శ్రీలంక రాజకీయ సంక్షోభం: వ్యూహ ప్రతివ్యూహాల ఉద్రిక్త సందర్భం

శ్రీలంక రాచనగరులో ఏం జరుగుతోంది? నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'హౌస్ ఆఫ్ కార్డ్స్', గేమ్ ఆఫ్ థ్రోన్స్... ఇంకా షేక్స్‌పియర్ రోమన్ నాటకాలకు ఏమీ తీసిపోనట్లుగా శ్రీలంక రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. తన నాయకుడిని వంచించి గద్దె నెక్కిన ఒక నేత, అదే నాయకుడికి మళ్ళీ అధికారం అప్పగించారు. అధికారం నాదంటే నాదేనని ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారు. వీటన్నింటి మధ్య ఒక హత్యకు కుట్ర జరిగిందనే ఆరోపణ. స్థూలంగా ఇదీ సింహళ రంగస్థల వర్తమాన చిత్రం.
'లంక' చిచ్చు ఎప్పుడు రాజుకుంది?
ఈ సంక్షోభం ఎక్కడ రాజుకుందన్నది చెప్పడం కష్టం. ఎందుకంటే, ఈ కథలో ఎన్నో ఊహించని మలుపులు, మెలికలు.
గతవారం శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘెను పదవి నుంచి తప్పించి అందరికీ షాక్ ఇచ్చారు. ఆతర్వాత క్యాబినెట్‌ను రద్దు చేశారు. పార్లమెంటును సస్పెండ్ చేశారు. అవేవీ సక్రమంగా పని చేయడం లేదని ఆయన అన్నారు.
విక్రమసింఘెను తొలగించడమే ఒక షాక్ అనుకుంటే, 2015 అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడించిన మహిందా రాజపక్సెను ప్రధానిగా నియమించడం ద్వారా సిరిసేన అందరినీ మరింత విస్మయానికి గురి చేశారు.
2005-2015 మధ్య కష్టకాలంలో రాజపక్సె శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్నారు. శ్రీలంకలో కొన్ని దశాబ్దాలు కొనసాగిన అంతర్గత యుద్ధం ఈయన హయాంలోనే ముగిసింది. రాజపక్సె అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన కుటుంబం దేశంపై ఆధిపత్యం చలాయించింది.
ఆయన సన్నిహితులపై పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని, యుద్ధ నేరాలకు ఒడిగట్టారని, చైనాతో వందల కోట్ల రూపాయలు తెచ్చి దేశాన్ని అప్పుల్లోకి నెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ, శ్రీలంకలోని గ్రామీణ ప్రాంతాల్లో వీరి పట్టు మాత్రం సడలలేదు. కానీ, భారత్, అమెరికా, యూరప్ దేశాలకు మాత్రం రాజపక్సె పునరాగమనం అంతగా రుచించలేదని ఆయా దేశాల ప్రతినిధులు చెబుతున్నారు.
ఈ పరిణామాలు, వ్యక్తుల మధ్య సంబంధాలను అర్థం చేసుకోవాలంటే 2015 సంవత్సరానికి వెళ్లాల్సిందే..
మైత్రిపాల సిరిసేన, రాజపక్సె ఇద్దరూ ఒకే రాజకీయ పార్టీకి చెందినవారు. అయినా, 2015 అధ్యక్ష ఎన్నికల్లో అధికారం కోసం తాజా మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘెతో చేరి, మైత్రిపాల సిరిసేన, రాజపక్సెను వెన్నుపోటు పొడిచారని ఆరోపణలున్నాయి. ఆ ఎన్నికల్లో రాజపక్సె ఓడిపోయారు.
మళ్లీ ఇప్పుడు తన పాత మిత్రుడు రాజపక్సెతో మైత్రిపాల సిరిసేన చేతులు కలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజపక్సె అధికార పీఠం అధిష్ఠించారా?
కచ్చితంగా చెప్పలేం. ప్రధాని పదవి నుంచి తనను తొలగించినా అధికార నివాసమైన టెంపుల్ ట్రీస్ నుంచి వెళ్ళడానికి విక్రమసింఘెను నిరాకరిస్తున్నారు.
అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారని, ఇప్పటికీ శ్రీలంక ప్రధాని తానేనని విక్రమసింఘె అన్నారు. ముందుగా పార్లమెంటును సమావేశపరిచి, ఈవిషయంపై ఓటింగ్‌కు వెళ్లాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
కానీ, అలాచేయడానికి అధ్యక్షుడు అంగీకరించలేదు. ఒకవేళ ఓటింగ్‌కు వెళితే సిరిసేన-రాజపక్సె వర్గానికి తగినంత మెజారిటీ రాదని విశ్లేషకులు చెబుతున్నారు.
తాజా మాజీ ప్రధాని విక్రమసింఘె వర్గంలోనివారిని మంత్రి పదవులు, ఇతర తాయిలాల ఆశ చూపి తమవైపుకు తిప్పుకోవడానికి సిరిసేన-రాజపక్సె వర్గం ప్రయత్నిస్తోంది.
మరోవైపు రాజపక్సె ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి, తన పని తాను చేసుకుపోతున్నారు. శ్రీలంక ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కూడా ప్రధానిగా రాజపక్సె పేరు ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రజల ఆందోళన ఏమిటి?
శ్రీలంకలో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. అధ్యక్షుడి వివాదాస్పద నిర్ణయం తర్వాత చెలరేగిన అల్లర్లలో ఒకరు మరణించారు.
పోలీసులు బలవంతంగా విక్రమసింఘెను అధికారిక నివాసం నుంచి ఖాళీ చేయించకుండా, ఆయన మద్దతుదారులు 'టెంపుల్ ట్రీస్' ముందు రక్షణ కవచంగా ఉన్నారు.
ప్రస్తుతం సంక్షోభాన్ని పార్లమెంటులో ఓటింగ్ ద్వారా పరిష్కరించవచ్చు. కానీ, ఓటింగ్‌లో ఓడినవారి మద్దతుదారులు మాత్రం.. శ్రీలంకను రగిలించకుండా ఉండరు.

ఫొటో సోర్స్, Getty Images
సంక్షోభానికి మూలాలు ఎక్కడ ఉన్నాయి?
ఈ కథకు మూలం వెతకడం అన్నది.. కథను చెప్పే వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది.
గత వారాంతంలో శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. తనకు, విక్రమసింఘెకు మధ్య వైరం పెరుగుతోందన్నారు. వివాదాస్పద సెంట్రల్ బ్యాంకు బాండ్ల కుంభకోణంలో విక్రమసింఘె ప్రమేయం ఉందని సిరిసేన ఆరోపించారు.
అంతేకాకుండా, కొందరు తన హత్యకు కుట్ర పన్నారని, ఇందులో ఒక మంత్రి హస్తం కూడా ఉందని, ఈ పరిస్థితుల్లో తాను రాజపక్సెను ప్రభుత్వంలోకి ఆహ్వానించానని సిరిసేన అన్నారు.
ఈ సమస్యకు కారణం ఎవ్వరు అని విక్రమసింఘెను ప్రశ్నిస్తే, దీనంతటికీ అసలు కారకుడు సిరిసేన అని చెబుతారు.
ఇద్దరి మధ్య సఖ్యత చెడిన పరిస్థితుల్లో వీరు ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడం ఖాయం. కానీ ప్రభుత్వం నిర్వీర్యమైన విధానం అందర్నీ ఆశ్చర్యపరిచిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, EPA
రాజ్యాంగబద్ధమేనా?
ప్రధానమంత్రిని తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని పలువురు న్యాయ నిపుణులు చెబుతున్నారు. మూడు సంవత్సరాల క్రితం చేసిన చట్టం ప్రకారం, ప్రధానిని తొలగించే అధికారం దేశాధ్యక్షుడికి లేదు అని రాజ్యాంగ నిపుణుడు నిహాల్ జయవిక్రమసంఘె అన్నారు.
19వ చట్ట సవరణ ప్రకారం అధ్యక్షుడి అధికారాల్లో దాదాపు అన్నిటినీ రద్దు చేశారని నిహాల్ అన్నారు.
''ఈ సవరణకు అధ్యక్షుడు సిరిసేన, తాజా మాజీ ప్రధాని విక్రమసింఘె ఇద్దరూ ఆమోదం తెలిపారు. ప్రధానిని పదవి నుంచి తొలగించే అధికారం ఒక్క పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది'' అని నిహాల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తర్వాత పరిస్థితి ఏమిటి?
శ్రీలంకలో.. తమిళ టైగర్లు, ప్రభుత్వాల మధ్య కొన్ని దశాబ్దాలపాటు అతర్యుద్ధం జరిగింది. రాజపక్సె అధ్యక్షుడిగా ఉన్నపుడే ఈ యుద్ధం ముగిసింది. యుద్ధం ముగింపు దశలో కొన్ని వేలమంది ప్రజలను అప్పటి ప్రభుత్వం చంపిందన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈ ఆరోపణలను శ్రీలంక సైన్యం ఖండిస్తోంది.
యుద్ధం ముగిశాక శ్రీలంక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. దేశ పరిస్థితుల్లో నిలకడ కనిపిస్తోంది. ఈ వాతావరణానికి భంగం కలిగించేలా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి.
యూరోపియన్ యూనియన్ దేశాలతో చేసే వ్యాపారాలపై విధించే పన్ను నుంచి యూరప్ యూనియన్ శ్రీలంకను మినహాయించింది.
కానీ, ఈ పరిణామాల నేపథ్యంలో... మానవహక్కులను ఉల్లంఘించినా, సింహళీయులు-తమిళుల మధ్య ఐక్యతకు విఘాతం కలిగినా ఆ పన్ను మినహాయింపు హామీని విరమిస్తామని యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి
- తెలంగాణ ఎన్నికలు: 'మేం ఎన్నికలను బహిష్కరిస్తున్నాం'
- భారత్‌లో ‘ఆ’ వెబ్సైట్లపై ప్రభుత్వం పట్టు బిగించగలదా?
- సర్దార్ వల్లభాయ్ పటేల్: నర్మదా నదీ తీరంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం
- గిరిజన మహిళల ముఖాలపై సంప్రదాయపు గాట్లు
- రూపాయి విలువ పడిపోతే దేశానికి ఏమవుతుంది? మీకేమవుతుంది?
- మహారాష్ట్ర: 13 మందిని చంపిన ఆడ పులి కాల్చివేత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








