కరోనావైరస్: భారత్‌లో కోవిడ్ సామాజిక వ్యాప్తి లేదా? అధికారులు ఎందుకలా చెబుతున్నారు?

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నప్పటికీ, దేశంలో కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ అంటే సామాజిక వ్యాప్తి జరగలేదని భారత్ గట్టిగా వాదిస్తోంది.

“భారత్ లాంటి పెద్ద దేశంలో వైరస్ ప్రాబల్యం చాలా తక్కువగా ఉందని” ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) చీఫ్ బలరాం భార్గవ చెప్పారు.

భారత్‌లో కోవిడ్-19 వ్యాప్తిని గుర్తించే సర్వే గురించి గురువారం జరిగిన ఒక మీడియా సమావేశంలో భార్గవ మాట్లాడారు.

భారత్‌లో 2,97,535 కేసులు నమోదయ్యాయి. ఇది ప్రపంచంలో నాలుగో అత్యధికం.

భార్గవ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేసులు ఇంత ఎక్కువగా పెరుగుతున్నప్పుడు, ప్రభుత్వం కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరగడం లేదని ఎందుకు చెబుతోందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ వాదన ఏంటి?

సాధారణంగా వైరస్ వచ్చిన ఒక వ్యక్తికి, మరో కరోనా పాజిటివ్‌తోగానీ, కరోనాకు తీవ్రంగా ప్రభావితమైన దేశం నుంచి వచ్చినవారితోగానీ ఉన్న కాంటాక్ట్స్ గురించి తెలుసుకోలేని స్థితిలో దానిని కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌గా అంగీకరిస్తారు. అంటే, వైరస్ సమాజంలో స్వేచ్ఛగా వ్యాపిస్తుంటుంది.

అయితే, దీనికి సంబంధించి అధికారికంగా అంగీకరించిన నిర్వచనం ఏదీ లేదని భారత్ చెబుతోంది.

కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ను ఎలా ఎదుర్కోవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ అది ఎలా ఉంటుంది అనేదానిపై వారి నిర్వచనం అస్పష్టంగా ఉంది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశంలో దాదాపు 0.3 నుంచి 0.4 శాతం జనాభాకు పరీక్షలు చేశారని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ జాకబ్ జాన్ బీబీసీతో చెప్పారు.

“నా దృష్టిలో భారత్‌లో ఇప్పుడు రెండు దేశాలు ఉన్నాయి. 40 లక్షలు లేదా 0.4 శాతం పరీక్షలు చేయించుకున్నవారు, మిగతావారు. ఆ విధంగా చూస్తే దేశంలోని 99.6 శాతం మందికి కరోనా సోకలేదని ప్రభుత్వం చెబుతోంది. అంటే దేశంలో వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉంది.

అంటే, అంత తక్కువ రేటు ఉన్నప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ అనేది జరగదు.

“కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరుగుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు వస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా అధికారులు దాన్ని అలా పిలవలేరు” అని డాక్టర్ జాన్ చెప్పారు.

దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్, దేశ రాజధానిలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ఉందనే విషయాన్ని అంగీకరించారు. కానీ దానిని కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌గా ప్రకటించడం కేంద్రం చేతుల్లో ఉందని చెప్పారు.

“ఈ మాట చుట్టూ తీవ్రమైన చర్చ జరుగుతోంది. డబ్ల్యుహెచ్ఓ కూడా దీనిని నిర్వచించలేదు. మేం కచ్చితంగా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌లో లేము. అది ఒక పదం మాత్రమే” అని భార్గవ చెప్పారు.

ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తోంది.

కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ అంటే ఏంటో నిజం తెలుసుకోడానికి చర్చలు జరిపే సమయం ఇది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇది దేశీయంగా వ్యాపిస్తోంది. మొదట ఈ మహమ్మారి బయటి నుంచి దేశంలోకి చేరింది. తర్వాత అది భారత్‌లో మహమ్మారిగా మారింది. ఇప్పుడు జరుగుతోంది అదే అని డాక్టర్ జాన్ అన్నారు.

“ఇక్కడ ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తోంది. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌‌కు అసలైన నిర్వచనం అదే. దానికి మూలం ఏంటి అనేది ఇప్పుడు ముఖ్యం కాదు. ఇది నిజంగా ఒక దేశీయ మహమ్మారి. ఇది సమాజంలో వ్యాపిస్తోంది. అంటే, నా నిర్వచనం ప్రకారం సామాజిక వ్యాప్తి జరుగుతోంది" అని ఆయన స్పష్టం చేశారు.

“83 జిల్లాల్లో ఒక శాతం కంటే తక్కువగా 0.73 శాతం కేసులు గతంలో ధ్రువీకరించిన కేసులకు బహిర్గతం అయినట్లు ఆధారాలు ఉన్నట్లు ఐసీఎంఆర్ గణాంకాలు చెబుతున్నాయి. సామాజిక వ్యాప్తి కాకపోతే అవి ఎలా బయటపడ్డాయి” అని కూడా జాన్ ప్రశ్నించారు.

“అంటే కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ మొదటి దశలోనే ఉంది. ఆ పేరు చెప్పకుండానే వారే స్వయంగా దానిని అంగీకరించారు” అన్నారు.

మరికొందరు కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ను తిరస్కరించడం వల్ల ప్రమాదకరమైన సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

“మనకు దాదాపు 3 లక్షల కేసులు నమోదయ్యాయి. 10 వేల మరణాలకు చేరువ అవుతున్నాం. ఇలాంటి అబద్ధాల వల్ల జీవితాలు కోల్పోవాల్సి వస్తుంది” అని సీనియర్ హెల్త్ రిపోర్టర్ విద్యా కృష్ణన్ ట్వీట్ చేశారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)