You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికాలోని చికాగో హాస్పిటల్లో కాల్పులు, నలుగురు మృతి
అమెరికాలోని చికాగో హాస్పటల్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. ఆస్పత్రికి చెందిన మహిళా సిబ్బంది ఇద్దరు, ఓ పోలీస్ అధికారి ఈ కాల్పుల్లో చనిపోగా, ఆ తర్వాత కాల్పులు జరిపిన వ్యక్తి కూడా మరణించాడు.
చనిపోయిన ఇద్దరు మహిళల్లో ఒకరు డాక్టరు అని మేయర్ రాహ్మ్ ఇమాన్యుయేల్ తెలిపారు.
పోలీసులు జరిపిన కాల్పుల్లోనే ఆగంతకుడు మరణించాడని పోలీసు ప్రతినిధి ఒకరు చెబుతున్నారు. కానీ, ఆగంతకుడు తనకు తానుగానే కాల్చుకున్నాడా, పోలీసు కాల్పుల్లో చనిపోయాడా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.
ఓ మహిళ లక్ష్యంగా ఈ కాల్పులు జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సంఘటన జరిగింది.
ఆగంతకుడు పార్కింగ్ ప్రదేశంలో కాల్పులు జరపడంతో తాము కూడా ఎదురు కాల్పులు చేయాల్సి వచ్చిందని చికాగో పోలీసు విభాగం తెలిపింది.
ఆ కాల్పుల శబ్దం వినగానే అతడు భవనం లోపలకి వస్తున్నాడేమోనని భయపడ్డామని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న పేషెంట్లు అన్నారు.
ఆగంతకుడు పేల్చిన బుల్లెట్ తన తుపాకిలో దిగిన ఫొటోలను ఈ కాల్పుల్లో గాయపడిని ఓ పోలీసు అధికారి ట్విటర్లో షేర్ చేశారు.
అమెరికాలో గన్ కల్చర్‌కు వ్యతిరేకంగా వైద్యులంతా ఇటీవలే ఓ ఆన్‌లైన్ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. తుపాకీ కాల్పుల్లో గాయపడినవారికి తాము చేసిన చికిత్సకు సంబంధించిన ఫొటోలను వారు షేర్ చేశారు.
'గన్ వయొలెన్స్ ఆర్కైవ్' నివేదిక ప్రకారం అమెరికాలో తుపాకీ సంస్కృతి కారణంగా ఈ సంవత్సరం దాదాపు 13000 మంది బలయ్యారు. మరో 25000 మంది గాయపడ్డారని, 250 మందికి పైగా పోలీసులు కూడా బుల్లెట్ల బారిన పడ్డారని ఆ నివేదిక తెలిపింది.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)