You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇది గాడిద.. కాదు, కాదు, అది కంచెర గాడిద
ఈజిప్ట్‌లోని ఒక జూ నిర్వాహకులు గాడిదకు రంగులు పూసి జీబ్రాగా చూపించేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. కానీ.. జూ నిర్వాహకులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. అది గాడిద కాదు, నిజమైన జీబ్రానే అంటున్నారు.
మెహమూద్ సర్హాన్ అనే విద్యార్థి.. కైరోలోని ఇంటర్నేషనల్ గార్డెన్ మునిసిపల్ పార్క్‌కు వెళ్లారు. అక్కడ కనిపించిన ఈ జంతువును ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
పరిమాణంలో చిన్నదిగా ఉన్న ఈ జంతువు చెవులు కూడా కొనదేలి ఉన్నాయి. వీటితోపాటుగా ఆ ఫోటోలోని జంతువు ముఖంపై నల్లటి మచ్చలు కూడా ఉన్నాయి.
ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాక ఈ ఫోటో వైరల్ అయ్యింది. నిపుణులు కూడా దీని జాతి లక్షణాలను విశ్లేషించడం మొదలు పెట్టారు.
స్థానిక మీడియా సంస్థ ‘ఎక్స్‌ట్రాన్యూస్.టీవీ’ ఈ విషయమై స్పందిస్తూ.. ఆ ఫోటోలోని జంతువు ముట్టె నల్లగా కనిపిస్తోందని, దాని శరీరంపైన ఉన్న చారలు కూడా సమాంతరంగా ఉన్నాయని తెలిపింది.
ఆ జూలో.. ఇలాంటి జంతువులు రెండు ఉన్నాయని, ఆ రెండు జంతువులకూ పెయింట్ వేశారని మెహమూద్ సర్హాన్ ఎక్స్‌ట్రా న్యూస్‌కు తెలిపారు.
కుక్కను సింహంలా చూపించారు!
ఈ విషయమై.. స్థానిక రేడియో స్టేషన్ నొగూమ్ ఎఫ్.ఎమ్. జూ నిర్వహకులను సంప్రదించింది. ఆ జంతువు గాడిద కాదని, అది జీబ్రా అని జూ డైరెక్టర్ మొహమద్ సుల్తాన్ నొక్కి చెప్పారు.
జంతు ప్రదర్శన శాలలపై ఈవిధమైన ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు.
గాజాలోని ఓ జూ నిర్వాహకులు 2009లో రెండు గాడిదలకు పెయింట్ వేసి జీబ్రాలుగా చూపించారు. అదే గాజాలో 2012లో మళ్లీ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.
జూలో జంతువుల కొరత ఉండటంతో ఇలా జంతువులకు రంగులు పూసి సందర్శకులను నమ్మించే ప్రయత్నం చేశారు.
2013లో చైనా లోని ఒక జూ.. టిబెటన్ మస్తిఫ్ కుక్కను ఆఫ్రికా జాతికి చెందిన సింహంలా తయారు చేసి చూపించింది.
2017లో చైనాలోని గ్వాంగ్‌సీ నగరంలో ఒక జంతు సందర్శన శాల.. ప్లాస్టిక్ పెంగ్విన్లను ప్రదర్శనకు ఉంచింది. కొన్ని వారాల తర్వాత అదే నగరంలోని మరో జూ.. ప్లాస్టిక్ సీతాకోక చిలుకలను ప్రదర్శించి సందర్శకులను నిరాశపరిచింది.
ఇవి కూడా చదవండి
- #BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
- BBC Special: పోతురాజు - బోనాల పండుగలో ఈ వేషం ఎవరు వేస్తారు? కొరడాతో ఏం చేస్తారు?
- BBC Special: బోనాల్లో 'రంగం' చెప్పే స్వర్ణలత ఎవరు?
- గుజరాత్: బ్రెజిల్‌కు ఆనాడు ఆవుల్ని, ఎద్దుల్ని ఇచ్చి.. ఇప్పుడు వీర్యం అడుగుతోంది
- #గమ్యం: రైల్వేలో ఉద్యోగం పొందడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)