ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లగలరా? మధ్య ప్రాచ్యంలోని దేశాలు కరోనావైరస్‌ను ఎలా ఎదుర్కొంటున్నాయి?

    • రచయిత, జెరెమీ బొవెన్
    • హోదా, బీబీసీ మధ్యప్రాచ్యం ఎడిటర్

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కరోనావైరస్ కల్లోలం కొనసాగుతోంది. మధ్యప్రాచ్య దేశాలు కూడా ఈ మహమ్మారికి భయపడ్డానికి చాలా కారణాలు ఉన్నాయి.

కానీ, కరోనాకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఈ దేశాలకు కలిసివచ్చే అంశం ఒకటి ఉంది. ఆయా దేశాల యువత.

మధ్యప్రాచ్య దేశాల జనాభాలో ఎక్కువ శాతం యువతీ యువకులే. ఈ దేశాల్లో 60 శాతం జనాభా సగటు వయసు 30 ఏళ్లకు లోపే.

అందుకే, ఆ దేశాలు కోవిడ్-19 వైరస్‌కు ఘోరంగా ప్రభావితం కాకుండా తగ్గే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా వృద్ధులనే లక్ష్యంగా చేసుకుంటోంది.

కరోనావైరస్ దాడి

మధ్యప్రాచ్యంలోని ఎక్కువ దేశాల్లో ప్రభుత్వాల కన్ను ప్రపంచవ్యాప్తంగా కరోనాకు అత్యంత ఘోరంగా ప్రభావితమైన దేశాలపై ఉంది.

ఫలితంగా, ఆ దేశాలకు ఈ మహమ్మారి నుంచి కాపాడుకోడానికి, దానిపై పోరాటానికి సన్నద్దం కావడానికి తగినంత సమయం లభించింది.

కానీ, అవి తమ దేశాల్లో కర్ఫ్యూ అమలు చేయడం, సోషల్ డిస్టన్సిగ్ లాంటి చర్యలు చేపట్టలేదు.

ఏళ్ల తరబడి ఘర్షణలు, యుద్ధాల వల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత అస్థిర ప్రాంతంగా మారింది. యుద్ధాలు దీని పునాదులను బలహీనం చేశాయి.

కరోనావైరస్ వ్యాప్తి ఈ ప్రాంతాన్ని మరింత బలహీనం చేయవచ్చనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది.

మధ్యప్రాచ్యంలో కరోనా అడుగు పెట్టడానికి కారణాలు

మధ్యప్రాచ్య దేశాల మధ్య వైద్య సౌకర్యాల్లో గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయి. ఇజ్రాయెల్‌ ఆస్పత్రులు ప్రపంచంలో ఏ దేశంలోని మంచి ఆస్పత్రులతో అయినా పోటీపడేలా ఉంటాయి.

కానీ యెమెన్, సిరియా, లిబియాలో హెల్త్ కేర్ సిస్టమ్ ఎప్పుడూ బలంగా లేదు. ఏళ్ల తరబడి సాగిన యుద్ధాలు ఈ దేశాల వైద్య వ్యవస్థను, మౌలిక వసతులను పూర్తిగా ధ్వంసం చేశాయి.

చాలా ప్రాంతాల్లో అది పూర్తిగా కుప్పకూలింది. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం యెమెన్‌ మానవతా సంక్షోభంలో అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉంది.

ఇప్పుడు ఇక్కడ కూడా కరోనా వ్యాప్తి మొదలైంది. దేశంలో పేదలు, జనసాంద్రత అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో అది వేగంగా వ్యాపించవచ్చు.

ఇది రాజకీయంగా ఎత్తుపల్లాలను చవిచూస్తోంది. గత వారం కోవిడ్-19 వల్ల ఇద్దరు చనిపోయినా, ఇక్కడ కర్ఫ్యూ అమలుకు సన్నాహాలే కనిపించడం లేదు.

లాక్‌డౌన్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది?

ఈ దేశాల్లో జనం గుంపులు గుంపులుగా మసీదులు, మార్కెట్లవైపు వెళ్తున్నారు

కరోనావైరస్‌తో పోరాడగల అత్యధిక సామర్థ్యం ఉన్న యువత, ఇక్కడ వైరస్ వ్యాపించకముందే తమ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ కనిపిస్తోంది.

ప్రతి దేశంలో ప్రజలు తమ ప్రభుత్వాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ అరబ్ దేశాల్లో అవినీతి, బంధుప్రీతి, సంస్కరణల డిమాండ్లు వ్యతిరేక ప్రదర్శనలకు కారణం అవుతున్నాయి.

అవినీతి, ఉన్నతవర్గాలు ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్నట్లు జనం ఆరోపిస్తున్నారు. ప్రజాధనాన్ని ప్రజా సేవలను మెరుగుపరచడానికి ఉపయోగించాలని వారు కోరుతున్నారు.

అల్జీరియా, లెబనాన్, ఇరాక్‌ ప్రజలు ఒక అధ్యక్షుడు, ఇద్దరు ప్రధానమంత్రులు గద్దె దిగేలా చేశారు.

ప్రభుత్వాలపై అసంతృప్తి

ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆయా దేశాల ప్రజలు రాజధానుల్లో ప్రధాన కూడళ్లను ముట్టడించారు. అక్కడనుంచి కదలేది లేదని మొరాయించారు.

ఇరాక్‌లో బుల్లెట్లు తగిలి 600 మంది నిరసనకారులు మృతిచెందారు. వేలమంది గాయపడ్డారు. ప్రజల నిరసనలు తగ్గకపోవడంతో పాలకులు అధికారం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చిన యువ నిరసనకారులు కరోనావైరస్ వల్ల ఇప్పుడు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇప్పుడు వారికి కచ్చితంగా చిరాకుగానే ఉంటుంది.

లాక్‌డౌన్ పూర్తయ్యాక మళ్లీ ఇళ్ల నుంచి బయటకు వస్తే, ఉద్యోగాలు సృష్టించలేని స్థితిలో తమ దేశాల ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని వారు తెలుసుకుంటారు. దాంతో వారిలో ఆగ్రహం మరింత పెరుగుతుంది.

ఆర్థికవ్యవస్థకు తీవ్ర విఘాతం

ఈ దేశాల్లో అధికారంలో ఉన్న శక్తుల దగ్గర ప్రత్యామ్నాయాలు మరింత పరిమితం అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో లాక్‌డౌన్ అంటే గ్లోబల్ షట్‌డౌన్ వల్ల మధ్యప్రాచ్య దేశాల్లో ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది.

లెబనాన్‌లో నిరసనలకు దిగిన జనం ఆర్థికవ్యవస్థ దెబ్బ తినక ముందే దారుణమైన స్థితిలో ఉన్నారు. కరోనావైరస్ వ్యాప్తికి ముందే అక్కడి ఆర్థికవ్యవస్థ దాదాపు కుప్పకూలింది. బ్యాంకులు దివాలా తీశాయి.

మధ్యప్రాచ్యంలో అగ్ర దేశాలు ప్రస్తుతం తమ ప్రతిష్టాత్మక, ఖరీదైన విదేశీ విధానాలపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ధనబలం చూపించడం, పరోక్ష యుద్ధాలు చేయడం లాంటి రోజులు ఇప్పుడు ముగుస్తున్నట్లు కనిపిస్తున్నాయి.

థింక్ ట్యాంక్ చాటమ్ హౌస్‌లో మిడిల్ ఈస్ట్ ప్రోగ్రాం చీఫ్ లినా ఖాతిబ్ మాట్లాడుతూ.. “సౌదీ అరేబియా, ఇరాన్ లాంటి దేశాలు మధ్యప్రాచ్యంలో తమ ప్రభావం పెంచుకోడానికి అమలు చేస్తున్న వ్యూహాలపై పునరాలోచించాలి. అవి తమ ప్రాధాన్యతలు మరోసారి నిర్ణయించుకోవాలి. అవి యెమెన్ లేదా సిరియాలో తమ ప్రయోజనాలను త్యాగం చేయాల్సి రావచ్చు. దాని గురించి అవి ఇంతకు ముందు ఆలోచించే ఉంటాయి” అన్నారు.

లాక్‌డౌన్, కర్ఫ్యూ

కరోనావైరస్ వల్ల తలెత్తిన పరిస్థితులు గల్ఫ్ దేశాల్లో చమురు ద్వారా సంపాదించే ఆ దేశాలు, మిలియనీర్ కంపెనీలు ఉన్న దేశాలు, బలహీన దేశాలు అన్నింటినీ బాధించాయి.

పేద దేశాల్లో లక్షల మంది ఇప్పుడు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. లాక్‌డౌన్, కర్ఫ్యూ వల్ల పనులు ఆగిపోయి ఉండడంతో చాలా మంది పస్తులతో రోజులు గడపాల్సి వస్తోంది.

ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అమెరికా ఆంక్షల వల్ల ఇప్పటికే దారుణంగా ఉంది. కరోనావైరస్ వ్యాప్తికి ముందే ఆ దేశంలో ప్రజల పరిస్థితి ఘోరంగా మారింది.

ఇరాన్‌ కరోనా ప్రభావానికి తీవ్రంగా నష్టపోయింది. ఇక్కడ 7వేల మందికి పైగా చనిపోయారు. దేశంలో లక్షా 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

అమెరికా విధించిన ఆంక్షలు ఇప్పటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ వెన్ను విరిచాయి. ఇప్పుడు కరోనా దానిని మరింత నాశనం చేసింది. ఇరాన్ వ్యాపారం ప్రారంభించాలంటే తమ సరిహద్దులు మళ్లీ తెరవాల్సి ఉంటుంది.

హజ్ యాత్ర పరిస్థితి ఏంటి?

మతపరమైన యాత్రలు మధ్యప్రాచ్య దేశాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. కానీ లాక్‌డౌన్ సమయంలో ప్రముఖ ధార్మిక స్థలాలన్నీ మూసేయడంతో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ముస్లింలు ఇక్కడికి రావడం ఆగిపోయింది.

ఇరాన్ నుంచి వచ్చే షియా యాత్రికుల వల్ల ఇరాక్‌కు బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుంది. లాక్‌డౌన్ వల్ల ఇప్పుడు దానికి చాలా నష్టం వచ్చింది.

సౌదీ అరేబియా మక్కా నగరంలో కర్ప్యూ అమల్లో ఉంది. జులైలో ఇక్కడ ఏటా జరిగే హజ్ యాత్ర కూడా వాయిదా పడుతుందని తెలుస్తోంది

ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ముస్లింలు ఏటా ఈ యాత్రకు వస్తుంటారు.

చమురు ధరల పతనం

చమురు ధరలు పతనం కావడం వల్ల మధ్యప్రాచ్య దేశాలు భారీ నష్టాలను చవిచూశాయి. చమురు పుణ్యమా అని బలంగా ఉన్న ఈ దేశాల ఆర్థిక కోటలకు ఇప్పుడు బీటలు పడుతున్నట్లు కనిపిస్తోంది.

ఇటీవల, సౌదీ అరేబియా తమ ఆర్థికవ్యవస్థను చమురు పరిశ్రమ నుంచి తొలగించి మళ్లించాలనే ప్రణాళికలు ప్రారంభించింది.

చమురు ధరలు తగ్గడం వల్ల ఇప్పుడు అది కూడా కష్టంగా మారింది. అల్జీరియా 60 శాతం ఆదాయం దాని చమురు, గ్యాస్ నిక్షేపాల నుంచే వస్తుంది.

కానీ ఆ ధరలు పడిపోవడం వల్ల అది ఇప్పుడు తమ ప్రభుత్వ వ్యయాన్ని మూడో వంతుకు తగ్గించుకుంది.

కరోనావైరస్ వల్ల ఈ దేశాల్లో గతకొన్నిరోజులుగా నడుస్తున్న ఉద్యమానికి సంబంధించి వారం వారం జరిగే ఆందోళనలు ఆగిపోయాయి. కానీ వైరస్ జోరు కాస్త తగ్గినా ఆందోళనకారులు మళ్లీ వీధుల్లోకి రావచ్చు.

2011లో అరేబియాలో ఆగ్రహించిన యువత రోడ్లపైకి వచ్చింది. తమ భవిష్యత్తును లాగేసుకుంటున్నటారని వారంతా ఆరోపించారు. కానీ కాలంతోపాటూ మారుతూ వచ్చిన వారి ఆశయాలు దారితప్పాయి లేదంటే ముక్కలయ్యాయి.

ఇప్పుడు మహమ్మారి దాడికి ముందు వారిలో మరోసారి రగులుతున్న అగ్నిపర్వతం కనిపిస్తోంది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)