కరోనావైరస్: వన్య ప్రాణుల్ని తినడం, వాటి అమ్మకాలు, కొనుగోళ్లు ఇకనైనా ఆగుతాయా?

    • రచయిత, హెలెన్ బ్రిగ్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచవ్యాప్తంగా వన్య ప్రాణుల వ్యాపారాన్ని అరికట్టే విషయంలో జరుగుతున్న పరిణామాల్లో కరోనావైరస్ వ్యాప్తి చాలా పెద్ద మలుపు తీసుకువచ్చింది.

చాలా జీవ జాతులు అంతరించిపోతుండటానికి ఈ వ్యాపారం కూడా ఓ కారణం. వ్యాధుల వ్యాప్తికి కూడా దారితీస్తోంది. కరోనావైరస్ కూడా చైనాలో వణ్య ప్రాణులను అమ్మే ఓ మార్కెట్‌లోనే పుట్టి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

వియత్నాంలో ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసేందుకు వెళ్లిన ఆడమ్ పేమాన్... మెనూ చూసి ఆయన ఆశ్చర్యపోయారు. సంప్రదాయ అన్నం, నూడుల్స్, చేపలు, పీతలతో చేసిన వంటకాలకు తోడు ఎన్నో వణ్య ప్రాణుల పేర్లు అందులో కనిపించాయి. అంతరించిపోతున్న జీవ జాతులు కూడా అందులో ఉన్నాయి. స్టింగ్ రే, పార్కుపైన్, సాఫ్ట్‌షెల్ తాబేలు, అడవి పంది, అడవి మేక లాంటివాటితో చేసిన వంటకాలు మెనూలో కనిపించాయి.

విలక్షణ విందుల కోసం

హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ అనే జంతు సంక్షేమ సంస్థలో వైల్డ్ లైఫ్ మేనేజర్‌‌గా ఆడమ్ పనిచేస్తున్నారు.

‘‘ఆహార పదార్థాల జాబితాలో వాటన్నంటినీ చూడటం ఆశ్చర్యం కలిగించింది. వాటిని తినడాన్ని వాళ్లు విలాసంలా భావిస్తుంటారు’’ అని ఆయన చెప్పారు.

ఆసియా దేశాల్లో కొందరు సంపదను చూపించుకోవడానికి విలక్షణమైన విందులు ఏర్పాటు చేస్తున్నారు.

ఆహారంగానో, ఔషధ గుణాలున్నాయంటూనో వన్య ప్రాణుల అమ్మకాలు, కొనుగోళ్లు సాగుతున్నాయి. ఇందుకోసం కొన్ని జంతువులను అకమ్రంగా తీసుకువస్తున్నారు.

జంతువుల్లోని వైరస్‌లు మనుషులకు సంక్రమించేందుకు ఇలాంటివి కారణమవుతున్నాయి.

వన్య ప్రాణులను, మరీ ముఖ్యంగా వాటిలోని క్షీరదాలను తినడం వల్ల జంతువుల్లోని వైరస్‌లు మనుషులకు సంక్రమించే ముప్పు చాలా ఎక్కువగా ఉందని ఆడమ్ అంటున్నారు.

‘‘వీటిని అక్రమంగా తెచ్చారో, లేదో తెలుసుకోవడం చాలా కష్టం. కొన్నింటిని అక్రమంగా తరలించి ఉండొచ్చు. ఇంకొన్నింటిని ఇక్కడి ‘వెట్ మార్కెట్ల’లో కొని ఉండొచ్చు’’అని అన్నారు.

వెట్ మార్కెట్లు

ఆగ్నేయాసియాలో, మరీ ముఖ్యంగా చైనా ప్రధాన భూభాగంలో వెట్ మార్కెట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

ప్రాణమున్న చేపలు, కోళ్లు, వన్య ప్రాణులను, తాజా పండ్లు, కూరగాయలను వీటిలో అమ్ముతుంటారు.

వీటిని పాడవ్వకుండా రక్షించేందుకు ఐస్ వాడుతుంటారు. జంతువులను చంపితే వచ్చే రక్తాన్ని నీళ్లు పోసి కడుగుతారు. ఎప్పుడూ తడిగా కనిపిస్తాయనే, ఈ మార్కెట్లకు వెట్ మార్కెట్లు అని పేరు వచ్చింది. ఇంగ్లీష్‌లో వెట్ అంటే తడి అని అర్థం.

వెట్ మార్కెట్లు మహమ్మారులు ప్రబలేందుకు కారణమయ్యే ‘టైమ్ బాంబులు’ కావొచ్చని జువాలజికల్ సొసైటీ ఆఫ్ లండన్ (జెడ్‌ఎస్ఎల్) డిప్యుటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆండ్రూ కనింగ్హమ్ అన్నారు.

‘‘జంతువులను ఏదో మన కోసమే ఉన్న వస్తువుల్లా చూస్తాం. అది వికటించి, మన మీదకే రావడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు’’అని ఆయన అన్నారు.

మనుషులకు పాకుతాయి

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బలి తీసుకున్న ఈ కరోనావైరస్ చైనాలోని వుహాన్‌లో సీఫుడ్ (చేపలు, పీతల) మార్కెట్‌లో పుట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. పేరులో సీఫుడ్ అని ఉన్నా, ఈ మార్కెట్ ఇంకా చాలా అమ్ముతారు. పాములు, పార్క్యపైన్, జింకలు ఇక్కడ అమ్ముతుంటారని ఓ నివేదిక పేర్కొంది.

ప్రాథమికంగా బయటపడ్డ కరోనావైరస్ పాజిటివ్ కేసులకు ఈ మార్కెట్‌ కేంద్రంగా ఉంది. చైనాలో వైరస్ వేగంగా వ్యాపించడం మొదలైంది. ఆ తర్వాత మొత్తం ప్రపంచానికి వ్యాపించింది.

ఈ వైరస్ మూలాలపై ఇంకా స్పష్టత లేదు. గబ్బిలాల నుంచి వచ్చి, మరో వన్య ప్రాణికి పాకి, మనుషులకు సంక్రమించి ఉండొచ్చని భావిస్తున్నారు.

జంతువుల్లో పుట్టి మనుషులకు వ్యాపిస్తున్న వ్యాధుల గురించి శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్), మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్), ఎబోలా లాంటివి ఆ తరహా వ్యాధులే.

వన్య ప్రాణులను అమ్మే మార్కెట్లపై నిషేధం విధించాలని... వన్య ప్రాణుల వేట, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని న్యూయార్క్‌లో ఉండే వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ డిమాండ్ చేస్తోంది.

వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంతోపాటు వణ్య ప్రాణులు అంతరించిపోకుండా కూడా ఉండేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని అంటోంది.

విధానాల్లో డొల్లతనం

వుహాన్‌లో కరోనావైరస్ మొదటగా ప్రబలినప్పుడు వన్య ప్రాణులను పెంచడం, అమ్మడంపై చైనా నిషేధం విధించింది. 2019 చివర్లోనే దీనిపై ఆ దేశంలో ఓ చట్టం కూడా రావాల్సి ఉంది. కానీ, ఇంకా రాలేదు

వన్య ప్రాణులను పెంచే ఫామ్‌లు వేల సంఖ్యలో మూతపడ్డాయి. కానీ, చైనా విధానంలో డొల్లతనం ఉంది. ఔషధాల కోసం, పరిశోధనల కోసం, పెంచుకునేందుకు వన్య ప్రాణుల అమ్మకాలు సాగించవచ్చు.

సంప్రదాయ చైనీస్ ఔషధాల్లో వన్య ప్రాణుల వినియోగం ఉంది.

ఇటీవల కరోనావైరస్‌కు చికిత్స కోసం చైనా ప్రభుత్వం ఓ ఇంజెక్షన్‌ను ఆమోదించినట్లు తెలుస్తోంది. విచిత్రమేంటంటే, ఎలుగుబంటి పైత్యరసాన్ని ఉపయోగించి దీన్ని తయారుచేశారు.

ఇలాంటి మినహాయింపులు ఇవ్వడం వల్ల ఆహారంగా తీసుకునేందుకు వన్య ప్రాణుల కొనుగోళ్లు ఆగవని ఉద్యమకారులు అంటున్నారు. గతంలోనూ ఇలాగే జరిగింది.

పాంగోలిన్ చర్మాన్ని ఔషధాల్లో, గోళ్లను ఆభరణాల్లో వినియోగిస్తారు. అందుకే దాని మాంసం ఇప్పటికీ దొరుకుతూ ఉంటుంది.

వియత్నాంలో ప్రభుత్వం వీధుల్లో, ఆన్‌‌లైన్‌లో వన్య ప్రాణుల అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు చట్టం చేసేందుకు సిద్ధమవుతోంది.

స్థానిక సంస్కృతిలో వెట్ మార్కెట్లు భాగమని, నిషేధాలను అమలు చేయడం అంత సులువు కాదని కొందరు అంటున్నారు. వెట్ మార్కెట్‌లో మాంసం తాజాగా, తక్కువ ధరకే దొరుకుతుందన్న నమ్మకం కూడా జనాల్లో ఉంది.

సమస్యకు మూలం డిమాండ్

సమస్యకు అసలు కారణం డిమాండేనని సిటీ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ ప్రొఫెసర్ డిర్క్ ప్ఫీఫర్ అన్నారు.

‘‘పెంచి తెస్తున్నా, అక్రమంగా తెస్తున్నా వన్య ప్రాణులను అమ్ముతున్నవాళ్లకు అదే ముఖ్యమైన ఆదాయవనరు. దాన్ని అణచివేడయం పరిష్కారం కాదు. దశల వారీగా అది జరగాలి’’అని అభిప్రాయపడ్డారు.

మహమ్మారుల కారణంగా వన్య ప్రాణుల వ్యాపారం చర్చకు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. చైనాలో సార్స్ వ్యాపించి, 700 మంది చనిపోయినప్పుడు కూడా, గబ్బిలాలు, ముంగిస లాంటి వేరే జీవుల నుంచి అది సంక్రమించి ఉండొచ్చని అన్నారు. అయితే, అది పూర్తిగా నిర్ధరణ కాలేదు.

భవిష్యతులో మరో మహమ్మారి ప్రబలకుండా ఉండాలంటే, ప్రభావాలతోపాటు కారణాలపైనా మనం దృష్టి పెట్టాలని ప్రొఫెసర్ కనింగ్హమ్ అంటున్నారు.

‘‘సమస్యకు ప్రధాన మూలం ప్రకృతి విధ్వంసం. జంతువులను, మనుషులకు మధ్య ఘర్షణ తీసుకురావడం’’ అని ఆయన అన్నారు.

‘‘పరిరక్షిస్తున్న ప్రాంతాల్లో అడవులు ఉంటున్నాయి. కానీ, వాటిలోనే వన్య ప్రాణులు ఇలా మార్కెట్లలోకి వస్తున్నాయి. ఎవరో ఒకర్ని వేలెత్తి చూపించడం సులభమే. కానీ, ఒక్క చైనాలోనే కాదు, చాలా దేశాల్లో ఇది జరుగుతుంది. పాశ్చాత్య దేశాల్లోనూ ఉంది. విలక్షణ పక్షులను కొందరు పెంచుకుంటుంటారు. అవన్నీ అడవుల్లో నుంచి పట్టుకువచ్చినవే. మొదట మనల్ని మనం సరిచేసుకోవాలి’’అని చెప్పారు.

అదనపు రిపోర్టింగ్: నవీన్ సింగ్ ఖడ్కా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)