అమెరికా గన్ కల్చర్: కదం తొక్కిన విద్యార్థులు

అమెరికాలో ఆయుధాల నియంత్రణ చట్టాలను కఠినతరం చేయాలంటూ విద్యార్థులు కదం తొక్కారు.

అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న ఆయుధాల వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ దేశవ్యాప్తంగా మహా ర్యాలీకి పిలుపునిచ్చారు.

మార్చ్‌ ఫర్ అవర్ లైవ్స్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో ఐదు లక్షల మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నట్టు అంచనా.

ఫిబ్రవరిలో ఫ్లోరిడా రాష్ట్రం పార్క్‌లాండ్‌లోని ఒక పాఠశాలలో పూర్వ విద్యార్థి జరిపిన కాల్పుల్లో 17 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

అంతకుముందు జనవరిలో కెంటకీ రాష్ట్రంలోని ఓ హైస్కూలులో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు బాధ్యుడు 15 ఏళ్ల విద్యార్థి కావడం గమనార్హం.

అలా అమెరికాలోని పాఠశాలల్లో అనేక ఘటనలు జరుగుతున్నాయి. అభంశుభం తెలియని ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు.

అమెరికాలోని విద్యార్థులకు సంఘీభావంగా ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లోనూ పెద్ద ఎత్తున ర్యాలీలు తీస్తున్నారు. దాదాపు 800 నగరాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

అమెరికా.. మీ పిల్లలను ప్రేమించండి, ఆయుధాలను కాదు అంటూ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు.

అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ లాంటి పలువురు సెలబ్రెటీలు విద్యార్థుల ర్యాలీలో పాల్గొన్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)