You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: ఇదే చివరి మహమ్మారి కాదా? భవిష్యత్తులో జంతువుల నుంచి మరిన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయా?
- రచయిత, విక్టోరియా గిల్
- హోదా, బీబీసీ సైన్స్ కరస్పాండెంట్
ప్రపంచ వ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు అత్యంత వేగంగా వ్యాప్తి చెందేందుకు వీలుగా ఒక దుర్భరమైన వాతావరణాన్ని మనమే సృష్టించామని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. మనిషి ప్రకృతిని దోచుకోవడం ఎక్కువ కావడంతో ఈ పరిస్థితి మరింత వేగంగా దాపురిస్తోంది.
కొత్త కొత్త వ్యాధులు ఎక్కడ నుంచి ఎలా పుట్టుకొస్తున్నాయన్న అంశంపై వైద్య నిపుణులు చేస్తున్న అధ్యయనాల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వారు తమ పరిశోధనల్లో భాగంగా ఒక నమూనా గుర్తింపు వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఈ వ్యవస్థ ద్వారా వన్య ప్రాణుల ద్వారా మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైనది ఏది అన్న విషయాన్ని ముందుగానే ఊహించవచ్చు.
భవిష్యత్తులో తలెత్తబోయే మహమ్మారులను ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా జరుగుతున్న ఈ పరిశోధనకు బ్రిటన్‌లోని లివర్ పూల్ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నాయకత్వం వహిస్తున్నారు.
‘ఐదు ప్రమాదాలను ఎదుర్కొన్నాం.. ఇది ఆరవది’
“గత 20 ఏళ్లలో సార్స్, మెర్స్, ఎబోలా, ఎవియన్ ఇన్ఫ్లుయెంజా, స్వైన్ ఫ్లూ, ఇప్పుడు కోవిడ్-19 ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు తీవ్రమైన ముప్పుల్ని మనం ఎదుర్కోవాల్సి వచ్చింది” అని లివర్ పూల్ విశ్వ విద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మాథ్యూ బెలిస్ బీబీసీతో అన్నారు.
“ఇప్పటి వరకు మనం ఐదు బుల్లెట్లను ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఇది ఆరవది. అలాగని ఇదే చివరి మహమ్మారి కూడా కాదు. అందుకే ఇకపై మనం వన్య ప్రాణులకు సంబంధించిన వ్యాధుల విషయంలో మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది” అని ప్రొఫెసర్ మాథ్యూ అభిప్రాయపడ్డారు.
అందులా భాగంగా మరింత నిశితంగా పరిశోధిస్తున్నారు. తాజాగా ఆయన, ఆయన సహచరులు కలిసి ఊహజనిత నమూనా గుర్తింపు వ్యవస్థను రూపొందించారు. మనకు తెలిసిన అన్ని రకాల వన్య ప్రాణుల వ్యాధుల విస్తృతమైన డేటా బేస్‌ను ఈ వ్యవస్థ సమగ్రంగా అధ్యయనం చేస్తుంది.
ఇప్పటి వరకు సైన్స్‌కి తెలిసిన వేలాది బ్యాక్టీరియా, పారాసైట్స్, వైరస్‌లు, ఏ జాతికి చెందిన జీవులకు ఎంత సంఖ్యలో ఎలా సంక్రమించాయన్న అంశానికి సంబంధించిన ఆధారాలను ఈ వ్యవస్థ గుర్తిస్తుంది.
ముందుగా వ్యాధి కారకాలను గుర్తించగల్గినట్లయితే, అవి పరిశోధనల్ని సరైన దిశలో నడిపిస్తాయి. తద్వారా ఎటువంటి మహమ్మారి విషయంలో అయినా అది తలెత్తక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స విధానాలను కనుగొనేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
“మొత్తంగా ఏ వ్యాధులు మహమ్మారికి కారణమవుతాయో తెలుసుకోవడంలో ఇది మరొక దశ. అయితే ఇంకా మేం మొదటి అడుగులోనే ఉన్నాం” అని ప్రొఫెసర్ మాథ్యూ అన్నారు.
లాక్ డౌన్ నేర్పిన పాఠాలు
మన వ్యవహరశైలే ఈ పరిస్థితులకు కారణం అనడాన్ని చాలా మంది శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. అడవుల నరికివేత, అటవీ ఆక్రమణల కారణంగా జంతువుల నుంచి మనుషులకు తరచుగా వ్యాధులు సంక్రమిస్తున్నాయి.
“మనిషి పర్యావరణాన్ని పూర్తిగా మార్చేశాడు. వ్యవసాయం, మొక్కలు నాటడాన్ని మర్చిపోతున్నాడు. ఫలితంగా జీవ వైవిధ్యం కరువయ్యింది. దీంతో మనుషులకు రక రకాల వ్యాధుల భయం ఎక్కువయ్యింది” అని లండన్‌లోని యూనివర్శిటీ కాలేజ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ కేట్ జోన్స్ అన్నారు.
“అన్ని వ్యాధుల విషయంలోనూ ఇలాగే జరగాలనేం లేదు” అని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఎలుకల వంటి జీవులు వ్యాధికారకాలను మోసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
కనుక జీవ వైవిద్యాన్ని కోల్పోవడం వల్ల మానవ-వన్య ప్రాణుల మధ్య సంబంధాన్ని పెంచే పరిస్థితులు తలెత్తవచ్చు. ఫలితంగా ప్రజలపై కొన్ని రకాల వైరస్‌లు, బ్యాక్టీరియా, పరాన్నజీవులు దాడి చేసే అవకాశం ఎక్కువ అవుతుంది.
మనుషులు-వన్య ప్రాణుల కార్యకలాపాలు ఎంతటి ప్రమాదకర పరిస్థితులకు కారణమవుతాయో గతంలో తలెత్తిన అనేక వ్యాధులు మనకు నిదర్శనంగా నిలిచాయి.
వాటిల్లో మొదటిది 1999లో మలేషియాలో తలెత్తిన నిఫా వైరస్. ఫ్రూట్ బ్యాట్ (ఓ రకమైన గబ్బిలం) ద్వారా వచ్చిన వైరస్ ఓ అడవిలో ఉన్న సువిశాలమైన పందుల పెంపక కేంద్రానికి వ్యాపించింది. పళ్ల చెట్లపై ఉండే ఫ్రూట్ బ్యాట్స్ సగం తిని వదిలేసిన పండ్లను కిందనున్న పందులు తిన్నాయి.
ఆ పందుల పెంపక కేంద్రంలో సుమారు 250 మందికి పైగా పని చేసే వారు. వారందరికీ ఆ వ్యాధి సోకింది. వారిలో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కరోనావైరస్ మరణాల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతానికి అది దాదాపు ఒక్క శాతం మాత్రమే ఉంది. కానీ నిఫా వైరస్ సోకిన వారిలో 45 నుంచి 75 శాతం మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
పరిశోధకులు ఎక్కడ వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందో నిరంతరం గమనిస్తూ ఉండాలని బ్రిటన్‌లోని లివర్ పూల్ విశ్వవిద్యాలయం, అలాగే నైరోబీలోని ఇంటర్నేషనల్ లైవ్ స్టాక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఎరిక్ ఫెవ్రి అభిప్రాయపడ్డారు.
అడవుల శివార్లలో ఉండే పెంపక కేంద్రాలు, జంతువుల క్రయ, విక్రయ కేంద్రాలు ఇవన్నీ జంతువుల నుంచి మానవులకు వ్యాధులు వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించే ప్రాంతాలు.
“మనం నిరంతరం ఆ ప్రాంతాలను గమనిస్తూ ఉండాలి. ఏదైనా అసాధారణ పరిస్థితులు అంటే ఒక్కసారిగా ఏదైనా వ్యాధి ప్రబలడం వంటివి జరిగితే అందుకు తగిన విధంగా ప్రతిస్పందించే వ్యవస్థలు ఉండాలి. ఏడాదికి సుమారు మూడు నుంచి నాలుగు సార్లు కొత్త కొత్త వ్యాధులు మనుషుల్లో పుట్టుకొస్తున్నాయి. కేవలం ఆసియాలోనో, లేదా ఆఫ్రికాలో మాత్రమే కాదు. అమెరికా, యూరప్ దేశాలలో కూడా” అని ప్రొఫెసర్ ఫెవ్రి అన్నారు.
కొత్తగా పుట్టుకొస్తున్న వ్యాధులపై ప్రస్తుతం కొనసాగుతున్న నిఘా చాలా ముఖ్యమైనదని మాథ్యూ బెలిస్ బీబీసీతో అన్నారు. మహమ్మారుల పుట్టుకకు అనువైన వాతావరణాన్ని మనమే సృష్టించామన్నది ఆయన వాదన.
ఫెవ్రి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “ప్రకృతితో మనం వ్యవహరించే తీరు కారణంగానే ఇదంతా జరుగుతోంది. మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? ఎలా ప్రతిస్పందిస్తున్నాం? అన్నది చాలా ముఖ్యం. ప్రకృతిపై మన ప్రభావం ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో చెప్పడానికి మనలో చాలా మందికి ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం ఒక గుణ పాఠం.
మనం తినే తిండి, మనం ఉపయోగించే వస్తువులు ఇలా అన్ని విషయాల్లోనూ ఫర్వాలేదులే అన్నట్లు వ్యవహరిస్తున్నాం. ప్రకృతి వనరుల్ని మనం ఎంత అతిగా వినియోగిస్తామో... అవతలి వ్యక్తులు డబ్బు కోసం అంతే అతిగా వాటిని వెలికి తీస్తుంటారు. కనుక మనం అతిగా వినియోగిస్తున్న సహజవనరుల గురించి దాని వల్ల పడే ప్రభావం గురించి అధికారంలో ఉన్న వాళ్లంతా ఆలోచించాలి” అని ప్రొఫెసర్ ఫెవ్రి అన్నారు.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి
- న్యూజీలాండ్‌లో 'జీరో' కరోనావైరస్ కేసులు ఎలా సాధ్యమయ్యాయి?
- భారత్ - చైనా ఉద్రిక్తతలు: లద్దాఖ్‌లో క్షణక్షణం... భయం భయం
- కరోనావైరస్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌తో మీ మీద అడుగడుగునా నిఘా పెడుతున్నారా?
- కరోనావైరస్: ‘హీరో’ల నిర్వచనాన్ని ఈ మహమ్మారి మార్చేస్తుందా?
- కరోనావైరస్ రోగులకు ఆక్సీమీటర్లు ఎందుకు ఇస్తున్నారు.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయి
- కరోనా లాక్డౌన్: సూర్యుడు కనిపించని చీకటి జీవితం ఎలా ఉంటుంది
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)