You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
థియేటర్లన్నీ హౌస్‌ఫుల్.. సీట్లలో ఎవరూ ఉండరు: చైనాలో సినీమాయాజాలం
- రచయిత, స్టీఫెన్ మెక్‌డోనెల్
- హోదా, బీబీసీ న్యూస్, బీజింగ్
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా. త్వరలోనే అత్యధిక సినిమా ప్రేక్షకులున్న దేశంగా కూడా అగ్రస్థానం అందుకోబోతోంది. కానీ.. అక్కడ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఫ్లాప్ సినిమాల సంఖ్య పెరుగుతోంది.
దీనికి సెన్సార్‌షిప్ కారణమని కొందరంటారు. సృజనాత్మకత లోపించడం కారణమని ఇంకొందరంటారు. దీనికి టికెట్ల విక్రయంతో.. కనీసం అసలైన టికెట్ల అమ్మకంతో.. సంబంధం లేదు. అయితే.. సినిమా నిర్మాణంతో సంబంధంలేని మరో రహస్య శక్తి ఏదో పనిచేస్తోందని ఇంకొందరంటారు.
కొందరు పెట్టుబడిదారులు తమ కంపెనీల షేర్ల ధరలను పెంచుకోవటమే ఏకైక లక్ష్యంగా ఈ సినిమాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు కనిపిస్తోంది. సినిమాకు ప్రజాదరణ ఎలా ఉందనే దానితో నిమిత్తం లేకుండా ‘ప్రేక్షకుల స్పందన ఎలా కనిపిస్తోంద’నే దానితోనే ఈ షేర్ల ధరలు మారగలవు.
‘‘సినిమా హిట్ అయితే.. సదరు నిర్మాణ సంస్థ షేర్ల ధరలు ఎన్నో రెట్లు పెరుగుతాయి. ఇవి బాక్స్ ఆఫీస్ వసూళ్ల కన్నా చాలా అధికంగా ఉంటాయి. దీంతో కొందరు ‘ఆర్థిక మేధావుల’కు ఓ ఐడియా వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర బూటకపు వసూళ్లు చూపించి.. స్టాక్ మార్కెట్‌లో ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు కదా! అనేది ఆ ఐడియా’’ అని వివరించారు రేమండ్ ఝో.
ఆయన చైనా సినీ విమర్శకుడు, సినిమారంగ పరిశీలకుడు. చైనాలో సినిమా ఫైనాన్సింగ్ రంగంలో చీకటి కోణాలను చాలా కాలంగా తవ్వుతున్నారు.
‘‘మంచి సినిమాలు తీయటంతో నిమిత్తం లేకుండానే.. ఆ సినిమాలు చూడటానికి జనం థియేటర్లకు రాకుండానే.. డబ్బు సంపాదించే మార్గాలను నిర్మాతలు అనుసరిస్తున్నారన్నది నిజమేనా?’ అని ఆయనను ప్రశ్నించాను.
‘‘మంచి సినిమాలు నిర్మిస్తే జనం బాగా చూస్తారు. అలా కంపెనీ షేర్ల ధరలు పెరుగుతాయి.. అది సహజం.. కదా? కానీ కొంత మంది ఈ లెక్కను తిరగేశారు. వారికి తమ షేర్ల ధరలు పెరగటమే అంతిమ లక్ష్యం. అందుకు సినిమా నిర్మాణాన్ని ఒక సాకుగా వాడుకుంటున్నారు’’ అని ఆయన బదులిచ్చారు.
మరి నిజంగా జరుగుతున్నదేమిటి?
చైనా ప్రభుత్వ దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. కొన్ని నిర్మాణ, పెట్టుబడి సంస్థలు నకిలీ బాక్స్ ఆఫీస్ వసూళ్లను చూపే మార్గాలను తయారు చేసుకున్నాయి. ఒక సినిమా బాగా ఆడుతోందని బయటి లెక్కల్లో కనిపిస్తే.. ఆ సినిమాకు పెట్టుబడి పెట్టిన కంపెనీల షేర్లను జనం కొంటారు.
అంటే.. ఒక సినిమా ధియేటర్లలో ఉంటుంది. ఆ సినిమాకు పెట్టుబడి పెట్టిన సంస్థల్లో ఒకటి సినిమా థియేటర్లలో సెకండ్ షో టికెట్లన్నీ కొనేస్తుంది. అప్పుడు ఆ సినిమా హౌస్ ఫుల్‌గా ఆడుతున్నట్లు లెక్కలు నమోదవుతాయి. కానీ వాస్తవంలో ఆ థియేటర్లన్నీ ఖాళీగా ఉంటాయి.
ఈ తతంగాన్ని నియంత్రణ సంస్థలు కనిపెడుతున్నాయి. దీంతో నిర్మాతలు.. అన్ని షోలలో మిగిలిపోయిన టికెట్లు కొనడం ప్రారంభించారని చెప్తున్నారు.
అయినప్పటికీ.. అధికారులు ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. ఒక సినిమా ప్రదర్శస్తున్నపుడు థియేటర్‌లో అన్ని టికెట్లూ అమ్ముడుపోయాయన్నా.. ఖాళీ సీట్లు తక్కువగా ఉన్నట్లు కనిపించినా.. ఏదో తేడా ఉందని అనుమానిస్తున్నాయి.
మరయితే.. ఒక సినీ నిర్మాణ సంస్థ తన షేర్ల ధరలను లాభదాయకంగా పెంచుకోవాలంటే.. థియేటర్లలో ఎన్ని వందల, వేల టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది?
తమ థియేటర్ల టికెట్లు తమకే అమ్ముకుని...
ఆ సినిమా థియేటర్ల యాజమాన్య సంస్థే సదరు సినిమా నిర్మాత అయితే.. తన థియేటర్ల టికెట్లను తనకే అమ్ముకుంటుంది.
‘‘ఒక సినిమా ప్రదర్శన సంస్థ తన సొంత సినిమాలను పంపిణీ కూడా చేయొచ్చు.. తన సొంత సినిమా థియేటర్లలో కూడా ప్రదర్శించుకోవచ్చు’’ అని సినిమా జర్నలిస్ట్ జాన్ పాపిష్ అంటారు. ఆయన చైనా బాక్స్ ఆఫీస్ విషయంలో నిపుణుడు.
‘‘వాళ్లు తమ సొంత సినిమా థియేటర్లలో ఎన్ని షోలు ప్రదర్శించామన్న సంఖ్యను తారుమారు చేయొచ్చు. టికెట్లు విక్రయించే థర్డ్ పార్టీ యాప్స్ హస్తం కూడా ఈ సినిమాల ప్రమోషన్‌లో ఉంటుంది’’ అని ఆయన చెప్తారు.
అంటే.. ఒక కంపెనీ - లేదంటే పరస్పర సంబంధాలున్న కంపెనీలు - ఒక సినిమాను పంపిణీ చేయొచ్చు.. థియేటర్లను సొంతంగా కలిగి ఉండొచ్చు.. టికెట్ల విక్రయాల్లోనూ భాగంగా ఉండొచ్చు. ఇక ఆ సినిమాలకు రేటింగ్‌లు ఇచ్చే యాప్‌లకు కూడా ఇందులో ఆర్థికంగా వాటా ఉండి ఉండొచ్చు.
భారీ బడ్జెట్ సినిమా.. బాక్సాఫీస్‌లో ఫ్లాప్
దేశీయ పెట్టుబడులు విదేశాలకు తరలి వెళ్లకుండా పరిమితులు విధించే చైనా చట్టాలను తప్పించుకునే మార్గంగా కూడా కొన్ని సినిమాలను ఉపయోగించుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. ఒక వ్యక్తి అధికారిక అనుమతి లేకుండా.. ఏటా 50,000 డాలర్లకు మించి అంతర్జాతీయంగా బదిలీ చేయకూడదని చైనాలో పరిమితులు ఉన్నాయి.
అయితే.. ఒక సినిమా కోసం అంతర్జాతీయ నటులను కానీ, సెట్ కానీ, కస్ట్యూమ్ డిజైనర్లను కానీ తెచ్చుకోవడం ద్వారా ఈ నిబంధనల నుంచి బయటపడొచ్చని ఝో అంటారు.
ఉదాహరణకు.. ఒక హాలీవుడ్ నటుడు లేదా నటికి కోటి డాలర్లు చెల్లిస్తున్నట్లు సినిమా బడ్జెట్‌లో చూపించి.. వాస్తవంగా 20 లక్షల డాలర్లు మాత్రమే చెల్లిస్తారు. తద్వారా మిగతా 80 లక్షల డాలర్లను నిరాటంకంగా విదేశాలకు తరలించొచ్చు. అందుకు చైనా నుంచి అధికారికంగా అనుమతులు, రశీదులు అవసరం లేదు.
ఈ రకంగా భారీ బడ్జెట్ సినిమాలు పెరుగుతున్నాయి. వాటి మీద లాభాలు తక్కువ వచ్చినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర చూపుతున్నారు. దీంతో అవి ఫ్లాప్ సినిమాలుగా నమోదవుతున్నాయి.
‘‘చైనాలో అంతర్గతంగా చేసే ఖర్చులకయితే రశీదులు కచ్చితంగా అవసరం’’ అని ఝో తెలిపారు. అధికారులు దీనిని గుర్తించారని.. ఈ లోపాలను సరిదిద్దే చర్యలు చేపడుతున్నారని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
అయితే.. చైనా సినిమాలన్నీ ఇలాగే ఉన్నాయని కాదు. ఇటీవల లోబడ్జెట్‌తో నిర్మించిన ‘డయింగ్ టు సర్వైర్’ అనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్ అయింది. నిస్సహాయ నేరస్తుల బృందమొకటి చౌకైన క్యాన్సర్ మందులను స్మగుల్ చేయటానికి చేసే ప్రయత్నం ఈ సినిమా కథాంశం. చైనా సినీ రంగంలో నిజాయితీకి, నాణ్యతకు ఈ సినిమా నిదర్శనమని విమర్శకులు అంటున్నారు.
ఇవికూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)