శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్సె

శ్రీలంక రాజకీయాలు శుక్రవారం నాడు నాటకీయంగా మలుపు తిరిగాయి. అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన అధికార సంకీర్ణం నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడమే కాకుండా కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సెతో ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ విషయాన్ని శ్రీలంక అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది.
ప్రధానిగా రాజపక్సె నియామకం అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని, "ఇప్పటికీ నేనే ప్రధానమంత్రిని" అని రణిల్ విక్రమసింఘె అన్నారు.
విక్రమ సింఘెకు ఇప్పటి వరకూ అధ్యక్షుడు సిరిసేన నాయకత్వంలోని యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయన్స్ (యు.పి.ఎఫ్.ఏ) మద్దతు ఇస్తూ వచ్చింది. శుక్రవారంనాడు సిరిసేన తమ కూటమి పాలక పక్షానికి మద్దతు ఉపసంహరించుకుందని ప్రకటించారు. ఆ వెంటనే ఆయన రాజపక్సెను ప్రధానమంత్రిగా నియమించారు. విక్రమసింఘె నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీకి చెందిన నేషనల్ యూనిటీ ప్రభుత్వం నుంచి యు.పిఎఫ్.ఏ వైదొలగడంతో ఆయన ప్రభుత్వం మైనారిటీలో పడింది.
పార్లమెంటులో మద్దతు మాకే..
అయితే, విక్రమ సింఘె మంత్రివర్గంలోని శరత్ ఫోన్సెకా.. పార్లమెంటులో ఇప్పటికీ తమకు మద్దతు ఉందన్నారు. అధ్యక్షునికి ప్రభుత్వాన్ని రద్దు చేసే హక్కు కానీ, ప్రధానిని తొలగించే అధికారం కానీ లేదన్నారు. ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా రాజపక్సెను ప్రధానిగా నియమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహింద్ర రాజపక్సె ప్రభుత్వం తరపున అధికార ప్రతినిధిగా నియమితులైన ఎంపీ కెహెలియా రంబుక్వెల్లా.. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా అధ్యక్షుడు సమర్థుడైన రాజపక్సెను ప్రధానిగా నియమించారని పేర్కొన్నారు.
సిరిసేన పార్టీకి చెందిన మరో ఎంపీ అనూర ప్రియదర్శన.. దేశంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. రూపాయి విలువ సుమారు 28 శాతం పడిపోయిందన్న ఆయన.. విక్రమ సింఘె ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రించకపోయిందని, అందుకే అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
విక్రమ సింఘెను మరికొంత కాలం కొనసాగించి ఉంటే ప్రజలు వీధుల్లోకి వచ్చే ఆందోళన చేసే వారని ప్రియదర్శన అన్నారు. ప్రస్తుతం జరిగింది తిరుగుబాటు కాదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రధాని పదవి చేపట్టిన రాజపక్సె పార్లమెంటులో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం, శ్రీలంక పార్లమెంటు నవంబర్ 5న సమావేశమవుతుంది.
ఇవి కూడా చదవండి
- సీబీఐ వర్సెస్ సీబీఐ: డైరెక్టర్ అలోక్ వర్మ తొలగింపునకు.. రఫేల్ విచారణకు సంబంధముందా?
- డేజా వూ: ‘ఎక్కడో చూసినట్టుందే’ అని మీరెప్పుడైనా అనుకున్నారా? అయితే ఈ 8 విషయాలూ మీకోసమే
- వెనెజ్వేలా: పోషించే శక్తి లేక పిల్లల్ని అమ్మేస్తున్నారు
- ప్రపంచాన్ని ట్రంప్ మరింత ప్రమాదంలోకి నెట్టేశారా?
- లక్షలాది మొబైల్స్‌కు ‘ట్రంప్ అలర్ట్’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.









