సాహా : 20 బంతుల్లో 102.. సన్ రైజర్స్ కుర్రాడి సంచలనం

భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా టీ20 చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ కొట్టాడు.

జేసీ ముఖర్జీ ట్రోఫీలో భాగంగా పశ్చిమ బెంగాల్లోని కాళీఘాట్‌లో జరుగుతున్న క్లబ్ మ్యాచ్‌లో ఇతను 20 బంతుల్లో 102 పరుగులు తీశాడు.

మోహున్ భగన్ టీం తరపున ఆడిన ఇతను బీఎన్‌ఆర్ రిక్రియేషన్ క్లబ్‌పై ఈ పరుగులు చేశాడు.

మొత్తం 14 సిక్స్‌లు, 4 ఫోర్లు కొట్టాడు. దీంతో ఈ టీం 7 ఓవర్లలో 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

సాహా మొదటి 12 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసి.. తర్వాత 8 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేశాడు.

మరోవైపు చివర్లో వరుసగా 9 సిక్సర్లు కొట్టాడు.

33 ఏళ్ల వయసున్న సాహా 2018 ఐపీఎల్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడనున్నాడు.

ఇతన్ని సన్ రైజర్స్ రూ. 5 కోట్లకు కొనుగోలు చేసింది.

ఇప్పటి వరకు టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ పేరిట ఉంది.

గేల్ 2013 ఐపీఎల్లో 30 బంతుల్లో సెంచరీ కొట్టాడు.

సాహా ఇప్పటి వరకు 32 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.

ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ మొదలుకానుంది.

ఈ సందర్భంగా సాహా విలేకర్లతో మాట్లాడుతూ.. ‘‘ ఐపీఎల్‌లో బాగా ఆడేందుకు కొత్త షాట్లు ప్రయత్నించాను. అయితే ఇది రికార్డో కాదో నాకు తెలియదు.. ’’ అని వివరించాడు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)