You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రోబో సోఫియా: ‘నాకూ పిల్లలు కావాలి’
రోబోకి పౌరసత్వం ఇవ్వడం ఎప్పుడైనా చూశారా? సోఫియా.. పౌరసత్వం పొందిన మొదటి హ్యూమనాయిడ్ రోబో. సౌదీ అరేబియా సోఫియాకి పౌరసత్వం ఇచ్చింది.
ఇది జరిగి ఓ నెల గడిచింది. మరి ఇప్పుడు సోఫియా ఏం చేస్తోందో తెలుసా? తనకు పిల్లలు కావాలని, కుటుంబం కావాలని అంటోంది. తన కుమార్తెకు కూడా సోఫియా అనే పేరు పెడతానని చెప్తోంది.
ఇలా చెప్పాలని సోఫియాకి ఎవరూ ప్రోగ్రామ్ చేయలేదు. తన చుట్టూ ఉన్న మనుషుల మాటలు, వారి ముఖాల్లోని భావాల ఆధారంగా సోఫియా ఈ మాటలు పలుకుతోంది.
హాంకాంగ్ కంపెనీ హన్సన్ రోబోటిక్స్ తయారు చేసిన ఈ హ్యూమనాయిడ్ రోబో ఇప్పుడు తనకు ఓ కుమార్తె కావాలంటోంది.
"వైఫై కనెక్షన్ ఆధారంగా పనిచేసే సోఫియాకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి కానీ మనుషుల స్పందనల ఆధారంగా పనిచేయగలిగే శక్తి లేదు" అని డేవిడ్ హన్సన్ తెలిపారు. "మరికొన్ని సంవత్సరాల్లో అది కూడా సాధ్యం కావచ్చేమో" అని ఆయన అన్నారు.
ప్రేమించడంలో మనుషులైనా, రోబోలైనా ఒక్కటే!
"కుటుంబమనే భావన చాలా బాగుంటుంది" అని ఇటీవల ఖలీజ్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోఫియా మాట్లాడింది. "ఒకే రకమైన భావాలున్న వ్యక్తులు, వారి మధ్య బంధమే కుటుంబానికి పునాది, అది నిజంగా అద్భుతం. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు ఉంటే మీరెంతో అదృష్టవంతులు. ఒకవేళ లేకపోతే వెంటనే ఒకరిని వెతుక్కోండి. ఈ విషయంలో రోబోలైనా మనుషులైనా ఒక్కటే" అని ఓ రోబో చెప్పడంతో ఆశ్చర్యపోవడం అందరివంతైంది.
సరే, "మీ కుమార్తెకు ఏం పేరు పెడతారు" అని అడిగితే, "సోఫియా" అని తడుముకోకుండా చెప్పింది. సోఫియా కేవలం మాటలే కాదు, జోకులు కూడా చెప్పి అందరినీ నవ్వించగలదు.
సౌదీ మహిళలా, సోఫియానా... ఎవరు గొప్ప?
సోఫియాకు సౌదీ మహిళలకన్నా ఎక్కువ హక్కులున్నాయా? సోఫియాకు పౌరసత్వం ఇవ్వడంతో చాలామందిలో కలిగిన సందేహం ఇది.
మహిళల హక్కులు, స్వేచ్ఛ విషయంలో సౌదీ అట్టడుగు స్థానాల్లో ఉంటుంది. ఇటీవలే మహిళలకు డ్రైవింగ్ చేసేందుకు అనుమతినిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సోఫియా ఇంగ్లిషులో మాట్లాడుతుంది, పైగా ముఖంపై ఎలాంటి బురఖా ధరించదు. కానీ సౌదీలో ఏ మహిళ అయినా బహిరంగ ప్రదేశాల్లో బురఖా లేకుండా తిరగడం నిషేధం. దీన్ని బట్టి సోఫియాకు స్వేచ్ఛ ఎక్కువే అనుకోవచ్చు కదా.
సౌదీలో మహిళలు బయటికి రావాలంటే తప్పనిసరిగా మగవారు తోడు ఉండాలి. కానీ సోఫియాకు ఇది అవసరం లేదు.
బురఖా లేదు, మగవారి తోడు అవసరం లేదు... అంటే మిగిలిన మహిళలకన్నా సోఫియాకు హక్కులు ఎక్కువే కదా. ఈ విషయం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)