మసీదు స్థలంలో మందిర నిర్మాణం.. భారత ప్రజాస్వామ్యంపై ఇదో మచ్చ: పాకిస్తాన్

ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుతూ మందిరానికి భూమి పూజ చేసే అవకాశం కల్పించిన రామ మందిర్ ట్రస్టుకు ధన్యవాదాలు తెలిపారు.

"రాముడు పురుషోత్తముడు, ప్రతి ఒక్కరు ఆయన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. తెలుగులో, తమిళంలో, మలయాళం, బెంగాలీ, కాశ్మీరీ, పంజాబీలతోపాటు అనేక భాషలలో రామాయణాలు వెలువడ్డాయి. భిన్నత్వంలో ఏకత్వానికి శ్రీరాముడు ప్రతీక. మనం ఏదైనా ఒకపని చేయాలనుకుంటే రాముడి తలచుకుంటాం, ఆయన నుంచి ప్రేరణ పొందుతాం. అదే రాముడి విశిష్టత.

పరస్పర ప్రేమ, సోదరభావంతో అందరూ కలిసి శ్రీరాముడి మందిరాన్ని ఇటుకా ఇటుకా పేర్చి నిర్మించాలి. రాముడి మందిరం భారతీయ సంస్కృతికి అద్దం పడుతుంది, మానవత్వానికి ఇది ప్రతీకగా నిలుస్తుంది. రాముడి కాలంలో సర్వజన సామరస్యం వెల్లి విరిసింది. దాన్ని నేడూ కొనసాగించాల్సిన అవసరం ఉంది. రాముడి రూపాన్ని మన హృదయాలను నుంచి తొలగించే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆయన మనలోనే ఉన్నారు" అన్నారు.

భారత ప్రజాస్వామ్యంపై ఇదో మచ్చ: పాకిస్తాన్

అయోధ్యలో చరిత్రాత్మక బాబ్రీ మసీదును కూల్చిన ప్రాంతంలో రామమందిర నిర్మాణాన్ని ఖండిస్తున్నామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఐదు శతాబ్దాల పాటు ఆ స్థలంలో బాబ్రీ మసీదు ఉందని పాకిస్తాన్ పేర్కొంది. భారత సుప్రీంకోర్టు ఇచ్చిన లోపభూయిష్టమైన తీర్పు.. న్యాయం కన్నా విశ్వాసాలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తోందని, భారత్‌లో పెరుగుతున్న ఆధిపత్యవాదానికి ఇది సంకేతమని వ్యాఖ్యానించింది. భారత్‌లో మైనారిటీలు.. ప్రత్యేకించి ముస్లింల ప్రార్థనా స్థలాలపై దాడులు పెరుగుతున్నాయని ఆరోపించింది.

"మసీదు ఉన్న ప్రదేశంలో మందిరాన్ని నిర్మించడం భారత ప్రజాస్వామ్యంపై భవిష్యత్‌లో ఓ మచ్చలా మిగిలిపోతుంది. బీజేపీ, దాని అతివాద అనుయాయ వర్గాల దాడిలో 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత దృశ్యాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ముస్లింల కళ్లముందు మెదులుతూనే ఉంటాయి. దీన్ని ఖండిస్తూ ఓఐసీ (ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్) అప్పటి నుంచి ఎన్నోసార్లు తీర్మానాలు చేసింది. హిందుత్వవాద బీజేపీ ప్రచారం చేసి, భారత్‌ను హిందుత్వ దేశంగా మార్చాలనే అజెండాలో భాగంగా నిర్మిస్తున్న దీని గురించి భావి తరాల ముస్లింలకు తెలుస్తూనే ఉంటుంది. అయోధ్యలో ఈరోజు జరిగిన క్రతువు ఈ దిశగా నిరంతరాయంగా జరుగుతున్న చర్యల్లో భాగమే" అని పాకిస్తాన్ వ్యాఖ్యానించింది.

ఓవైపు కోవిడ్‌-19 విజృంభిస్తున్న సమయంలో ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం హడావిడిగా నిర్ణయం తీసుకుంది. ముస్లింలను ఓటు హక్కు నుంచి దూరం చేసేందుకు పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీ లాంటివి తీసుకొచ్చారు. ప్రభుత్వం కనుసన్నల్లో దిల్లీలో ముస్లింల స్వేచ్ఛను ఓ పద్ధతి ప్రకారం హరించేందుకు ఈ ఏడాది ప్రారంభంలో ప్రయత్నాలు జరిగాయి. వీటన్నింటిని బట్టి భారత్‌లో ముస్లింలను ఏ స్థాయిలో హింసించి, భయపెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలి

జమ్మూ, కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన వ్యవస్థీకృతంగా జరుగుతోంది. ఈ ప్రాంతపు భౌగోళిక స్వరూపాన్ని మార్చడానికి బీజేపీ కుట్రపూరితంగా ప్రయత్నిస్తోంది. ఇవన్నీ దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న విభజనవాద భావజాలానికి ప్రతీకలని చెప్పక తప్పదు. ఈ విధానాల కారణంగా దేశంలో శాంతి సామరస్యాలకు, ప్రాంతీయ సృహృద్భావానికి పెనుముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది.

2002నాటి గుజరాత్‌ మారణహోమం కావచ్చు, 2020లో దిల్లీ అల్లర్లు కావచ్చు, ముస్లింల ప్రార్థనా స్థలాల్లో అశాంతి రగిలించడానికి ఆర్ఎస్ఎస్‌, బీజేపీలు సంయుక్తంగా, వ్యవస్థీకృతంగా కుట్రలు పన్నుతున్నాయనడానికి ఈ సంఘటనలే నిదర్శనం.

కోవిడ్‌ మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న ఈ సమయంలో కూడా ముస్లింల ప్రార్థనా మందిరాలపై హిందుత్వ అతివాదుల దాడులు కొనసాగుతున్నాయి. కోవిడ్‌ వ్యాప్తికి ముస్లింలే కారణమని ఆరోపిస్తూ, వారి మత స్వేచ్ఛను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ముస్లింలను రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారు.

భారత్‌లో మైనారిటీల రక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని పాకిస్తాన్‌ కోరుతోంది. ముస్లింలు, వారి ప్రార్థనా మందిరాల రక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతోంది.

హిందుత్వ ప్రభుత్వ హయాంలో భారత్‌లోని ముస్లింలకు చెందిన హెరిటేజ్‌ సైట్లపై దాడులు జరిగే ప్రమాదం ఉన్నందున అంతర్జాతీయ సమాజం దీనిపై కల్పించుకుని వాటి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్తాన్‌ విజ్ఞప్తి చేస్తోంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)