‘యోగా, సూర్య నమస్కారాలు క్రైస్తవానికి సరిపడవు.. ఒక క్రైస్తవుడి జీవితంలో యోగాకు స్థానం లేదు’ - గ్రీకు చర్చి

ఆసనాలు, సూర్య నమస్కారాలలాంటి యోగా ప్రక్రియలు క్రైస్తవానికి సరిపడవని, ఇవి తమ సంప్రదాయానికి విరుద్ధమని గ్రీక్‌ ఆర్ధడాక్స్‌ చర్చి ప్రకటించింది.

''ఒక క్రైస్తవుడి జీవితంలో యోగాకు స్థానం లేదు'' అని చర్చి కార్యనిర్వాహక మండలి ప్రకటించింది. కరోనా వైరస్‌ క్వారంటైన్‌లో ఒత్తిడిని తట్టుకోడానికి యోగా ఒక సాధనంగా పని చేస్తుందటూ గ్రీక్‌ మీడియాలో వార్తలు వస్తున్న సందర్భంలో ఆర్ధడాక్స్‌ చర్చి ఈ ప్రకటన చేసింది.

గతంలో కొన్ని ఇతర మతాలు కూడా యోగా తమకు సరిపడదని ప్రకటించాయి.

గ్రీసు దేశంలో ఆర్ధడాక్స్ చర్చికి ప్రజలపై మంచి పట్టుంది. 2017లో ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ విడుదల చేసిన రిపోర్టులో దేశంలోని 90%మంది ప్రజలు సంప్రదాయ క్రైస్తవులని వెల్లడించింది.

''అది(యోగా) హిందూ మతంలో ఒక భాగం. ఇది కేవలం ఎక్సర్‌సైజ్‌ ప్రక్రియ కాదు'' అని బుధవారంనాడు విడుదల చేసిన ప్రకటనలో చర్చి ప్రతినిధి హోలీ సైనాడ్‌ వెల్లడించారు.

యోగాపై మత పెద్దలెవరూ విమర్శలు చేయక పోయినా, ఆర్ధడాక్స్‌ చర్చి ప్రతినిధి హోలీ సైనాడ్‌ ఈ ప్రకటన విడుదల చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమైంది.

గ్రీక్‌ టీవీ ఛానల్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఒక చర్చి ఫాదర్‌ సైనాడ్‌ ప్రకటనను సమర్ధించారు. ''యోగా ప్రాక్టీస్‌ చేసిన వ్యక్తులతో మాకున్న అనుభవాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం'' అని ఫాదర్‌ మైఖెల్‌ కొన్‌స్టాన్‌టినిడిస్‌ వెల్లడించారు. ''యోగాతో అన్నీ సమకూరుతాయని ఎవరైనా భావిస్తే మాకూ సంతోషమే'' అన్నారాయన.

యోగాకు హిందూయిజం, బౌద్ధంతో సంబంధాలున్నాయి. 2,500 సంవత్సరాల కిందటి ప్రాచీన గ్రంథాలలో యోగ సాధన గురించి రాసి ఉంది. రానురాను అది అభివృద్ధి చెందిందని యోగా చరిత్ర మీద అధ్యయనం చేస్తున్న డాక్టర్ మార్క్‌ సింగ్లెటాన్‌ అన్నారు.

ఇటీవలి దశాబ్దాలలో యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇదొక పరిశ్రమగా మారింది.

ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు, మానసిక ఆరోగ్యానికి, శారీరక పుష్టికి యోగా బాగా ఉపకరిస్తుందని ప్రపంచంవ్యాప్తంగా నమ్ముతున్నారు.

కోవిడ్‌-19 ప్రబలిన తరుణంలో ఒత్తిడి నుంచి బైటపడటనికి యోగసాధన చేయాల్సిందిగా చాలా దేశాలు తమ ప్రజలకు సూచించాయి.

మార్చిలోనే లాక్‌డౌన్‌ విధించడం వల్ల గ్రీసు దేశం మిగిలిన యూరోపియన్‌ దేశాలకంటే సమర్ధవంతంగా కోవిడ్‌-19 వైరస్‌ను అడ్డుకోగలిగింది. కోటీ 10లక్షలమంది జనాభా ఉన్న ఆ దేశంలో ఇప్పటి వరకు కేవలం 3,000 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 180మంది చనిపోయారు.

హోలీ కమ్యూనియన్‌ సందర్బంగా ప్రార్ధనకు హాజరైన వారు ఒకరికి ఒకరు కప్పులు మార్చుకునే విధానాన్ని సమర్ధించినందుకు ఆర్ధడాక్స్‌ చర్చి మీద విమర్శలు చెలరేగాయి. దీనివల్ల వైరస్‌ వ్యాపించదని చర్చి ప్రకటించింది.

ఇతర మతాలు ఏమంటున్నాయి?

యోగాను వ్యతిరేకిస్తున్నది ఒక్కగ్రీక్‌ ఆర్ధడాక్స్‌ చర్చి మాత్రమే కాదు. ఇంగ్లాండ్‌లోని డేవాన్ అనే చర్చి, యోగా క్లాసులను నిషేధించింది. ''ఇది తూర్పు ప్రాంతం నుంచి వచ్చిన ఆధ్యాత్మిక విధానం. దీనికి, పశ్చిమ ప్రాంత మతం క్రైస్తవం సెట్‌ కాదు'' అని మత పెద్ద మార్క్‌ బుచర్స్‌ వ్యాఖ్యానించారు.

2010లో అమెరికాలోని సియాటెల్‌కు చెందని ఒక పాస్టర్‌ యోగాను భూత సాధనగా అభివర్ణించారు.

ముస్లింలను చెడగొట్టే అభ్యాసంగా యోగాను మలేషియాకు చెందిన ప్రముఖ ఇస్లామిక్‌ కౌన్సిల్‌ 2008లో ప్రకటించింది. అయితే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో యోగాకు వ్యతిరేకంగా తీసుకురావాలనుకున్న ఫత్వాను ఉపసంహరించుకుంది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)