You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఏసీలు చల్లబరుస్తున్నాయా.. లేక వేడెక్కిస్తున్నాయా?
- రచయిత, క్రిస్ బరని
- హోదా, బీబీసీ ప్రతినిధి
వేసవిలో ఇళ్లు, ఆఫీసులు, దుకాణాలను చల్లగా చేసే ఏసీలు ప్రపంచాన్ని వేగంగా వేడెక్కించడంలో చాలా ముందున్నాయి. కానీ అవి వినియోగిస్తున్న అదనపు విద్యుత్ మొత్తం పర్యావరణాన్ని మరింత దారుణంగా మార్చేస్తోందా? దీనిని సమర్థంగా అడ్డుకోవచ్చా?
ప్రపంచం మరింత వేడెక్కుతోంది. 2001 నుంచి చూస్తే.. 16, 17 ఏళ్లలో వాతావరణం అత్యంత వేడిగా ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయినా, ఇళ్లలో ఎయిర్ కండిషనర్లు పెట్టుకోవడం కొత్తేం కాదు.
2050 నాటికి ఏసీల కోసం వాడే విద్యుత్తు మూడు రెట్లయ్యే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) తెలిపింది.
అంటే 2050కల్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్ కండిషనర్లు అమెరికా, ఈయూ, జపాన్ కలిసి ఎంత ఉత్పత్తి చేస్తాయో అంత విద్యుత్ వినియోగించుకోబోతున్నాయి.
అందుకే శాస్త్రవేత్తలు, సాంకేతిక సంస్థలు మరింత సమర్థమైన కూలింగ్ సిస్టమ్స్ తయారు చేసే ప్రయత్నంలో ఉన్నారు.
ఉదాహరణకు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేసిన ఒక సిస్టం, "నానో ఫోటానిక్స్", అత్యాధునిక పదార్థాలను వినియోగించుకుంటుంది.
వారు చాలా పలచగా, ఎక్కువ ప్రతిబింబించేలా ఒక పదార్థాన్ని కనుగొన్నారు. అది నేరుగా పడే సూర్యరశ్మి నుంచి కూడా వేడి ప్రసరించేలా చేస్తుంది.
ఇన్‌ఫ్రారెడ్, థర్మల్ శక్తి ఒక తరంగదైర్ఘ్యంలో వెలువడుతాయి. వాటిని భూమి పీల్చుకోడానికి బదులు, ఈ పదార్థం ద్వారా అవి భూ వాతావరణం నుంచి అంతరిక్షంలోకి చేరుతాయి.
ఈ మెటీరియల్‌తో చేసిన ప్యానెళ్ల అడుగున ఉన్న పైపుల్లో ప్రవహించే నీళ్లను చల్లబరిచేందుకు ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గుర్తించారు. ఆ నీళ్లు సగటున బయటి ఉష్ణోగ్రత కంటే కొన్ని డిగ్రీలు తక్కువగా చల్లబడుతాయి. తర్వాత వాటిని ఒక భవనాన్ని చల్లబరిచేందుకు కూడా ఉపయోగించవచ్చు. విద్యుత్ అవసరం లేకుండానే దీనిని చేయవచ్చు.
ఈ సాంకేతికతను కమర్షియలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్న పరిశోధకులు స్కైకూల్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేశారు.
భవిష్యత్తులో వచ్చే ఎయిర్ కండిషనర్లు మనం ఇప్పుడు చూస్తున్న వాటి కంటే రెట్టింపు సమర్థతతో పనిచేస్తాయని మనం ఆశించవచ్చని ఫ్లోరిడా సెంట్రల్ యూనివర్సిటీ, సోలార్ ఎనర్జీ కేంద్రంలో ఉండే డానీ పార్కర్ తెలిపారు.
ఎయిర్ కండిషనర్లు, హీటింగ్ సిస్టమ్స్‌ను మరింత సమర్థంగా తయారు చేసే మార్గాలను వెదికేందుకు పార్కర్, ఆయన సహచరులు కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉదాహరణకు 2016లో సంప్రదాయ ఎయిర్ కండిషనర్లలోకి చల్లటి గాలిని పంపేందుకు, వాటికి నీటి ఆవిరితో చల్లార్చే పరికరాలను జోడించవచ్చని వారు కనుగొన్నారు.
వీటిని అమర్చడం వల్ల ప్రస్తుతం ఉపయోగించే ఎయిర్ కండిషనర్లు, లోపలికి వచ్చే గాలిలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఎక్కువ శ్రమించాల్సిన అవసరం లేకుండా పోతుంది.
చాలా యూరోపియన్ దేశాల్లోని వాతావరణాల్లో ఇలాంటి వ్యవస్థల వల్ల ఏసీల చల్లబరిచే సామర్థ్యం 30 శాతం నుంచి 50 శాతం వరకూ మెరుగు పడుతుందని వాళ్లు లెక్కలేశారు.
సామ్‌సంగ్ 'విండ్ ఫ్రీ' టెక్నాలజీని రూపొందించింది. అది చల్లటి గాలిని ఒక గదిఅంతా మెల్లగా నెడుతుంది. ఒకసారి అవసరమైన ఉష్ణోగ్రతను చేరుకోగానే.. విద్యుత్ ఎక్కువగా వినియోగించే ఫ్యాన్ల అవసరం లేకుండా అది గాలిని చాలా వేగంగా అందిస్తూ ఉంటుంది.
సంప్రదాయ ఎయిర్ కండిషనర్ల కంటే ఇవి 32 శాతం అధిక సమర్థంగా పనిచేస్తాయని ఆ సంస్థ చెబుతోంది.
సమర్థమైన ఎయిర్ కండిషనర్లు మార్కెట్లో ఇప్పటికే చాలా ఉన్నాయి.
ఇవి దగ్గరగా ఉన్న గాలి ఉష్ణోగ్రత సెన్సర్ రీడింగ్స్ బట్టి చల్లదనం తీవ్రతను సర్దుబాటు చేసుకుంటాయి. అవి ఆగకుండా నడవగలవు. కానీ తక్కువ స్థాయిలో మాత్రమే.
కాలంతోపాటూ, ఒకే వేగంతో నడిచే అతి సాధారణ ఎయిర్ కండిషనర్ కంటే మరింత సమర్థతతో పనిచేస్తుంది. వాటిని సరైన ఉష్ణోగ్రతలో ఎప్పుడూ ఆన్ చేసి ఉంచవచ్చు.
నడవకుండా ఉన్నట్టు కనిపించినప్పుడు, అవి చాలా సమర్థంగా నడుస్తుంటాయి అని పార్కర్ అన్నారు.
"చైనా లాంటి దేశాల్లో సమర్థమైన ఏసీలను అమ్మడం ఇప్పటికీ కష్టం కావచ్చని" లండన్ ఇంపీరియల్ కాలేజీలో శక్తి వనరుల నిపుణుడు లెయిన్ స్టాఫెల్ చెప్పారు.
"ఆ దేశంలో జనం వీలైనంత చౌకగా ఉండే ఏసీలు కొనాలనుకుంటారు. విద్యుత్ ధర గురించి వాళ్లు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే చైనాలో విద్యుత్ చాలా చౌక" అని ఆయన చెప్పారు.
విద్యుత్ సామర్థ్య ప్రమాణాలను పెంచేందుకు, మార్కెట్లో ఉత్పత్తులకు లేబులింగ్ ఇవ్వడానికి ఆ దేశంలోని ఎనర్జీ గ్రూప్స్ ఈ ఏడాది ప్రారంభంలో ఒక కార్యక్రమం ప్రారంభించాయి.
మన దగ్గర ఉన్న ఎయిర్ కండిషనర్లను చక్కగా పనిచేసేలా చూసుకోవడం ద్వారా మనం చాలా విద్యుత్ ఆదా చేయచ్చు.
ఉదాహరణకు టాడోస్ 'స్మార్ట్ ఏసీ కంట్రోల్' అనే ఒక రిమోట్ కనెక్టెడ్ యాప్, ఎవరైనా గదిలో నుంచి బయటకు వెళ్లగానే ఎయిర్ కండిషనర్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఆన్ లైన్ వాతావరణ సూచనలకు అనుగుణంగా అది చల్లబరిచే వేగాన్ని కూడా మార్చుకుంటుంది.
ఇలాంటి మెరుగైన నిర్వహణ ద్వారా విద్యుత్ వినియోగాన్ని 40 శాతం వరకూ తగ్గించవచ్చని టాడో చెబుతోంది.
ఒక వేళ, వారు వినియోగిస్తున్న విద్యుత్ అంతా పునరుత్పాదకత వనరుల ద్వారా ఉత్పత్తి అయినదే అయితే, ఎయిర్ కండిషనర్ల డిమాండ్ పెరగడం అనేది పెద్ద సమస్య కాదు.
ఇళ్లు, భవనాలను చల్లబరిచేందుకు ఉపయోగించే ఎయిర్ కండిషనర్ల విద్యుత్ డిమాండ్ చాలా త్వరగా పెరగడం తాము గుర్తించామని మదర్‌వే చెప్పారు.
కేవలం ఉష్ణోగ్రతలు పెరగడం వల్లే కాదు, పెరుగుతున్న ఆదాయం వల్ల కూడా ఇది జరుగుతోంది. అలాంటి దేశాలు చాలా వరకూ గ్లోబల్ వార్మింగ్ ప్రభావానికి గురికావచ్చని ఆయన చెప్పారు.
వచ్చే 30 ఏళ్లలో ఏసీల భవిష్యత్ పెరుగుదల అంచనాలో సగభాగం చైనా, భారత్, ఇండోనేసియాల నుంచే ఉంటాయని భావిస్తున్నారు.
వ్యాపార సాంకేతికత
ఐహెచ్ఎస్ మార్కిట్స్ హోమ్ అప్లయన్స్ ఇంటెలిజెన్స్ సర్వీస్, 2016లో ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల ఎయిర్ కండిషనర్లు ఉపయోగిస్తున్నారని, కానీ ఏడాది తర్వాత ఈ సంఖ్య 16 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)