You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
International Day of Yoga: అంతర్జాతీయ యోగా దినోత్సవం: యోగా ఎవరెవరు చేయొచ్చు.. ఎవరు చేయకూడదు.. అసలు దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి
శారీరక, మానసిక ఆరోగ్యం అందించే యోగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. దీని మూలాలన్నీ భారత్‌లోనే ఉన్నాయి. వేదకాలం నుంచే భారతదేశంలో యోగా ఉంది.
ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతాలలో యోగా ఒకటి. జూన్ 21 'అంతర్జాతీయ యోగా దినోత్సవం'.
స్వామి వివేకానంద (1863-1902) పశ్చిమ దేశాలకు యోగాను పరిచయం చేసి వ్యాప్తిలోకి తెచ్చారు.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం చేసిన సూచనతో జూన్ 21ని 'అంతర్జాతీయ యోగా డే'గా ఐక్యరాజ్యసమితి 2015లో ప్రకటించింది.
ఈ రోజును పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల్లో కోట్లాది మంది యోగా చేస్తారు.
యోగా ఎలా విస్తరించింది?
యోగాను పశ్చిమ దేశాలకు పరిచయం చేసిన వ్యక్తిగా స్వామీ వివేకానందకు పేరుంది.
1893లో షికాగో వేదికగా జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో ప్రసంగించేందుకు అమెరికా వెళ్లిన స్వామీ వివేకానంద భారత్ ప్రతిష్ట, హిందూ మతం గురించి తన ఉపన్యాసాలలో వివరించారు.
1896లో అమెరికాలోని మన్‌హటన్ నగరంలో ఆయన 'రాజ యోగా' పుస్తకాన్ని ఆవిష్కరించారు. యోగా ప్రాముఖ్యతను పశ్చిమ దేశాలు తెలుసుకునేందుకు ఆ పుస్తకం ఎంతగానో దోహదపడింది.
ఆ తర్వాత భారత్ నుంచి అనేక మంది యోగా గురువులు, టీచర్లు అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లారు.
2,500 ఏళ్ల క్రితం యోగా
యోగా చాలా పురాతనమైనది. వేదకాలం నుంచే దాని గురించి ప్రస్తావన ఉంది. 2500 ఏళ్ల క్రితం సాధువులు యోగా సాధనలు చేసేవారని యూనివర్సిటీ ఆఫ్ లండన్‌కు చెందిన పరిశోధకుడు, సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ జిమ్ మల్లిన్‌సన్ చెప్పారు. ఆయన యోగా చరిత్ర మీద అధ్యయనం చేస్తున్నారు.
అప్పట్లో స్థిరంగా ఒక భంగిమలో ఉంటూ యోగా చేసేవారని, ప్రస్తుతం యోగా శిక్షణ కేంద్రాల్లో మనం చూస్తున్న శారీరకపరమైన ఆసనాలు అప్పట్లో ఉండేవి కాదని మల్లిన్‌సన్ వివరించారు.
ప్రస్తుతం చాలామందికి తెలిసిన 'సూర్యనమస్కారం' లాంటి కొన్ని యోగా ఆసనాలు ఒకప్పుడు వాడుకలో ఉండేవి కాదని ఆయన తెలిపారు. 1930ల నుంచే 'సూర్యనమస్కారం' ఆసనం ప్రాచుర్యంలోకి వచ్చినట్లు చరిత్ర పుస్తకాలను తిరగేస్తే తెలుస్తోందని అన్నారు.
గడచిన శతాబ్ద కాలంలో ప్రపంచీకరణలో భాగంగా యోగా కూడా అనేక రూపాలు తీసుకుంది. విభిన్నమైన కొత్త ఆసనాలు ఆచరణలోకి వచ్చాయి. చాలా దేశాల్లో యోగాకు ప్రాధాన్యత కూడా బాగా పెరిగింది.
అష్టాంగ యోగా, అయ్యంగార్, విన్యాస యోగా కూడా ఈ క్రమంలో రూపుదిద్దుకున్నవే. 'అష్టాంగ యోగ'ను పతంజలి మహర్షి సిద్ధం చేశారని చెబుతారు.
యోగాపై అపోహలెందుకు?
శారీరక, మానసిక పరమైన సమన్వయాన్ని సాధించడమే యోగా ప్రధాన లక్ష్యమని ముంబయిలోని లోనావ్లా యోగా శిక్షణ సంస్థ డైరెక్టర్ మన్మధ్ ఘోరోటె అంటున్నారు.
అయితే, యోగా అనగానే ఇదేదో కఠోరమైన సాధన అనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ, ఇందులో ఎవరైనా సులువుగా చేయగలిగే ఆసనాలు చాలా ఉన్నాయి. వాటితో శారీరకంగా, మానసికంగా ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు.
ఉరుకులపరుగుల జీవితంలో ప్రశాంతత లేకుండాపోతోందని చాలామంది అంటుంటారు. కానీ, రోజూ సమయం దొరికనప్పుడు చిన్నచిన్న యోగా ఆసనాలు వేయడం మొదలుపెడితే ప్రశాంతత మెరుగుపడుతుంది.
ఏ ఆసనం ఎలా వేయాలో అవగాహన ఉంటే చాలు... యోగాను ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా సాధన చేయొచ్చు.
వృద్ధులు యోగా చేయొచ్చా?
యోగాకు వయసు అడ్డంకి కాదు. చాలామంది ఏడు పదుల వయసులో యోగా చేయడం మొదలుపెడతారు. తాము ఇంకా ముందే ప్రారంభించి ఉంటే బాగుండేదని వారు చెబుతుంటారు.
అన్ని వయసుల వారికీ ప్రత్యేకంగా కొన్నిరకాల యోగా ఆసనాలు ఉంటాయి. యోగా అనేది ఒక రకమైన వ్యాయామం. అది చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా చేయొచ్చు.
శారీరకంగా దృఢంగా ఉన్నవారే యోగా చేయాలన్న షరతు కూడా ఏమీల లేదు. యోగాలో అనేక రకాల ఆసనాలు ఉన్నాయి. మీ ఫిట్‌నెస్‌కు తగ్గట్టుగానే ఆసనాలను ఎంచుకోవచ్చు.
శారీరక వైకల్యంతో కుర్చీలోంచి లేవలేని వారికోసం కూడా ప్రత్యేకంగా 'ఛైర్ యోగా' ఉంది.
యోగాతో కలిగే ప్రయోజనాలేంటి?
- యోగాతో మనకు ప్రశాంతత, విశ్రాంతి లభిస్తుంది. దాంతో, మానసిక ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంటుంది.
- ఆసనం వేసి స్థిరంగా ఉండటం వల్ల శరీర అవయవాలకు మనసుకు మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
- శరీరంలో నొప్పులు తగ్గేందుకు ప్రెగ్నెన్సీ యోగా ఉపయోగపడుతుంది. నిద్ర బాగా పడుతుంది.
- 'ప్రసవానంతర యోగా' ద్వారా మహిళలు త్వరగా మామూలు స్థితికి వచ్చేందుకు వీలుంటుంది.
- విద్యార్థులు రోజూ యోగా చేస్తే జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఉంటుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది.
- యోగాసనాల వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.
- శరీరం నుంచి వ్యర్థాలు వేగంగా బయటకు వెళ్లిపోతాయి.
- శారీరకపరమైన సాధనలతో కండారాలు దృఢంగా తయారవుతాయి.
ఇవి కూడా చదవండి:
- జైళ్లలో యోగా: 'సెక్స్ కోరికలు పెరిగి హోమో సెక్సువల్స్ అవుతారు'
- బన్నీ ఛౌ: భారత్‌లో దొరకని భారతీయ వంటకం
- ఆహార వృథాయే ఆకలి కేకలకు అసలు కారణమా?
- భారత్ బానిసత్వంలో ఉన్నది 150 ఏళ్లా.. 1200 ఏళ్లా?
- ఇక్కడి నుండి చైనా సరిహద్దు ఈజీగా దాటేయొచ్చు!
- ట్విటర్ సీఈఓ: మంచునీటి స్నానం, ఒంటి పూట భోజనం..
- ‘యోగా, సూర్య నమస్కారాలు క్రైస్తవానికి సరిపడవు.. ఒక క్రైస్తవుడి జీవితంలో యోగాకు స్థానం లేదు’ - గ్రీకు చర్చి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)