చికాగో: నల్ల జాతి సంస్కృతి అందాన్ని పట్టిచూపుతున్న ఫొటోగ్రాఫర్లు

కళల్లో.. కార్యాలయాల్లో.. ఆఫ్రికన్ - అమెరికన్లను.. అంటే అమెరికాలోని ఆఫ్రికాజాతీయులను మూసధోరణిలో చిత్రీకరించే విధానం మీద తిరుగుబాటు చేస్తూ.. ముగ్గురు ఫొటోగ్రాఫర్లు తమ కళాకృతులను ప్రదర్శిస్తున్నారు.

అలానా ఐరితమ్, ఎండియా బేల్, మెదీనా దుగ్గర్‌.. ఆ ముగ్గురు కళాకారిణిలు. వారి కళాకృతులను చికాగోలోని కాథరీన్ ఎడిల్మన్ గ్యాలరీలో ప్రదర్శిస్తున్నారు. ఆ ప్రదర్శన పేరు.. ‘‘నువ్వు నన్నెలా చూస్తావు?’’

అందులోని హైలైట్స్‌లో కొన్ని ఇవి...

ద గోల్డెన్ ఏజ్: అలానా ఐరితమ్

పాశ్చాత్య కళా రంగ చరిత్రలో నల్లవారు లేకపోవటం మీద.. అరుదుగా నల్లని చర్మం ఉన్న వారిని పెయింటింగ్‌లు, సినిమాల్లో.. ఇంటిపని వారు, బానిసలు, ఆటవికులుగా చూపించటం మీద అలానా ఐరితమ్ దృష్టి కేంద్రీకరించారు.

ఆమె తన ఫొటో సిరీస్ ‘ద గోల్డెన్ ఏజ్’లో.. నల్లజాతి అస్తిత్వాన్ని ప్రకటించటానికి, కళా చరిత్రలో జాతి విభజనను ఎత్తి చూపటానికి.. ఆఫ్రికన్-అమెరికన్లను క్లాసిక్ డచ్ పోర్ట్రేచర్ తరహాలో ఫోజులు ఇవ్వటానికి ఆహ్వానించారు.

‘‘ఈ ఫొటోల్లోని మనుషుల కళ్లలో ఉన్న అందం, శక్తి.. మనకు రోజూ కనిపించే నెగెటివ్ మూస చిత్రీకరణలను తిప్పికొడతాయి’’ అంటారు ఐరితమ్.

‘‘మీడియా ద్వారా నల్లవారు ఎదుర్కొంటున్న అమానవీయ సందేశాల వరద మీద.. మేం అందంగా ఉంటాం, శక్తిశాలులం, విలువైన వాళ్లం, సామర్థ్యంగల మనుషులం, మేం ఇలాగే ఉంటాం అని విస్పష్టంగా చాటే సందేశాలతో పోరాటం చేయటం చాలా ముఖ్యం.’’

ఇరవయ్యో శతాబ్దం ఆరంభపు అమెరికా చరిత్రలో.. న్యూయార్క్‌లోని అప్పర్ మన్‌హటన్‌లో గల హార్లెమ్ కేంద్రంగా ఆఫ్రికన్-అమెరికన్ సామాజిక, సాంస్కృతిక వ్యక్తీకరణ వికసించిన హార్లెమ్ పునరుజ్జీవానికి ఈ ఫొటోతో నివాళి అర్పించారు ఐరితిమ్.

1980లు, 90లలో హిప్ హాప్ ఫ్యాషన్‌కు ఊపిరిలూదిన హార్లెమ్ ‌లోని క్లాత్ డిజైనర్ డాపర్ డాన్ పేరును పై ఫొటోకు పెట్టారు.

ఆమె ఫొటోలు చాలా వాటికి హార్లెమ్‌లోని ప్రాంతాల పేర్లు పెట్టారు.

చిన్నపుడు మ్యూజియంలు, గ్యాలరీలు సందర్శించినపుడు.. వెస్ట్రన్ ఆర్ట్‌లో నల్లవారికి చోటు లేకపోవటం తన మీద ప్రభావం చూపిందని ఐరితిమ్ చెప్తారు.

‘‘నాలా కనిపించేవారెవరినీ నేను ఎప్పుడూ చూడలేదు. ఆ గోడల మీద మేం లేము. ఎక్కడన్నా ఉంటే.. తెల్లవారికి మేం సేవ చేస్తున్నట్లుగా చూపేవారు’’ అని ఆమె పేర్కొన్నారు.

క్వీన్ మేరీ అని పేరు పెట్టిన కింది ఫొటోలోని మోడల్ పేరు మేరీ. ఆమె కుటుంబం కరీబియన్ సముద్రంలోని సెయింట్ క్రోయిక్స్ అనే దీవి నుంచి వచ్చారు.

1878లో సెయింట్ క్రోయిక్స్‌లో డచ్ వలస ఆక్రమణపై విజయవంతమైన తిరుగుబాటుకు సారథ్యం వహించిన ముగ్గురు మహిళల కథను ఐరితిమ్‌కు చెప్పారు మేరీ. ఆ ముగ్గరు మహిళల్లో ఒకరి పేరు మేరీ థామస్.

ఆ కథకు గౌరవసూచకంగా ఈ ఫొటోకు క్వీన్ మేరీ అని పేరు పెట్టాలని ఐరితమ్ నిర్ణయించారు.

మీరు చూస్తున్నది నా కోసమేనా?: ఎండియా బేల్

ఎండియా బేల్ తన సిరీస్‌లో.. సంప్రదాయ ఆఫీస్ సెటింగ్ నకిలీ నేపథ్యంగా.. ఆఫీసులో పనిచేయటానికి మోడల్ ఇష్టపడే దుస్తులను ధరింప చేసి ఫొటోలు తీశారు.

నార్త్ కారొలినాలోని విన్‌స్టన్-సాలెమ్ స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసే బేల్ గత నాలుగేళ్లుగా.. కార్పొరేట్ కార్యాలయాల్లో పనిచేసే మైనారిటీ మహిళల వ్యక్తిగత కథలను పరిశీలించటానికి ఫొటో, వీడియో కథనాలను ఉపయోగిస్తున్నారు.

తెల్లవారు అధికంగా ఉన్న కార్పొరేట్ కార్యాలయాల్లో పని చేసిన ఆమె అనుభవాల్లో.. వారు తన వెనుక తన గురించి మాట్లాడుకోవటం, అందం గురించిన వారి అభిప్రాయాలకు అనుగుణంగా లేని తన జుట్టు గురించి వ్యాఖ్యలు చేయటం వంటివి ఉన్నాయి.

‘‘నల్లజాతికి చెందిన, మహిళా ఫొటోగ్రాఫార్‌గా.. సృజనాత్మక కళా బృందాలు, ఫొటోజర్నలిజంలో ప్రస్తుత మైనారిటీ కథలకు ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉండటం నేను చూశాను’’ అని ఆమె చెప్తారు.

ఆమె తన సిరీస్ కోసం తను పనిచేస్తున్న యూనివర్సిటీ విద్యార్థులనే అంశంగా ఎంచుకున్నారు. నార్త్ కారొలినాలో కూడా కలియతిరిగి.. మహిళలను వారి చిన్నప్పటి ఇళ్లలో ఫొటోలు తీశారు.

‘‘ఆ పరిసరాలు.. మహిళలు తమ విషయంలో స్వేచ్ఛగా ఉండే సౌకర్యాన్ని పెంచుతాయి. ఒక ఇంటర్వ్యూకు వెళ్లినపుడు, ఇంటర్వ్యూ కోసం నిరీక్షిస్తున్నపుడు ఎటువంటి దుస్తులు ధరించటానికి ఇష్టపడతారో అవి ధరించాలని నేను ప్రతి మహిళనూ కోరాను’’ అని ఆమె తెలిపారు.

గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఉద్యోగం పొందటంలో తాము ఎదుర్కొన్న వ్యక్తిగత కష్టాలను ఆ మహిళలు పంచుకున్నారు: ‘‘వారి సహజమైన జుట్టు ఉద్యోగం చేసే ప్రొఫెషనల్స్ తరహాలో లేదని.. లేదంటే వారి పేరు పలకటం చాలా కష్టమని.. ఉద్యోగం కోసం వారిని వారు మార్చుకోవాలని.. ఉద్యోగాలిచ్చేవారు వారికి చెప్పేవారు.’’

‘‘ఈ కథనాలను సహోద్యోగులతో కానీ, యాజమన్యంతో కానీ పంచుకోవటం చాలా అరుదు. ఎందుకంటే.. ఉద్యోగం ఇవ్వకుండా తిరస్కరిస్తారనో, అవకాశాలు దొరకవనో భయపడుతుంటారు.’’

క్రోమా... యాన్ ఓడ్ టు జేడీ ఒఖాయ్ ఒజీకెరి: మెదీనా దుగ్గర్

మెదీనా దుగ్గర తన పోట్రెయిట్ సిరీస్‌లో.. నైజీరియన్ ఫొటోగ్రాఫర్ జేడీ ఒఖాయ్ ఒజీకెరికి నివాళి అర్పించారు. ఆయన 40 ఏళ్ల పాటు.. ఆఫ్రికా మహిళల హెయిర్‌స్టైల్స్ మీద బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు తీయటంలో గడిపారు.

నల్లవారి జుట్టు సంస్కృతిని ఆధునిక కాలంలో ఒక సంబరంగా మారటానికి ఒజికెరి కృషి దోహదపడింది. జడలు వేయటానికి సంబంధించి వేల ఏళ్ల కిందటి ఆఫ్రికా పద్ధతులను ఆయన ఫొటోల్లో నిక్షిప్తం చేశారు.

నైజీరియా జుట్టు సంస్కృతి ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. చిన్నప్పుడు మొదలయ్యే జడలు.. సామాజిక, సాంస్కృతిక, చారిత్రక, అంతర్జాతీయ ఘటనలతో ప్రభావితమవుతూ సాగుతుంది.

సంప్రదాయంగా చూస్తే.. నైజీరియన్ హెయిర్‌స్టైల్స్.. వయసు, కుటుంబ సంప్రదాయాలు, సామాజిక హోదాలకు ప్రతీకాత్మకంగా.. లోతైన అర్థాన్ని చెప్పే అలంకరణలుగా ఉండొచ్చు.

నైజీరియాలో నివసించే తెల్లజాతి అమెరికన్‌గా.. నైజీరియన్ జుట్టు సంస్కృతి మీద ఫొటోలు తీయటంలో పనిచేస్తూ.. ఈ ఆచారానికి సంబంధించిన చరిత్రను మొదటిగా నేర్చుకోవాల్సి ఉందని అర్థం చేసుకోవటం మొదలుపెట్టాను’’ అని దుగ్గర్ పేర్కొన్నారు.

ఆమె తన పోర్ట్రెయిట్లలో.. చారిత్రక హెయిర్‌స్టైల్స్‌తో పాటు.. ఒజీకెరి‌తో స్ఫూర్తి పొందిన ఊహాజనిత హెయిర్‌స్టైల్స్‌తో పాటు.. నైజీరియన్ హెయిర్‌స్టైలిస్ట్ ఇజోమా క్రిస్టొఫర్ జడలు, లాగోస్‌లో చూసిన హెయిర్‌స్టైల్స్‌తో ప్రయోగాలు చేశారు.

ఈ ఫొటోల్లోని మహిళలు.. తమ వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా తమ జడలకు ఉపయోగించిన రంగులను నిర్ణయించటంలో సాయం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)