న్యూజీలాండ్: డ్యాన్స్ చేసిన ప్రధాని... వైరస్ కేసులు జీరో కావడంతో లాక్‌డౌన్ ఎత్తివేత

న్యూజీలాండ్‌లో కరోనావైరస్ యాక్టివ్ కేసులు ఒక్కటి కూడా లేకపోవడంతో ఆ దేశంలో ఇప్పటివరకు విధించుకున్న నియంత్రణలన్నీ ఎత్తివేయడానికి సిద్ధమవుతున్నారు.

దీని ప్రకారం భౌతిక దూరం పాటించడం, బహిరంగ ప్రదేశాలలో గుమిగూడడం వంటివాటిపై నిషేధం తొలగిస్తున్నారు.

అయితే, సరిహద్దులు మాత్రం మూసే ఉంచుతారు.

సుమారు రెండు వారాలుగా న్యూజీలాండ్‌లో కొత్తగా కరోనావైరస్ కేసులేవీ నమోదు కాలేదు.

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులేవీ లేవని అధికారులు తనకు చెప్పగానే తాను డ్యాన్స్ చేశానని ఆ దేశ ప్రధాని జసిందా ఆర్డెన్ విలేకరులతో అన్నారు.

సురక్షితమైన స్థితిలో ఉన్నప్పటికీ కోవిడ్ ముందు నాటి రోజుల మాదిరి జీవితాలు గడపడానికి ఏమంత సులభ మార్గాలు లేవని చెప్పారామె.

కోవిడ్‌ను ఎదుర్కోవడానికి చూపిన నిశ్చయబలం, ప్రత్యేక దృష్టి ఇప్పుడు ఆర్థిక పునర్నిర్మాణంపైనా చూపనున్నట్లు చెప్పారు.

‘‘ప్రస్తుతానికి యాక్టివ్ కేసులు లేనంత మాత్రాన పని పూర్తయిందని అనుకోలేం.. అయితే, కచ్చితంగా ఒక మైలు రాయి దాటామని మాత్రం చెప్పగలను.. ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకొంటున్నాను’’ అన్నారామె.

సుస్థిర ప్రయత్నం

న్యూజీలాండ్ మొదట మార్చి 25 నుంచి లాక్ డౌన్ అమలు చేసింది.

ఇందుకోసం నాలుగంచెల అప్రమత్తతా వ్యవస్థను ఏర్పాటుచేసింది.

నాలుగో అప్రమత్తతలో(మొదటి దశ) దాదాపు అన్ని వ్యాపారాలు, స్కూళ్లు అన్నీ మూతపడ్డాయి. ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు.

అలా అయిదు వారాలు నియంత్రించాక ఏప్రిల్ చివర్లో మూడో స్థాయి అప్రమత్తత(రెండో దశ)లోకి అడుగుపెట్టారు. నిత్యావసరాలు కాని దుకాణాలు కూడా కొన్ని తెరిచారు. రెస్టారెంట్లలో టేక్ అవేల వరకు అనుమతించారు.

అప్పటికి దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టనారంభించాయి. ఆ దశలో మే మధ్యలో రెండో స్థాయి అప్రమత్తతలోకి వచ్చారు.

జూన్ 22 నుంచి మొదటి స్థాయి అప్రమత్తత దశలోకి తేవాలనుకున్నప్పటికీ గత 17 రోజులుగా కొత్త కేసులు లేకపోవడంతో లెవల్ 1 ప్రకటించి లాక్ డౌన్ ఎత్తివేశారు.

లెవల్ 1లో నిబంధనల ప్రకారం స్కూళ్లు, కార్యాలయాలు అన్ని తెరచుకుంటాయి. వివాహాలు, అంతిమ సంస్కారాలు, ప్రజారవాణాపై ఉన్న నియంత్రణలన్నీ తొలగిపోతాయి.

భౌతిక దూరం పాటించాలన్న నియమం లేనప్పటికీ పాటిస్తే మంచిదన్నది ప్రభుత్వం మాట.

అయితే, బయటి దేశాల నుంచి వచ్చే న్యూజిలాండ్ ప్రజలు మాత్రం 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండక తప్పదు.

మళ్లీ కేసులు రావని చెప్పలేమని.. పూర్తిగా నిర్మూలన గురించి మాట్లాడలేమని, అయితే, ప్రయత్నం చేస్తున్నామని జెసిండా చెప్పారు.

ఫిబ్రవరి చివర్లో న్యూజీలాండ్‌లో తొలి కరోనా కేసు వెలుగుచూసినప్పటి నుంచి ఆ దేశంలో మొత్తం 1154 కేసులు నమోదు కాగా 22 మంది చనిపోయారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)