You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆన్‌లైన్ పరిశోధన వేదికలతో కలలు పండించుకుంటున్న గృహిణులు
- రచయిత, టాటమ్ అండర్సన్
- హోదా, రిపోర్టర్, టెక్నాలజీ ఆఫ్ బిజినెస్
పిల్లలు పుడితే ఉద్యోగం వదిలెయ్యాలా? పెళ్లి అయితే చదువు మానెయ్యాలా?
చాలా మంది మహిళలు సాధారణంగా ఎదుర్కొనే ప్రశ్నలు ఇవి. ఒక రకమైన సమస్యలు కూడా.
తనుశ్రీ చౌధురిదీ ఇటువంటి సమస్యే.
ఇక వదిలెయ్
అవి తనుశ్రీ పీహెచ్‌డీ చేస్తున్న రోజులు. జీవశాస్త్రంలో డేటా ఎనాలిసిస్‌కు సంబంధించిన కంప్యూటేషనల్ బయాలజీలో ఆమె పరిశోధనలు చేస్తున్నారు.
ఆమె గర్భవతి అయ్యారు. ఇక పరిశోధన ఆపేయాలని ఆమెకు గైడ్ సూచించారు.
"పెళ్లి చేసుకున్నావు. తల్లివి కాబోతున్నావ్. ఇక నీకు ఈ పరిశోధనలు ఎందుకు? వదిలెయ్. నీ కుటుంబ బాధ్యతలు చూసుకో" అని గైడ్ సలహా ఇచ్చారు.
పెళ్లి అయితే అంతేనా?
ఔషధ రంగంలో పరిశోధనలు చేసి ఏదైనా కొత్త మందును ఆవిష్కరించాలన్నది తనుశ్రీ కల. కోల్‌కతాకు సమీపంలోని ఒక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో ఆమె చదువుకున్నారు.
పెళ్లి తరువాత భర్త వెంట ఆమె హైదరాబాద్ వచ్చారు.
తల్లి అయిన తర్వాత ఆమె కలలను చంపుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
"పెళ్లైన మహిళలు కుటుంబ బాధ్యతలు మోయాలని చాలా మంది అనుకుంటారు" అని తనుశ్రీ పేర్కొన్నారు.
వర్చువల్ లాబొరేటరీల ఆసరా
అయితే తన కలలను చంపుకోవడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే ఇంటి నుంచే తన పరిశోధనను కొనసాగించేందుకు ప్రయత్నించారు. ఆన్‌లైన్‌లో శోధించారు.
చివరకు "వర్చువల్ లాబొరేటరీ" రూపంలో తనుశ్రీకి ఒక ఆసరా లభించింది. ఆయా ప్రాంతాలకు చెందిన పరిశోధకులు ఆన్‌లైన్ ద్వారా సహకరించుకునేందుకు ఈ లాబొరేటరీ ఉపయోగపడుతుంది.
భారత ప్రభుత్వం గతంలో ప్రారంభించిన "ది ఓపెన్ సోర్స్ డ్రగ్ డిస్కవరీ (ఓఎస్‌డీడీ)" వేదిక తనుశ్రీకి ఎంతగానో దోహదపడింది.
ఇంటి నుంచే శాస్త్రవేత్తల సహకారం పొందేందుకు ఓఎస్‌డీడీ తోడ్పాటును అందించింది.
"ఆన్‌లైన్ ద్వారా చాలా మందిని కలిశాను. ఎంతో దూరంలో ఉన్న ఓ అమ్మాయితో కలిసి పని చేశాను. ఆన్‌లైన్‌లో ఒకరినొకరం సంప్రదించుకునే వాళ్లం. ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా కలుసుకునే అవసరం మాకు రాలేదు" అంటూ నాటి జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకున్నారు.
వ్యాధి ఏదైనా...
నేడు ఇలాంటి ఓపెన్ సోర్స్ వేదికలు అనేకం ఉన్నాయి. జన్యుశాస్త్రం నుంచి క్యాన్సర్ వరకు ఇక్కడ పరిశోధనలకు సహకారం లభిస్తుంది.
భారత దేశంతోపాటు అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలలోని మహిళలు వీటితో తమ కలలు సాకారం చేసుకుంటున్నారు.
భారత ప్రభుత్వం 2016లో ఓఎస్‌డీడీ వేదికను నిలిపి వేసింది.
ఆ తరువాత తనుశ్రీ, ఇతర పరిశోధకులు ఓపెన్ సోర్స్ ఫార్మా ఫౌండేషన్ (ఓఎస్‌పీఎఫ్) వేదికగా తమ పరిశోధనలు కొనసాగించారు.
ఔషధ రంగంలోని నిపుణులు, విద్యావేత్తలు దీన్ని ప్రారంభించారు.
బిడ్డకు పాలిస్తూనే...
ఆయేషా సఫీదా.. సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన యువతి.
ఆమె కేరళలోని మారుమూల ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇటువంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా ఆమె మాస్టర్స్ డిగ్రీ చేశారు.
బిడ్డకు పాలిచ్చే సమయంలో పరిశోధనా పత్రాలు చదివినట్లు ఆయేషా చెప్పారు.
‘‘కుటుంబ బాధ్యతల కారణంగా మహిళలు కలలను చంపుకోనక్కర్లేదు. ఇలాంటి ఆన్‌లైన్ వేదికలను ఉపయోగించుకొని లక్ష్యాలను చేరుకోవాలి’’ అని ఆయేషా సూచిస్తున్నారు.
అందరూ ఒకే చోట
ఓఎస్‌పీఎఫ్ కోసం తనుశ్రీ ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.
జీవశాస్త్రం, భౌతికశాస్త్రం వంటి రంగాలకు చెందిన శాస్త్రవేత్తలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
తమిళనాడుకు చెందిన రఖీలా ప్రదీప్‌కు కూడా పరిశోధన అంటే ఎంతో ఇష్టం. కానీ తాను ఉండే ప్రాంతానికి దగ్గర్లో పరిశోధన కేంద్రాలు లేవు. దూర ప్రాంతాలకు ప్రయాణించడం ఆమెకు కుదిరే పనికాదు.
ఇంటి వద్ద చిన్నపిల్లలు, వయసైన పెద్దవాళ్లను వదలి రోజుల తరబడి విశ్వవిద్యాలయాల్లో గడపడం అంత సులువు కాదని రఖీలా అభిప్రాయపడ్డారు.
ప్రతిభకు కొదువ లేదు
ఇలా గృహిణుల పరిశోధనలను నిపుణుడైన డాక్టర్ యూసీ జలీల్ పరిశీలించేవారు.
వారిలో ఎంతో నైపుణ్యం ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. మహిళలు ఉన్నత చదువులు అభ్యసిస్తున్నప్పటికీ పెళ్లి అనంతరం తమ కలలను చంపుకొంటున్నట్లు తెలిపారు.
ఇటువంటి వారిలోని ప్రతిభను బయటకు తీసి చౌకగా ఔషధాలు తయారు చేసేందుకు ఓఎస్‌పీఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అంటున్నారు.
సవాళ్లూ ఉన్నాయి
ఓఎస్‌పీఎఫ్‌కు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. దీనికి ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఇందులో నిధుల అందుబాటు ప్రధానమైనది.
ప్రస్తుతం టాటా ట్రస్ట్ నుంచి కొంత మేరకు నిధులు అందుతున్నాయి.
ఓఎస్‌పీఎఫ్ వేదికను మరింత విస్తరించేందుకు తాను, తన విద్యార్థులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న తనుశ్రీ పేర్కొన్నారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)