పెట్రో మంటలు ఇప్పట్లో చల్లారవు

చమురు ఉత్పత్తిని పెంచాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేసిన విజ్ఞప్తిని సౌదీ అరేబియా, రష్యాలు తోసిపుచ్చాయి. దీంతో చమురు ధర బ్యారెల్‌కు సుమారు 6 వేల రూపాయలకు పెరిగింది.

ఒపెక్‌(ఓపీఈసీ)కు సౌదీ అరేబియా నేతృత్వం వహిస్తుండగా, ఒపెక్ వెలుపల అత్యంత ఎక్కువ ముడిచమురును ఉత్పత్తి చేస్తున్న దేశం రష్యా.

ఆదివారం ఆల్జీరియాలో సమావేశమైన ఈ రెండు దేశాలు అంతర్జాతీయ ముడిచమురు ఉత్పత్తి, ఇరాన్‌పై అమెరికా ఆంక్షల గురించి చర్చించాయి. ఈ సమావేశంలో ఉత్పత్తిని పెంచాలన్న దానిపై ఎలాంటి ఒప్పందమూ కుదరలేదు.

అయితే ఒపెక్, చమురును ఉత్పత్తి చేసే ఇతర దేశాలు రోజుకు 5 లక్షల బ్యారెల్స్ ఉత్పత్తిని పెంచే అంశంపై చర్చించినట్లు రాయిటర్స్ తెలిపింది.

సమావేశం అనంతరం సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి ఖలీద్ అల్ ఫాలీ.. తాము ధరలను ప్రభావితం చేయడం లేదని తెలిపారు.

ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో కొనుగోలుదారులు జరిమానా భయంతో ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారు. దాంతో ముడిచమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.

వచ్చే ఏడాది ప్రారంభం నాటికి చమురు ధర బ్యారెల్‌కు రూ. 7,300 వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.

గతవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. చమురు ఉత్పత్తిని పెంచి, తద్వారా ధరలను తగ్గించాలని కోరుతూ ట్వీట్ చేశారు.

''మేం మధ్యప్రాచ్యంలోని దేశాలను రక్షిస్తాం. మేం లేనిదే వాళ్లకు రక్షణ లేదు. అయినా కూడా ఆ దేశాలు చమురు ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. దీన్ని మేం గుర్తుంచుకుంటాం'' అని ట్రంప్ ట్వీట్ చేశారు.

గత ఏడాది చమురు ధరలు బ్యారెల్ కు రూ. 3600కన్నా తక్కువకు పడిపోవడంతో ఒపెక్, రష్యా సహా చమురును ఉత్పత్తి చేసే ఇతర దేశాలు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి. ఆదివారం జరిగిన సమావేశంలో ఆ నిర్ణయాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో ఇప్పట్లో పెట్రో ధరలు దిగి వచ్చే అవకాశం కనిపించడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)