని తెలిసేవరకూ అందరి నుంచీ భౌతిక దూరం పాటిస్తూ నా జాగ్రత్తల్లో నేను ఉంటాను.
మానవాళికి ఉపయోగపడే ఓ మంచి పనిలో నేనొక చిన్న భాగాన్ని అయినందుకు సంతోషంగా ఉంది. ఈ వ్యాక్సీన్ విజయవంతమైతే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు.
కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్‌డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి కరోనావైరస్.. ఎలా వ్యాపించింది?
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పత్రాల్లో రాయరు, మరణ ధ్రువీకరణల్లో ఉండదు
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ హాట్ స్పాట్‌గా మారిన తూర్పు గోదావరి
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)