You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పైడికొండల మాణిక్యాల రావు: మాజీ మంత్రి, బీజేపీ నేత మృతి
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కన్నుమూశారు. కొద్దికాలం కింట ఆయన కరోనావైరస్ బారిన పడ్డారు.
అనంతరం ఆయన కోలుకున్నట్లు ప్రకటించారు. అయితే, చనిపోయే సమయానికి కాలేయ సంబంధిత సమస్యలతో విజయవాడలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
శనివారం మధ్యాహ్నం ఒంటి గంటల సమయంలో ఆయన మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
మాణిక్యాలరావు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం. 1961 నవంబరు 1న జన్మించిన ఆయన గత ప్రభుత్వంలో దేవాదాయ ధర్మాదాయ మంత్రిగా పనిచేశారు.
2014 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థఇగా 14వేల ఓట్లతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.
సుమారు మూడున్నరేళ్లు చంద్రబాబునాయుడు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. టీడీపీ, బీజేపీ మధ్య విభేదాల కారణంగా రెండు పార్టీల మధ్య పొత్తు ముగియడంతో బీజేపీ చంద్రబాబు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేయడంతో 2018లో మాణిక్యాల రావు తన పదవికి రాజీనామా చేశారు.
మాణిక్యాలరావు ఆర్ఎస్ఎస్, బీజేపీల్లో సుదీర్ఘకాలం పనిచేశారు. వివిధ పదవులు నిర్వహించారు. జాతీయ స్థాయిలో బీజేపీ అగ్ర నేతలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి.
తాడేపల్లిగూడెంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన ఆయన ఆర్ఎస్ఎస్‌లో స్వయంసేవక్‌గా తన ప్రస్థానం ప్రారంభించారు. ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్‌లోనూ సేవలందించారు.
1989లో బీజేపీ పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. అనంతరం ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.
ప్రముఖుల సంతాపం
మాణిక్యాలరావు మృతిపై పలువురు సీనియర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు సంతాపం ప్రకటించారు.
ఆయన మృతి పార్టీకి తీరని లోటని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మాణిక్యాలరావు కుటుంబానికి సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా మాణిక్యాలరావు మృతికి సంతాపం తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరపాలని ఆదేశించారు. తాడేపల్లి గూడెంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఒకప్పటి తన మంత్రివర్గ సహచరుడి మృతిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా సంతాపం తెలిపారు.
అర్చకుల సమస్యల పరిష్కారంతో పాటు దేవాదాయ శాఖలో సమస్యలపై ఆయన చిత్తశుద్ధితో పనిచేశారని చంద్రబాబు కొనియాడారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖపట్నం హిందుస్తాన్ షిప్‌యార్డులో కుప్పకూలిన క్రేన్.. 11 మంది మృతి
- భోపాల్ నవాబు పాకిస్తాన్ ప్రధాని పదవి చేపట్టబోయారా?
- తిలక్-జిన్నా... హిందూ-ముస్లిం ఐక్యతకు సూత్రధారులు
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- భారత్‌లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
- ర్యాట్ హోల్ మైనింగ్: బొగ్గుగనిలో చిక్కుకున్న కార్మికులు.. కాపాడడం సాధ్యమేనా?
- అబ్ఖాజియా: ఇదో అజ్ఞాత దేశం.. దీనిని భారత్ ఇప్పటికీ గుర్తించలేదు
- బ్రిటన్ నల్లమందు వ్యాపారం భారతీయులను పేదరికంలోకి ఎలా నెట్టింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)