వీరిద్దరిలో ఒకరు బ్రిటన్‌కు కాబోయే ప్రధాని

హంట్, జాన్సన్

ఫొటో సోర్స్, PA

బ్రిటన్‌ ప్రధాని పీఠం, అధికార కన్సర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవులకు ఆ పార్టీ నాయకులు బోరిస్ జాన్సన్, జెరెమీ హంట్‌ల మధ్య తుది పోటీ జరగనుంది.

కన్సర్వేటివ్ పార్టీ ఎంపీలు తాజాగా పాల్గొన్న ఆఖరి బ్యాలెట్ ఓటింగ్‌లో బోరిస్ జాన్సన్ అగ్రస్థానంలో నిలిచారు.

మొత్తం 313 మంది కన్సర్వేటివ్ ఎంపీలుండగా, వారిలో 160 మంది ఓట్లను ఆయన సంపాదించారు.

77 ఓట్లతో హంట్ రెండో స్థానంలో నిలిచారు. మైఖేల్ గోవ్‌కు 75 ఓట్లు వచ్చాయి.

కన్సర్వేటివ్ పార్టీలోని సుమారు 1.6 లక్షల మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొని.. జాన్సన్, హంట్‌ల్లో పార్టీ అధ్యక్షుడు, దేశ ప్రధాని కాబోయేదెవరో నిర్ణయించనున్నారు.

జులై ఆఖరి వారంలో ఈ ఓటింగ్ ఫలితాలు వస్తాయి.

జాన్స‌న్‌కు తాను చాలా గట్టి పోటీ ఇస్తానని హంట్ అంటున్నారు. రాజకీయాల్లో ఎన్నోసార్లు 'ఆశ్చర్యకర పరిణామాలు' జరుగుతుంటాయని ట్విటర్‌లో ఆయన వ్యాఖ్యానించారు.

బ్రిటన్ ప్రధాని ఎన్నిక
ఫొటో క్యాప్షన్, 313 మంది కన్సర్వేటివ్ ఎంపీల్లో 160 మంది బోరిస్ జాన్సన్‌కు మద్దతు పలికారు

బ్రిటన్ ప్రధాని పదవికి థెరెసా మే ఇటీవల రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. బ్రెగ్జిట్ విషయంలో సొంత పక్షం కన్సర్వేటివ్ పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే కన్సర్వేటివ్ పార్టీ మరో నాయకుడిని ఎన్నుకుంటోంది.

ఎంపీల ఆఖరి బ్యాలెట్ ఓటింగ్‌లో జాన్సన్ విజయం అందరూ ఊహించిందే. గోవ్, హంట్ చాలా రోజులుగా రెండో స్థానం కోసం తలపడుతూ వచ్చారు.

థెరిసా కేబినెట్‌లో విదేశాంగ మంత్రిగా పనిచేసిన జాన్సన్ థెరెసాతో విభేదించి, గతేడాది ఆ పదవి నుంచి వైదొలిగారు. 2008 నుంచి 2016 వరకూ ఆయన లండన్ మేయర్‌గా ఉన్నారు.

ప్రస్తుతం హంట్ బ్రిటన్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. గోవ్ పర్యావరణ మంత్రిగా పనిచేస్తున్నారు.

తాజా ఫలితాలు జాన్సన్ క్యాంప్‌కు సంతోషం కలిగించేవేనని బీబీసీ పొలిటికల్ ఎడిటర్ లారా క్వెన్స్‌బర్గ్ అభిప్రాయపడ్డారు.

హంట్‌ను ఓడించడం తేలికని ఆ క్యాంప్ భావిస్తోందని ఆమె చెప్పారు.

దేశ ప్రధాని ఎంపిక గుప్పెడు మంది కన్సర్వేటివ్ పార్టీ సభ్యుల చేతిలో ఉండకూడదని లేబర్ పార్టీ ఎంపీ ఆండ్రూ గ్వెన్ వ్యాఖ్యానించారు.

సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి ప్రజలకు నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వాలని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)