కరోనావైరస్ వ్యాప్తి ఎప్పుడు ఆగుతుందో 'సెరో సర్వేలెన్స్' సర్వేతో తెలుసుకోవచ్చా?

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఏదైనా అంటువ్యాధి ప్రబలినప్పుడు దాని తీవ్రతను అంచనా వేయడానికి సెరో సర్వేలెన్స్ విధానాన్ని వాడతారు. దీని సాయంతో ఓ ప్రాంతంలో ఏ మేరకు వ్యాధి వ్యాపించిందో తెలుసుకోవచ్చు.

జనాభాలో ఉండే రోగ నిరోధక శక్తిని అంచనా వేయడానికి సెరో సర్వేలెన్స్‌ను అత్యున్నత ప్రమాణంగా భావిస్తారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది.

అత్యవసర ఆరోగ్య పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు ఈ సెరో సర్వేలెన్స్‌నే ఉపయోగిస్తుంటాయి.

భారత్‌లో ఇప్పటికే దిల్లీ, అహ్మదాబాద్, ముంబయి లాంటి నగరాల్లో ఈ సర్వేలను నిర్వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలో ఈ సర్వేను నిర్వహించాలనే ప్రతిపాదనలు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.

కోవిడ్-19 కేసులు దేశ వ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేసులను త్వరగా గుర్తించడం, పరీక్షల నిర్వహణ, రోగులను ట్రేస్ చేయడానికి ఇలాంటి శాస్త్రీయ పర్యవేక్షణ విధానాలు ఉపయోగపడతాయని ఐసీఎంఆర్ పేర్కొంది.

సెరో సర్వేలెన్స్ అంటే ఏమిటి?

ఏదైనా ఇన్ఫెక్షన్ బారిన పడిన వారిలో కనిపించే యాంటీబాడీల స్థాయిని సెరోలాజికల్ సర్వే ద్వారా అంచనా వేస్తారని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ జీవీఎస్ మూర్తి వివరించారు.

కోవిడ్-19 వ్యాప్తిపై అంచనాల కోసం సెరో ఎపిడెమియాలాజికల్ పరీక్షలు నిర్వహించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఓ ప్రోటోకాల్‌ను సిద్ధంచేసింది.

సెరోలాజికల్ సర్వేలో భాగంగా ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించి, ఆ నమూనాల ఆధారంగా శరీరంలోని యాంటీబాడీల స్థాయిని గుర్తిస్తారని మూర్తి చెప్పారు.

ర్యాండమ్‌గా ఎంపిక చేసుకున్న గృహ సముదాయాలకు వెళ్లి వారి అనుమతితో అవసరమైన సమాచారాన్ని సేకరిస్తారని పేర్కొన్నారు.

ఏదైనా ఇన్ఫెక్షన్‌తో పోరాడేందుకు మన శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. కోవిడ్-19 సోకినప్పటికీ ఎలాంటి లక్షణాలు కనిపించకుండా సహజంగా కోలుకున్న వారి శరీరంలో ఉండే యాంటీబాడీల స్థాయిని తెలుసుకోవడమే ఈ సెరో సర్వేలెన్స్ లక్ష్యమని పబ్లిక్ హెల్త్ అండ్ న్యూట్రిషన్‌లో పరిశోధన చేస్తున్న డాక్టర్ శుభశ్రీ రే చెప్పారు.

ముఖ్యంగా ఒక కంటైన్మెంట్ జోన్‌లో నివసించే కుటుంబంలో ఒక వ్యక్తి కరోనావైరస్ బారిన పడిన తర్వాత కుటుంబంలో మిగిలిన వారెవరికీ అది సోకకపోతే వారికి ఈ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

“ఒక వేళ శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయంటే, ఇన్ఫెక్షన్ సోకి సహజంగా కోలుకున్నట్లు భావించవచ్చు”.

దేశ జనాభాలో ఎంత శాతం మంది వైరస్‌ బారినపడ్డారో అర్ధం చేసుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని ఆమె అన్నారు.

కోవిడ్-19 బారిన పడిన వారిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే కోలుకుంటున్నవారు 5 నుంచి 80 శాతం వరకూ ఉంటున్నట్లు డబ్ల్యూహెచ్‌వో, చైనా సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక తెలిపింది.

ఈ సర్వేతో ఎంత మంది ప్రజలు వైరస్‌కు గురయ్యారో అర్ధం చేసుకుని, వైరస్‌ వ్యాప్తి ఎప్పటికి ముగుస్తుందో అంచనా వేయడానికి వీలవుతుందని డాక్టర్ మూర్తి తెలిపారు.

ముఖ్యంగా వ్యాక్సీన్ ఏ ప్రాంతంలో ముందు ఇవ్వాలో అర్ధమవుతుందని, స్వతంత్ర పరిశోధకులు, ఒక ప్రైవేట్ సంస్థలో బయో టెక్నాలజిస్ట్‌గా పని చేస్తున్న రవి నత్వాని చెప్పారు.

ఈ పర్యవేక్షణ ద్వారా అందుబాటులోకి వచ్చిన సమాచారంతో జిల్లా స్థాయిలో లాక్‌డౌన్‌పై వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవచ్చని ఐసీఎంఆర్ పేర్కొంది.

శాంప్లింగ్ ఎలా చేస్తారు?

సెరో సర్వేలెన్స్ శాంప్లింగ్ విధానాన్ని డాక్టర్ మూర్తి బీబీసీకి వివరించారు.

‘‘జనాభాలో కొంత మందిని రాండమ్‌గా ఎంచుకొని ఈ పరీక్షలు నిర్వహిస్తారు. జనాభాలో వైరస్ వ్యాపించిన స్థాయికి అనుగుణంగా ఈ శాంపిల్ ని సేకరిస్తారు’’.

భార‌త్‌లో తొలిసారి నిర్వహించిన సర్వేలో జనాభాలో 1 శాతం మంది మాత్రమే ఇన్ఫెక్షన్‌కు గురైనట్లు తెలిసింది.

‘‘జిల్లాలను నాలుగు విధాలుగా వర్గీకరిస్తారు. కోవిడ్-19 కేసులు నమోదు కాని జిల్లాలు (జీరో కేసులు), ప్రతి పది లక్షల జనాభాకు 0. 1 నుంచి 4. 7 శాతం మధ్యలో కేసులు నమోదైన జిల్లాలు (తక్కువ ముప్పు), 4. 8 నుంచి 10 శాతం మధ్యలో ఉండే జిల్లాలు (మధ్య స్థాయి ముప్పు) 10 కంటే ఎక్కువ ఉండేవి( హై రిస్క్)గా విభజిస్తారు. ఈ సమాచారాన్ని ఐసీఎంఆర్ ల్యాబ్ రిపోర్టింగ్ పోర్టల్ నుంచి సేకరిస్తారు.’’

ప్రతి విభాగం నుంచి 15 జిల్లాలను ఎంచుకుని మొత్తం 60 జిల్లాల్లో నమూనాలు సేకరిస్తారు. మొత్తం నమూనాలు 6,000 కంటే ఎక్కువే ఉంటాయి.

కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యే హాట్‌స్పాట్ నగరాలను వేరే విభాగంగా గుర్తిస్తారు. ఈ ప్రాంతాల నుంచి ర్యాండమ్‌గా 500 మందిని ఎంచుకుని శాంప్లింగ్ నిర్వహిస్తారు.

ఇందులో 18 సంవత్సరాలు పైనున్న వ్యక్తులనే తీసుకుంటారు.

ఈ సర్వేతో ఉపయోగం ఏమిటి?

కోవిడ్-19 బారిన పడి కోలుకున్న వారి సమాచారాన్ని ఈ సర్వేతో తెలుసుకోవచ్చని డాక్టర్ మూర్తి చెప్పారు.

ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తి ఎంత వరకు వ్యాపించింది? ఏయే వయసుల వారు దీని బారిన పడ్డారో తెలుసుకునే వీలు కూడా కలుగుతుందని ఆయన అన్నారు.

“ఈ సర్వేతో హెర్డ్ ఇమ్యూనిటికి సంబంధించిన సమాచారం కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు వైరస్ బారిన పడినవారిని తెలుసుకోవడం ద్వారా ఇంకా ఇది ఎంత మందికి వ్యాప్తి చెందే అవకాశం ఉందో అంచనా వేయొచ్చు”.

కోవిడ్-19 నియంత్రణకు అనుసరిస్తున్న చర్యలతో పాటు సెరో సర్వేలెన్స్‌ను కూడా చేపడితే వైరస్ వ్యాప్తి నియంత్రణకు సహాయపడుతుందని ఆయన అన్నారు.

ఈ సర్వేలెన్స్ విధానాన్ని కోవిడ్-19 వ్యాప్తి నియంత్రణలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ అభిప్రాయంతో పబ్లిక్ హెల్త్ నిపుణుడు, ఏపీ సీఎం మాజీ అదనపు కార్యదర్శి పి వి రమేష్ ఏకీభవించారు.

ఈ సెరో సర్వేలెన్స్ ఇన్ఫెక్షన్ మొదలైన తొలి దశలో కానీ లేదా ఇన్ఫెక్షన్ అంతమవుతున్న దశలో కానీ చేయాలి కానీ, ఇది సరైన సమయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కీలక సమయంలో విలువైన నిధులు, మానవ వనరులను వైరస్ నియంత్రణకు వాడాలి కానీ, సర్వేలకు కాదనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

సెరో సర్వేలెన్స్ ని ఎక్కడెక్కడ చేపట్టారు?

ఫిన్లాండ్, అమెరికాలలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా, ఫ్రాన్స్, జర్మనీలలో ఎలిసా ఆధారిత రక్త పరీక్షలు చేపట్టారు.

భారత్‌లో దిల్లీ , అహ్మదాబాద్, ముంబయి లాంటి నగరాలతో పాటు మరి కొన్ని ప్రాంతాలలో నిర్వహించారు.

దిల్లీలో 22. 86 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు. దిల్లీలో ప్రతి రోజు నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

“ఈ వైరస్‌తో పోరాడేందుకు మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఎలా మార్పు చెందుతుందో ఇంకా ఎవరికీ తెలియదు. వైరస్ వ్యాప్తికి త్వరగా కళ్లెం పడాలనే ఆశతోనే ఎదురు చూడాల్సిన పరిస్థితి నేడు వచ్చింది”అని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కె శ్రీనాథ్ రెడ్డి ఒక వ్యాసంలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)