కాలు లేదు. కేన్సరుంది. అయినా ఇంగ్లిష్ చానల్ ఈదటానికి సై

ఫొటో సోర్స్, vicki gilbert/twitter
ఇంగ్లిష్ చానల్ ఈదటం అనే ఆలోచనే మనలో చాలా మందికి భయం కలిగిస్తుంది. కానీ ఈ చాలెంజ్‌ని ఒక మహిళ ధైర్యంగా స్వీకరిస్తున్నారు. పైగా ఆమె అందరిలా సాధారణ మహిళ కాదు. వికీ గిల్బర్ట్ ఇరవై ఏళ్ల కిందట ఒక కాలు కోల్పోయారు. ముదిరిన దశలో ఉన్న రొమ్ము కేన్సర్‌కి ఇటీవలే చికిత్స పొందారు. ఈ సాహసానికి సిద్ధమవుతున్న వికీని బీబీసీ కరెస్పాండెంట్ ఫియోనా లామ్దిన్ కలిశారు.
వికీ గిల్బర్ట్ ఉదయం ఆరు గంటలకే సరస్సులో మూడు కిలోమీటర్లు ఈదారు. ఆమె త్వరలోనే సముద్రంలోని ఉప్పు నీటిలో ఈదుతారు. ఇంగ్లండ్ - ఫ్రాన్స్‌ల మధ్య ఉండే ఇంగ్లిష్ చానల్‌ను ఈదుతూ దాటుతారు.

ఫొటో సోర్స్, mychannelchallenge.blogspot
అది దృఢంగా, ఆరోగ్యంగా ఉండేవాళ్లకే పెద్ద చాలెంజ్. అలాంటిది.. ఒక కాలు కోల్పోయి, రొమ్ము కేన్సర్ నుంచి ఇంకా కోలుకుంటున్న వికీకి ఇది అలవిమాలిన పరీక్షే.
ఇరవై ఆరేళ్ల కిందట వికీకి బోన్ కేన్సర్ ఉందని చెప్పారు. ఆమె కుడి కాలును తీసేశారు. ఏడాది తర్వాత.. ఆమెకు కేన్సర్ అని పొరపాటుగా అంచనా వేశారని, నిజానికది నిరపాయకరమైన సిస్ట్ మాత్రమేనని చెప్పారు.
ఆపైన రెండేళ్ల కిందట మరో చేదు వార్త. వికీకి తీవ్రమైన రొమ్ము కేన్సర్ ఉందని వైద్య పరీక్షల్లో గుర్తించారు.

ఫొటో సోర్స్, mychannelchallenge.blogspot
సరస్సులో ఈత పూర్తిచేసుకుని వచ్చిన వికీని బీబీసీ ప్రతినిధి పలకరించారు. ''మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ బురద, ఈ నీళ్లు, ఈ చేతికర్ర, ఒకే కాలు.. ఇదంత సులభమైన విషయం కాదు'' అన్నారు.
''అదేం లేదు. ఇది కొంచెం కష్టమే. కొన్నిసార్లు చేతి కర్రతో నీటిలోకి వెళ్లటం కష్టం. అప్పుడు నేను కూర్చుని వెళ్తాను. అదంత ఇంపుగా ఉండదు. కానీ ఒకసారి నీటిలోకి వెళ్లానంటే.. అక్కడ లభించే స్వేచ్ఛ అద్భుతం'' అని ఆమె బదులిచ్చారు.

ఫొటో సోర్స్, mychannelchallenge.blogspot
రోజు వారీ శిక్షణ ముగిశాక క్రీడాకారిణి పాత్ర నుంచి తల్లి పాత్రలోకి మారుతారు వికీ.
కేన్సర్ గురించి ప్రస్తావించినపుడు.. ''అది నరకం. భయంకరం. కీమోథెరపీ చాలా దెబ్బతీస్తుంది. మనని చాలా దారుణంగా కుంగదీస్తుంది’’ అని ఆమె చెప్పారు.
కానీ ఇప్పుడు వికీకి ఇదంతా గతం. ఈ వేసవిలో ఇంగ్లిష్ చానల్‌ను ఈదబోతున్న రిలే టీమ్‌లో ఆమె భాగమవుతున్నారు. అందులోనూ చాలా బాధలున్నాయి. అలలు, జెల్లీఫిష్, సీసిక్‌నెస్ వంటివి కొన్ని. ఈ శిక్షణ, స్విమ్మింగ్.. కేన్సర్‌ను దూరంగా ఉంచుతాయన్నది వికీ ఆశ.

ఫొటో సోర్స్, mychannelchallenge.blogspot
''నువ్వు కుంగిపోకుండా ఎలా ధైర్యంగా ఉండగలుగుతున్నావు?' అని జనం నన్ను అడుగుతుంటారు. నాకు వేరే దారిలేదు. దీనితోనే నేను జీవించాలి. దీన్ని మార్చలేను. నా కాలు తిరిగి పెరగదు. కాబట్టి ఉన్నదాంట్లోనే ఉత్తమంగా జీవించాలి.’’
రొమ్ము కేన్సర్ తర్వాత.. నాకు కొత్త జీవితం లభించింది. కేన్సర్ తిరగబెట్టే ప్రమాదం శారీరక కసరత్తు వల్ల బాగా తగ్గిపోతుందన్న అవగాహన వచ్చింది. దీనిని ఇతరులతో పంచుకుని.. నా వంతు కృషి చేయాలన్నది నా ఆకాంక్ష'' అంటారు వికీ.
- మీ గర్ల్ ఫ్రెండ్‌కు సారీ ఎలా చెబుతారు?
- అటల్ బిహారీ వాజ్‌పేయి చితికి నిప్పంటించిన నమిత ఎవరు?
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- ‘ఆ మాటలు విన్న తర్వాత పిల్లలను కనాలంటేనే సిగ్గుగా ఉంటుంది’
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- పాము కాటు: ఏ పాములు ప్రమాదకరం? కాటేసినపుడు ఏం చేయాలి?
- వెనెజ్వేలా : కేజీ బియ్యం కొనాలంటే ఎన్ని కట్టల డబ్బు కావాలో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









