You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బీటెల్‌జూస్: సూర్యుడు కంటే వెయ్యి రెట్లు పెద్దదైన ఈ నక్షత్రం కాంతి తగ్గిపోతోంది ఎందుకు?
ఒరాయిన్ నక్షత్రమండంలోని అతి పెద్ద నక్షత్రం బీటెల్‌జూస్ కాంతి.. అక్టోబర్ 2019 నుంచి ఏప్రిల్ 2020 మధ్య కాలంలో 40% తగ్గింది.
దీనికి కారణం, ఆ నక్షత్రంపై పెద్ద పెద్ద చల్లని ఆవరణలు ఏర్పడడమే. ఇవి, మనకు అప్పుడప్పుడు సూర్యునిపై కనిపించే మచ్చల్లాంటివి కావొచ్చు అని శాస్త్రవేత్తలు అంటున్నారు.
"బీటెల్‌జూస్ కాంతి రాను రాను తగ్గుతుండడంతో విస్ఫోటనానికి గురయ్యే అవకాశం ఉంది" అని అంచనా వేసారు. కానీ మళ్లీ అది కాంతి పుంజుకుంటూ మే 2020 నాటికి పూర్తిగా ప్రకాశవంతమయ్యింది.
భూమికి 500 కాంతి సంవత్సాలకంటే ఎక్కువ దూరంలో ఉన్న బీటెల్‌జూస్ జీవితం చివరిదశకొచ్చేసింది. అయితే అది ఎప్పుడు విస్ఫోటనానికి గురవుతుందో కచ్చితంగా చెప్పలేము. వందల, వేల సంవత్సరాలు పట్టొచ్చు. మిలియన్ సంవత్సరాలు కూడా కావొచ్చు.
ఇంధనం అయిపోయినప్పుడు ఈ నక్షత్రం ముందు కూలిపోయి, మళ్లీ పైకి ఎగిసి గొప్ప విస్ఫోటనం జరుగుతుంది.
ఈ పేలుడు వలన భూమికి ఏం ప్రమాదంలేదుగానీ ఆకాశంలో దీని వెలుగు కొన్ని రోజులు లేదా నెలలతరబడి నిలిచిపోతుంది.
చంద్రుడంత కాంతితో పొద్దున్నపూట కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ వెలుగు భూమిని చేరడానికి 500 కాంతి సంవత్సరాలు పడుతుంది. అంటే మనం శతాబ్దాల వెనుక జరిగిన సంఘటనను చూస్తామన్నమాట.
బీటెల్‌జూస్ కాంతిలో వచ్చిన మార్పులకి కారణం ధూళిమేఘాలు కావొచ్చు.
ఇలాంటి పెద్ద పెద్ద నక్షత్రాల ఉపరితంలో జరిగే వాతారవరణ మార్పుల కారణంగా పల్సేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. దీనివల్ల కొన్ని రకాల వాయువులు వెలువడతాయి. ఇవి చల్లబడి మేఘాల్లా కమ్ముకుంటాయి. వీటినే ఖగోళ శాస్త్రవేత్తలు ధూళి అంటారు.
ఈ ధూళిని పరీక్షించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు చీలేలోని అటకామ పాత్‌ఫైండర్ ఎక్స్పరిమెంట్ (ఏపీఈఎక్స్), హవాయ్‌లోని జేమ్స్ క్లెర్క్ మాక్స్‌వెల్ టెలిస్కోప్(జేసీఎంటి)లను ఉపయోగించారు.
ఈ టెలిస్కోపులు సబ్‌మిల్లిమీటర్ వేవ్ స్పెక్ట్రల్ రేంజ్‌లోని విద్యుదయస్కాంత కిరణాలను కొలవగలవు. ఈ కిరణాల తరంగధైర్ఘ్యం(వేవ్‌లెంత్), కంటికి కనిపించే వెలుగుకన్నా వేలరెటు ఎక్కువ.
"సబ్‌మిల్లీమీటర్ వేవ్ రేంజ్‌లో కూడా బీటెల్‌జూస్ కాంతి 20% తగ్గడం ఆశ్చర్యాన్ని కలిగించింది" అని తైవాన్‌లోని ఈస్ట్ ఏషియన్ అబ్సర్వేటరీ నుంచి స్టీవ్ మెయిర్స్ అన్నారు. జేసీఎంటిని ఇక్కడినుంచే ఆపరేట్ చేస్తారు.
ఈ పరీక్షల ఫలితాలు చూస్తే బీటెల్‌జూస్‌పై ధూళి ఏర్పడిన సూచనలు కనిపించట్లేదు అని పరిశోధకులు అంటున్నారు. నక్షత్ర ఉపరితలం(ఫొటోస్పియర్)పై జరిగిన వాతావరణ మార్పులే కాంతి తగ్గడానికి కారణం కావొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
“మామూలుగా సూర్యుడిమీద కనిపించే మచ్చ భూగ్రహమంత ఉంటుంది. బీటెల్‌జూస్ మీద ఏర్పడే మచ్చలు సూర్యునికన్నా వందలరెట్లు పెద్దవిగా ఉంటాయి. వెలుగు తగ్గిపోవడం విస్ఫోటనానికి సూచనగా భావించక్కర్లేదు. బీటెల్‌జూస్ లాంటి బ్రహ్మాండమైన నక్షత్రంపై ఏర్పడే పెద్ద పెద్ద మచ్చలే కారణం కావొచ్చు." అని మాంచెస్టర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆల్బర్ట్ జిజిల్స్ట్రా అన్నారు.
సూర్యుడితో పోలిస్తే బీటెల్‌జూస్ 20 రెట్లు బరువైనది, 1000 రెట్లు పెద్దది.
ఇవి కూడా చదవండి:
- ఇస్రో: ఈ మరుగుజ్జు నక్షత్రవీధి ఓ భారీ నక్షత్రాల ఫ్యాక్టరీ
- అంతరిక్షంలో వ్యర్థాలను ఎలా తొలగించొచ్చు?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- చైనా మీద భారత్ విరుచుకుపడిన 1967 నాథూలా యుద్ధం గురించి తెలుసా?
- కరోనావైరస్: వినోద రంగం భవిష్యత్తేంటి?
- కరోనావైరస్ ఇటలీలో గత ఏడాది డిసెంబర్ నాటికే ఉందని తేల్చి చెబుతున్న మురుగు నీటి పరిశోధనలు
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- కరోనావైరస్ 'జీరో' అని ప్రకటించుకోవడానికి ఆ దేశాలకు ఎందుకంత తొందర?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)