You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు: ఈడీ విచారణకు హాజరైన రియా చక్రవర్తి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి శుక్రవారం ముంబయిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
సుప్రీంకోర్టులో విచారణ తరువాత తన వాంగ్మూలం నమోదు చేయాలన్న ఆమె అభ్యర్థనను ఈడీ అంగీకరించలేదు.
కేసు నమోదు చేసిన సీబీఐ
కాగా ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తి, ఆమె తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, సంధ్యా చక్రవర్తి, షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరాండా, శృతి మోదీ, ఇంకొందరిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), 502 (క్రిమినల్ బెదిరింపు), 120-బీ (నేరపూరిత కుట్ర)లతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద సీబీఐ వీరిపై కేసు నమోదు చేసింది.
బిహార్ ప్రభుత్వ విజ్ఞప్తి, తర్వాత కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ఆధారంగా ఈ కేసు విచారణను సీబీఐ చేపట్టింది. పట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో జులై 25న నమోదైన ఎఫ్ఐఆర్‌ను విచారణకు తీసుకుంది. ఆరుగురు నిందితులు, మరికొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది.
అంతకు ముందు, హిందీ సినీనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ విచారణ జరపాలన్న బిహార్ ప్రభుత్వ అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
బిహార్ పోలీసుల విచారణను సవాలు చేస్తూ సినీ నటి రియా చక్రవర్తి వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ సమాచారాన్ని సుప్రీం కోర్టుకు తెలియజేశారు.
సుశాంత్ మరణం కేసు విచారణ ముంబయిలో జరపాలని రియా చక్రవర్తి తన పిటిషన్‌లో అభ్యర్థించారు.
కొద్ది రోజుల క్రితం సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ పట్నా పోలీసు స్టేషన్‌లో రియాకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఆమెపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. సుశాంత్ సింగ్ నుంచి రియా డబ్బులు తీసుకున్నారని, ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారని కేకే సింగ్ ఫిర్యాదు చేశారు.
జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన ఫ్లాట్‌లో ప్రాణాలు లేకుండా కనిపించారు. ముంబయి పోలీసులు దీన్ని ఆత్మహత్య కేసుగా భావిస్తూ, విచారణ చేపట్టారు.
రియా చక్రవర్తీతో సహా హిందీ సినీరంగానికి చెందిన కొందరు ప్రముఖులను ముంబయి పోలీసులు ఈ కేసు విషయమై ప్రశ్నించారు. మహేశ్ భట్, సంజయ్ లీలా భన్సాలీ వంటి వారు కూడా ఇందులో ఉన్నారు.
సుశాంత్ సింగ్ మరణం విషయమై విచారణను సీబీఐకి అప్పగించాలని మంగళవారమే కేంద్రాన్ని బిహార్ ప్రభుత్వం అభ్యర్థించింది.
మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇదివరకు సీబీఐ విచారణ జరపాలన్న డిమాండును తోసిపుచ్చింది.
కోర్టులో ఏం జరిగింది?
రియా వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టులో జస్టిస్ రాయ్ విచారిస్తున్నారు.
ఒక ప్రతిభావంతుడైన నటుడి మరణం దురదృష్టకరమని, ఈ కేసుపై అందరి దృష్టీ ఉందని జస్టిస్ రాయ్ అన్నారు.
కోర్టు ఈ కేసు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటోందని వ్యాఖ్యానించారు.
ఈ కేసులో ప్రొఫెషనల్‌గా నడుచుకున్నామంటూ ముంబయి పోలీసులు కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు.
బిహార్ పోలీసు అధికారిని ముంబయి పోలీసులు క్వారంటీన్‌లో పెట్టడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు మంచి సంకేతాలు ఇవ్వవని వ్యాఖ్యానించింది.
రియా చక్రవర్తి తరఫు న్యాయవాది ఎఫ్‌ఐఆర్ ముంబయికి బదిలీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. కేకే సింగ్ తరఫు న్యాయవాది మాత్రం దీన్ని వ్యతిరేకించారు. ముంబయి పోలీసులను బిహార్ పోలీసులకు సహకరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు.
ఈ కేసులో ఒక్కో పక్షం ఒక్కో రాష్ట్రంలో విచారణను కోరుకుంటోందని, సాక్ష్యాధారాలకు నష్టం కలగకూడదని కేంద్రం భావిస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు.
వాస్తవాలు బయటకు రావడం అందరికీ ప్రయోజనకరమేనని జస్టిస్ రాయ్ అన్నారు. ఈ పిటిషన్‌లో అన్ని పక్షాలూ మూడు రోజుల్లోగా తమ తమ స్పందనలు తెలియజేయాలని ఆదేశించారు.
విచారణను ఒక వారం పాటు వాయిదా వేశారు.
ముంబయి, బిహార్ పోలీసుల మధ్య వివాదం
సుశాంత్ సింగ్ మరణం కేసు విచారణ విషయమై ముంబయి పోలీసులు, బిహార్ పోలీసుల మధ్య వివాదం నడుస్తోంది. రెండు పక్షాలూ పరస్పరం నిందించుకున్నాయి.
ఈ కేసు విచారణ కోసం ముంబయి వచ్చిన బిహార్ సీనియర్ పోలీసు అధికారి వినయ్ తివారీని అధికారులు క్వారంటీన్‌కు పంపించారు. దీనిపై బిహార్ పోలీసు డీజీపీ గుప్తేశ్వర్ పాండే అభ్యంతరం వ్యక్తం చేశారు.
ముంబయి పోలీసులు సరైన రీతిలో విచారణ జరపట్లేదని సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. సుశాంత్ ప్రాణాలకు ప్రమాదం ఉన్నట్లు ఫిబ్రవరిలోనే తాము ముంబయి పోలీసుల దృష్టికి తీసుకువెళ్లానని ఆయన తండ్రి కేకే సింగ్ అన్నారు.
కానీ, సుశాంత్ సోదరీమణులు వాట్సాప్ ద్వారా ఓ ముంబయి పోలీస్ అధికారికి సమాచారం ఇచ్చారని, రాతపూర్వకంగా వారు ఫిర్యాదు చేయలేదని ముంబయి పోలీసు విభాగం తెలిపింది.
రాతపూర్వక ఫిర్యాదు లేకుండా విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది.
సుశాంత్ సింగ్ మరణం విషయంలో సీబీఐ విచారణ జరపాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అభ్యర్థిస్తూ కొన్ని రోజుల క్రితం రియా చక్రవర్తి ట్వీట్ కూడా చేశారు.
ఇవి కూడా చదవండి:
- అయోధ్యలో రామమందిరం కింద టైమ్ కాప్స్యూల్?.. అందులో దాగిన రహస్యమేంటి
- విశాఖపట్నం హిందుస్తాన్ షిప్‌యార్డులో కుప్పకూలిన క్రేన్.. 11 మంది మృతి
- అమెరికా దారిలోనే బ్రిటన్... చైనాపై కఠిన చర్యలకు సిద్ధం
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- విశాఖపట్నం హిందుస్తాన్ షిప్‌యార్డులో కుప్పకూలిన క్రేన్.. 11 మంది మృతి
- రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మృతి
- మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి
- కరోనా విపత్తు బొగ్గు పరిశ్రమను అంతమొందిస్తుందా
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు
- ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్‌లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
- ర్యాట్ హోల్ మైనింగ్: బొగ్గుగనిలో చిక్కుకున్న కార్మికులు.. కాపాడడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)