ఒబామా: భారతీయుల సున్నా వల్లే ఐటీ విప్లవం

బరాక్ ఒబామా.. అమెరికా మాజీ అధ్యక్షుడు. ప్రస్తుతం ఆయన భారత్‌లో ఉన్నారు. గతంలో ఆయన అధ్యక్ష హోదాలో భారత్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగాలలోని 10 ముఖ్యమైన అంశాలు.

ఐటీ.. భారత్ పుణ్యమే

నేటి ఆధునిక ప్రపంచంలో సమాచార సాంకేతికత (ఐటీ) కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందుకు కారణం భారత్.

ఐటీకి ఎంతో కీలకమైన 'సున్నా(0)'ను ఆవిష్కరించింది ఈ దేశమే. భారత్‌కు సుసంపన్నమైన నాగరికత ఉంది. కొన్ని వేల సంవత్సరాలుగా ఇది ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తోంది.

మహాత్ముడి ప్రేరణ వల్లే

ఈరోజు నేను మీ ముందు అమెరికా అధ్యక్షునిగా నిలబడ్డాను అంటే మహాత్మా గాంధీ సందేశాల ప్రేరణే కారణం.

అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌కు మహాత్ముని సిద్ధాంతాలే ఆదర్శంగా నిలిచాయి.

బాంగ్రా నృత్యం చేశా

భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఈ శతాబ్దంలో సరికొత్త భాగస్వామ్యానికి తెరతీస్తాయని నేను విశ్వసిస్తున్నాను.

అమెరికా అధ్యక్షునిగా నేను తొలిసారి సందర్శించిన ఆసియా దేశం భారత్.

అక్కడ మేం బాంగ్రా నృత్యం చేశాం. అమెరికాలో తొలిసారిగా వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు జరిపాం.

ఆయన వల్లే యోగా

దాదాపు 100 సంవత్సరాల క్రితం స్వామీ వివేకానంద షికాగో వచ్చారు. హిందూ మతాన్ని, యోగాను అమెరికాకు తీసుకొచ్చారు.

చంద్రునికి నిచ్చెన వేశాం

భారత్, అమెరికా నేడు అంతర్జాతీయ టెక్నాలజీ హబ్‌లుగా మారాయి. మనం ఉమ్మడిగా ఎన్నో కొత్త ఆవిష్కరణలకు తెరలు తీశాం.

చంద్రుడు, అంగారకుడు వంటి గ్రహాలకు సంబంధించిన పరిశోధనల్లో రెండు దేశాలూ తమదైన ముద్ర వేశాయి.

అప్పుడే ప్రపంచానికి మేలు

ప్రపంచంలో భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అమెరికా అతి పురాతనమైన ప్రజాస్వామ్యం. మనం ఏకతాటిపై నడిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత సురక్షితంగా ఉంటుంది.

ఐక్యమత్యమే మహా బలం

మతం పేరుతో అడ్డు గోడలు నిర్మించుకోనంత కాలం భారత ప్రజాస్వామ్యం దీర్ఘకాలం పాటు మనుగడ సాగిస్తుంది. కులం, మతం, వర్గం పేరుతో భారత్ ఎప్పుడూ విడిపోకూడదు.

జాతి అంతా కలిసి కట్టుగా ఉండాలి. అన్ని వర్గాల వారు షారుఖ్ ఖాన్ సినిమాలు చూసి ఆనందిస్తారు.

అన్ని మతాల వారూ మిల్కా సింగ్, మేరీ కోం విజయాలను వేడుకగా జరుపుకొంటారు. ఇటువంటి స్ఫూర్తి ఎంతో అవసరం.

అప్పుడే నేర్చుకోగలం

ఎక్కువ మంది అమెరికా విద్యార్థులు భారత్‌కి రావాలి. మరింత మంది భారత్ విద్యార్థులు అమెరికా వెళ్లాలి.

మనం ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవడానికి ఇది ఏంతో అనువైన మార్గం. భారత్, అమెరికా ప్రజలకు ఉమ్మడిగా ఉండే సుగుణం కష్టపడే తత్వమే.

అభివృద్ధి చెందిన దేశం

ఆసియాలో చూసినా, ప్రపంచవ్యాప్తంగానైనా భారత్ అభివృద్ధి చెందిన దేశమే. భారత్ కొన్ని దశాబ్దాలలోనే శరవేగంగా అభివృద్ధి చెందింది.

మీరు సాధించిన అభివృద్ధిని సాధించడానికి ఇతర దేశాలకు శతాబ్దాలు పట్టింది.

నేటి తరం అదృష్టం

భారత్ నేడు ప్రపంచ సారథుల్లో ఒకటిగా నిలిచింది.

నేటి తరం తల్లిదండ్రులు, తాతలు దీన్ని ఊహించుకొని ఉంటారు. వారి పిల్లలు, వారి మనుమలు, మనుమరాళ్లు భవిష్యత్తులో దీన్ని ఒక చరిత్రగా చెప్పుకొంటారు.

కానీ ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యులుగా నిలిచే అదృష్టం మాత్రం నేటి తరానికి లభించింది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)